బాబు ‘పీ 4’ జపం.. ఇక వైద్యం ప్రైవేట్‌ప‌రం

ఐదు కొత్త ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు సర్కారు మోకాలడ్డు

ప్రైవేట్‌కు కట్టబెట్టేందుకు అనుమతులను అడ్డుకుని విద్యార్థుల ఆశలపై నీళ్లు

బాబు ప్రైవేట్‌ మోజుతో ఈ ఒక్క ఏడాదే 700 ఎంబీబీఎస్‌ సీట్లు కోల్పోయిన రాష్ట్రం

పులివెందులకు ఎన్‌ఎంసీ మంజూరు చేసిన 50 సీట్లను ఏకంగా లేఖ రాసి అడ్డుకున్న బాబు సర్కార్‌ 

వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన ఏడు కాలేజీల నిర్మాణ పనులూ అటకెక్కించిన వైనం  

దీంతో మరో 1,050 సీట్లు.. మొత్తంగా 12 కాలేజీల ద్వారా 1,800 సీట్లు కోల్పోతున్న విద్యార్థులు 

లక్షలాది మంది వైద్య విద్యార్థుల భవిష్యత్‌ అగమ్యగోచరం

 అమరావతి: రాష్ట్ర విద్యార్థుల వైద్య విద్య కలలను సీఎం చంద్రబాబు ప్రభుత్వం చిధ్రం చేసింది. ‘పీ 4’ జపం చేస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌కు కట్టబెట్టే కుట్రకు తెర తీసింది. అందులో భాగంగానే ఐదు ప్రభుత్వ కొత్త మెడికల్‌ కాలేజీలకు నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) నుంచి అనుమతులు రాకుండా తాజాగా అడ్డుపడింది. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ కొత్త మెడికల్‌ కళాశాలలు ప్రారంభమైతే తమకు వైద్య విద్య చదివే అవకాశం లభిస్తుందని కోటి ఆశలు పెట్టుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులకు కూటమి సర్కారు వెన్నుపోటు పొడిచింది. దీంతో ఈ ఒక్క ఏడాదే ఏకంగా 700 ఎంబీబీఎస్‌ సీట్లను రాష్ట్రం కోల్పోయింది. 

సాధారణంగా ముఖ్యమంత్రులంతా కొత్తగా వైద్య కళాశాలలకు అనుమతులు రాబట్టి విద్యార్థులకు అదనంగా ఎంబీబీఎస్‌ సీట్లు సమకూర్చడం కోసం శక్తివంచన లేకుండా కృషి  చేస్తుంటారు. ఇందుకు భిన్నంగా దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనట్లుగా.. ఎన్‌ఎంసీ సీట్లు ఇస్తామన్నప్పటికీ మాకు వద్దని రాష్ట్ర ప్రభుత్వమే లేఖ రాసిన దుస్థితి చంద్రబాబు పాలనలో ఏపీలో నెలకొంది. గత ప్రభుత్వం తలపెట్టిన 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను గుజరాత్‌ పీపీపీ మోడల్‌లో ప్రైవేట్‌కు కట్టబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 

ఈమేరకు ఈ ఏడాది ప్రారంభించాల్సిన ఐదు వైద్య కళాశాలలకు కుట్రపూరితంగా ప్రభుత్వమే పొగ పెట్టింది. మరోవైపు వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన ఏడు వైద్య కళాశాలల నిర్మాణ  పనులను ఇప్పటికే ప్రభుత్వం అటకెక్కించింది. వీటి ద్వారా వచ్చే ఏడాది అందుబాటులోకి రావాల్సిన వెయ్యికి పైగా ఎంబీబీఎస్‌ సీట్లపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వ రంగంలో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటైతే మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలు మెరుగుపడటంతోపాటు పేదలకు సూపర్‌ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువలో అందుతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకునే ప్రతి పార్లమెంట్‌ నియోజక వర్గానికి ఒక మెడికల్‌ కాలేజీని నెలకొల్పాలని గత ప్రభుత్వం భావించింది. 

ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్‌ కాలేజీలు ఏర్పాటైతే మరింత మంది డాక్టర్లు, వైద్య సిబ్బంది సేవలు అందుబాటులోకి వస్తాయి. బోధనాస్పత్రులకు వచ్చే రోగులకు సులభంగా నాణ్యమైన వైద్య  సేవలు అందుతాయి. తద్వారా పోటీతత్వం పెరిగి ప్రైవేట్‌ రంగంలో కూడా వైద్య చికిత్స వ్యయం తగ్గుతుంది. అయితే ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిన కూటమి సర్కారు ప్రైవేట్‌ పాట పాడుతోంది.

సర్వం సిద్ధం చేసినా ససేమిరా..
2024–25 విద్యా సంవత్సరం నుంచి మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, ఆదోని, పాడేరు నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 150 చొప్పున మొత్తం 750 ఎంబీబీఎస్‌ సీట్లతో అడ్మిషన్లు ప్రారంభించేలా వైయ‌స్ఆర్‌సీపీ హయాంలో వైయ‌స్‌ జగన్‌ కృషి చేశారు. జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) నిబంధనలకు అనుగుణంగా ఐదు చోట్ల బోధనాస్పత్రులను అభివృద్ధి చేశారు. 

కళాశాల, బోధనాస్పత్రుల్లో అవసరమైన పోస్టులను మంజూరు చేసి ఎన్నికలు ముగిసే నాటికి 70–80 శాతం పోస్టుల భర్తీ చేపట్టారు. తొలి ఏడాది తరగతులు ప్రారంభించడానికి వీలుగా కళాశాలలో సెమినార్‌ హాల్, ల్యాబొరేటరీ, లైబ్రరీ, హాస్టళ్ల నిర్మాణాలు 80 శాతం పూర్తి అయ్యాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీటిని ప్రైవేట్‌పరం చేయాలన్న నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు సాధించకుండా పొగ పెట్టింది.

వద్దని ప్రభుత్వమే లేఖ..
కొత్త కాలేజీల్లో తొలి విడత తనిఖీల అనంతరం ఐదు చోట్ల స్వల్పంగా వనరుల కొరత ఉందని పేర్కొంటూ ఎన్‌ఎంసీ అనుమతులు నిరాకరించింది. ఎన్‌ఎంసీ గుర్తించిన అంశాలను మెరుగు పరచడానికి ఏమాత్రం చర్యలు తీసుకోకుండానే మొక్కుబడిగా చంద్రబాబు ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్లింది. అయినప్పటికీ గత ప్రభుత్వం కల్పించిన వసతుల ఆధారంగానే పులివెందుల వైద్య కళాశాలకు 50 సీట్లను మంజూరు చేస్తూ ఈ నెల 6వ తేదీన ఎన్‌ఎంసీ లెటర్‌ ఆఫ్‌ పర్మిషన్‌ (ఎల్‌ఓపీ) ఇచ్చింది. 

అయితే ఈ కళాశాలను ప్రైవేట్‌ పరం చేయాలనే ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు ప్రభుత్వానికి ఆ 50 సీట్లతో కళాశాలలను ప్రారంభించేందుకు మనస్కరించలేదు. దీంతో 50 సీట్లు మంజూరు చేసినప్పటికీ కళాశాలలో మేం వసతులు కల్పించలేమని సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే ఎన్‌ఎంసీకి లేఖ రాసింది. ఫలితంగా చేసేదేమీ లేక 50 సీట్లతో ఇచ్చిన ఎల్‌ఓపీని విత్‌డ్రా చేసినట్టు ఎన్‌ఎంసీ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు అనుమతులు రద్దు చేసినట్టు స్పష్టం చేసింది.

ఉసూరుమన్న విద్యార్థులు, తల్లిదండ్రులు
పులివెందుల కాలేజీకి 50 సీట్లు మంజూరు చేసినట్లు ఎన్‌ఎంసీ ప్రకటించిన అనంతరం ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం కన్వీనర్‌ కోటా ఆప్షన్ల నమోదు గడువును పొడిగించింది. బుధవారం (11వ తేదీ) రాత్రితో గడువు ముగిసింది. దీంతో కొత్తగా మంజూరైన పులివెందుల కాలేజీలో ప్రవేశాలు పొందవచ్చని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆశ పడ్డారు. అయితే ఆ కళాశాల ఆప్షన్లలో కనిపించకపోవడంతో ఉసూరుమన్నారు.

అండర్‌ టేకింగ్‌ ఇచ్చి ఉంటే..
సాధారణంగా వైద్య కళాశాలల్లో ఎన్‌ఎంసీ తొలి విడత తనిఖీల అనంతరం వసతుల కొరత ఉంటే అనుమతులివ్వదు. ఆ లోపాలను సవరించుకుని అప్పీల్‌కు వెళితే రెండో విడత తనిఖీలు చేసి అనుమతులిస్తారు. అదే ప్రభుత్వ కళాశాలలైతే తరగతులు ప్రారంభం అయ్యే నాటికి వసతుల కల్పన చేపడతామని ప్రభుత్వం అండర్‌ టేకింగ్‌ ఇస్తే ఎన్‌ఎంసీ ఎల్‌ఓపీ ఇచ్చేస్తుంది. 

గతేడాది నంద్యాల, మచిలీపట్నం, ఏలూరు, రాజమహేంద్రవరం వైద్య కళాశాలలకు అండర్‌ టేకింగ్‌ ఇచ్చి వంద శాతం సీట్లను వైయ‌స్‌ జగన్‌ ప్రభుత్వం రాబట్టింది. అదే తరహాలో ప్రస్తుతం కూటమి సర్కారు కూడా అండర్‌ టేకింగ్‌ ఇచ్చి ఉంటే వంద శాతం సీట్లకు అనుమతులు లభించి ఉండేవన్న అభిప్రాయం వైద్య వర్గాల్లో వ్యక్తం అవుతోంది.  

నిర్మాణాల నిలుపుదల
ప్రై వేట్‌పరం చేయడంలో భాగంగా నూతన ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాలను సైతం కూటమి సర్కారు నిలిపివేసింది. ఈ ఏడాది ప్రారంభించాల్సిన ఐదు కళాశాలలతో పాటు వచ్చే ఏడాది ప్రారంభించాల్సిన ఏడు కళాశాలల నిర్మాణం కూటమి ప్రభుత్వం వచ్చాక పూర్తిగా నిలిచిపోయింది. 

ప్రభుత్వం పీపీపీ విధానంలో ముందుకు వెళ్లనుందని, అందువల్ల నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు అందాయి. దీంతో ఆదోని, పెనుకొండ కళాశాలల నిర్మాణం ఎక్కడికక్కడే నిలిపివేయాలని కర్నూలు సర్కిల్‌ ఏపీఎంఎస్‌ఐడీసీ ఎస్‌ఈ లిఖితపూర్వకంగా ఉత్తర్వులు ఇచ్చారు.
 
వందేళ్ల చరిత్రలో తొలిసారిగా..
2019లో వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.8 వేల కోట్లకుపైగా నిధులతో ఒకేసారి 17 వైద్య కళాశాలలు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను గతేడాది ప్రారంభించి అదనంగా 750 ఎంబీబీఎస్‌ సీట్లలో ప్రవేశాలు కల్పించింది. 

1923లో ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా మెడికల్‌ కాలేజీ ఏర్పాటైంది. అప్పటి నుంచి 2023 వరకు రాష్ట్రంలో పూర్తిగా ప్రభుత్వ రంగంలో కేవలం 11 వైద్య కళాశాలలు మాత్రమే ఉండగా వందేళ్ల చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి 17 ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల నిర్మాణాన్ని వైయ‌స్‌ జగన్‌ చేపట్టారు.

మోసం చేశారు..
నీట్‌ యూజీలో నేను 593, నా సోదరి 555 స్కోర్‌ చేశాం. గతేడాదితో పోలిస్తే కటాఫ్‌లు ఎక్కువగా ఉన్నాయి. రెండేళ్లు లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ తీసుకున్నా సీట్‌ రావడం కష్టంగా ఉంది. గతేడాది ఏపీకి అదనంగా 750 ఎంబీబీఎస్‌ సీట్లు వచ్చాయి. ఈసారి కూడా 750 సీట్లు అదనంగా వస్తే వైద్య విద్య అవకాశాలు పెరిగి మా కల నెరవేరుతుందని భావించాం. కానీ కొత్త వైద్య కళాశాలలకు అనుమతులు రాలేదు. 

పులివెందుల కాలేజీకి 50 సీట్లతో అనుమతులు వచ్చాయని ఎన్‌ఎంసీ ప్రకటించినా కౌన్సెలింగ్‌లో చూపించడం లేదు. దీనివల్ల నాలాంటి ఎందరో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొత్త కళాశాలల్లో సెల్ఫ్‌ ఫైనాన్స్‌ విధానం రద్దు చేస్తామని హామీ ఇచ్చిన టీడీపీ మాట నిలబెట్టుకోకుండా మమ్మల్ని మోసం చేసింది.
– నల్లగట్ల సుధీష్‌ రెడ్డి, రాజంపేట, అన్నమయ్య జిల్లా  

Back to Top