కుట్ర ప్రకారమే నాపై హత్యాయత్నం

 

- అది విఫలమైతే మా పార్టీపైనే బురద చల్లాలని కూడా కుట్ర చేశారు 
- వెంటనే నిష్పాక్షికంగా విచారణ జరిపించాలి
- కేంద్ర హోంమంత్రికి ప్రతిపక్ష నేత జగన్‌ లేఖ
- పక్కా స్క్రిప్ట్‌ ప్రకారం డీజీపీ, సీఎం మాట్లాడి అసలు విషయాన్ని పక్కదోవ పట్టించారు 
- రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలకు అనుగుణంగా తన ఆధీనంలోని దర్యాప్తు సంస్థను ప్రేరేపిస్తోంది 
- ఆ విచారణ ముందస్తు నిర్థారణతో సాగుతోంది 
- నిజాలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని సంస్థతో దర్యాప్తు జరిపించాలి
 న్యూఢిల్లీ: తనపై జరిగిన హత్యాయత్నం వెనుక నిజాలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరుతూ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖ రాశారు. ఈ లేఖను వైయ‌స్ఆర్‌  సీపీ నేతలు సోమవారం రాజ్‌నాథ్‌కు అందజేశారు. లేఖ పూర్తి పాఠం ఇదీ..

‘రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న ప్రమాదకర పరిస్థితులను మీ దృష్టికి తేవాలని ఈ లేఖ రాస్తున్నా. 2018 అక్టోబరు 25న సుమారు మధ్యాహ్నం 12.40 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్టు వీఐపీ లాంజ్‌లో గుర్తు తెలియని దుండగుడి చేతిలో హత్యాయత్నానికి గురయ్యా. సెల్ఫీ ఫోటో తీసుకోవాలంటూ నాకు అత్యంత చేరువగా వచ్చి పదునుగా ఉన్న సాధనంతో నా గొంతును ఖండించేందుకు ప్రయత్నించాడు. నేను వెంటనే స్పందించి ఆత్మరక్షణ కోసం మెడకు తగలకుండా భుజాన్ని అడ్డుపెట్టడంతో నా ఎడమ భుజానికి తీవ్ర గాయమైంది. మూడు నుంచి నాలుగు సెంటీమీటర్ల లోతున కోసుకుపోయింది. దుండగుడిని వెంటనే పట్టుకుని అక్కడ ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందికి అప్పగించారు.

ఎయిర్‌పోర్టులో ఉన్న డ్యూటీ డాక్టర్‌ నాకు అవసరమైన ప్రాథమిక చికిత్స అందజేశారు. నాపై జరిగిన హత్యాయత్నం వార్తలతో రాష్ట్రంలో తీవ్రమైన అలజడి రేకెత్తే ప్రమాదం ఉందని గ్రహించా. రాష్ట్ర ప్రజలు నా క్షేమంపై ఆందోళన చెందకుండా ఉండాలన్న ఆలోచనతో రక్తంతో తడిచిన నా చొక్కాను మార్చుకుని కనీస ప్రాథమిక చికిత్స, గాయానికి డ్రెసింగ్‌ చేయించుకుని షెడ్యూలు ప్రకారం మధ్యాహ్నం 1.05 గంటల విమానానికి హైదరాబాద్‌ బయలుదేరా. హైదరాబాద్‌ చేరుకున్న వెంటనే నన్ను సిటీ న్యూరో ఆసుపత్రికి చికిత్స కోసం తీసుకెళ్లారు. భుజానికి అయిన లోతైన గాయాన్ని వైద్యులు పరీక్షించి శస్త్రచికిత్స నిర్వహించి 9 కుట్లు వేశారు. దుండగుడు విషమేదైనా వాడాడేమోనన్న అనుమానంతో రక్త నమూనాలను తదుపరి వైద్య పరీక్షల కోసం పంపారు. 

రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చి లోపభూయిష్ట విధానంలో ఈ సంఘటనపై దర్యాప్తు ప్రారంభించింది. ఉద్దేశపూర్వకంగానే ముందస్తుగా ఒక ముగింపునకు వచ్చి ఇది నేను అధ్యక్షుడిగా ఉన్న వైఎస్సార్‌ సీపీలో జరిగిన అంతర్గత కుట్రగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. ఈ హత్యాయత్నం జరిగిన కొద్ది సేపటికే రాష్ట్ర డీజీపీ మీడియా ముఖంగా ఒక ప్రకటన చేశారు. దుండగుడు ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చనే హత్యాయత్నానికి పాల్పడ్డాడని ప్రాథమిక దర్యాప్తు సంకేతాలిస్తోందని డీజీపీ ప్రకటించారు. నిర్ధిష్టత లేకుండా ఇలా వేగంగా ఇచ్చిన ప్రకటన ఈ హత్యాయత్నాన్ని చిన్న అంశంగా చూపి, అధికార టీడీపీ ప్రయోజనాలకు అనుగుణంగా చేసిన ప్రయత్నం. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం నాపై జరిగిన దిగ్భ్రాంతికర హత్యాయత్నాన్ని చిన్నదిగా చేసే నిగూఢ ఉద్దేశంతో పనిచేస్తోందని ఈ ప్రయత్నం తెలియపరుస్తోంది. 

నేను ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా ఈ హత్యాయత్నం ప్రణాళికబద్ధంగా అంతర్గతంగా జరిగిందని, రానున్న ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు చేసిన యత్నం అని రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, టీడీపీ సభ్యులు మీడియాలో పలుసార్లు ప్రకటనలు జారీ చేశారు. దర్యాప్తు ప్రక్రియను పక్కదారి పట్టించేందుకు, ముందస్తుగా నిర్దేశించిన దారిలోకి మళ్లించేందుకు ఎంచుకున్న క్రూరమైన  ప్రయత్నం ఇది. 

ఆంధ్రప్రదేశ్‌ గౌరవ ముఖ్యమంత్రి తదుపరి ఒక పాత్రికేయుల సమావేశంలో నాపై, వైఎస్సార్‌ సీపీపై జుగుప్సాకరంగా మాట్లాడారు. దుండగుడి నుంచి 10 పేజీల లేఖను స్వాధీనపరుచుకున్నామని, దుండగుడు వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుడని ఈ లేఖ ద్వారా తెలిసిందని, దుండగుడి ఇంటిని తనిఖీ చేస్తుండగా స్వర్గీయ రాజశేఖర్‌రెడ్డి ఫోటో దొరికిందని ప్రకటించారు. సానుభూతి కోసం వైఎస్సార్‌ సీపీ ఈ దాడికి పథక రచన చేసిందని ఈ ప్రకటన ద్వారా ముఖ్యమంత్రి ఆరోపించారు. ముఖ్యమంత్రి చేసిన ఈ దురుద్ధేశపూరిత  ప్రకటనలు అంతకుముందు చేసిన డీజీపీ ప్రకటనకు మద్దతుగా నిలిచేలా ఉన్నాయి. రాష్ట్ర దర్యాప్తు సంస్థ చేపట్టిన ఈ దర్యాప్తు నిజాయితీ లేనిది, వాస్తవాలను వెలికి తీయనిది. ఈ దర్యాప్తు  ముందస్తుగా ఓ నిర్ధారణకు వచ్చింది. 

ఆ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో గౌరవ ముఖ్యమంత్రి ఈ క్రూరమైన హత్యాయత్నాన్ని పలుచన చేసేదిగా చిత్రీకరించేందుకు దీన్ని ‘ఆపరేషన్‌ గరుడ’ పేరుతో సృష్టించిన స్క్రిప్ట్‌ సంబంధిత ఘటనగా పేర్కొన్నారు. ‘ఆపరేషన్‌ గరుడ’ను రాష్ట్రంలో పాలనా వ్యవహారాలను అస్థిర పరిచేందుకు వైఎస్సార్‌ సీపీ, బీజేపీ కలసి పన్నిన కుట్రగా ఆయన అభివర్ణించారు. నా ప్రాణాలను హరించేలా జరిగిన ఈ హత్యాయత్నం.. ‘ఆపరేషన్‌ గరుడ’ అన్న భావనను ప్రచారంలోకి తెచ్చిన, టీడీపీ సానుభూతిపరుడైన ఓ వ్యక్తి చెప్పిన తీరుగానే జరిగింది. ఈ హత్యాయత్నం నన్ను చంపేందుకు చేసిన కుట్ర అని, ఒక వేళ అది విఫలమైతే ఈ ఘటనను నాపై, నా పార్టీపై బురదజల్లేందుకు వాడుకోవాలని పన్నిన కుట్ర అని నాలో ఉన్న అనుమానాలకు గడిచిన 24 గంటలుగా టీడీపీ ప్రభుత్వం నాపై, నా పార్టీపై చేసిన ఆధారం లేని నిందారోపణలు బలం చేకూర్చాయి. అందువల్ల రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో దర్యాప్తు సంస్థలు ఈ ఘటనపై దర్యాప్తు జరిగితే అవి ప్రభావవంతంగా వాటి విధులు నిర్వర్తించలేవు. 

నేర ఘటనలో బాధితుడు న్యాయమైన విచారణకు, నిష్పాక్షికమైన దర్యాప్తు కోరుకునేందుకు అర్హుడు. ఏ దర్యాప్తు అయినా న్యాయంగా, పారదర్శకంగా, చట్టబద్ధంగా ఉండాలి. పక్షపాతంగా ఉండకూడదు. నిగూఢ ఉద్దేశంతో ఉండకూడదు. ముందస్తు నిర్ధారణకు రాకుండా, ముందస్తుగానే ఒక నిర్ణయానికి రాకుండా తగిన సాక్ష్యాధారాలను సేకరించడం, దర్యాప్తు నిర్వహించడం న్యాయమైన దర్యాప్తులో కీలక అంశాలు. దుండగుడి నేరానికి సంబంధించి  పూర్తి సాక్ష్యాలు ఉన్నప్పటికీ రాష్ట్ర దర్యాప్తు సంస్థలు వైయ‌స్ఆర్‌  సీపీలో జరిగిన అంతర్గత కుట్ర అన్న కోణంలో ఈ దర్యాప్తు ప్రక్రియను నడిపిస్తున్నాయి. నిష్పాక్షికమైన దర్యాప్తు జరగడం లేదనడానికి, రాష్ట్ర దర్యాప్తు సంస్థ పక్షపాతం లేకుండా దర్యాప్తు జరపగలదా? అన్న  అనుమానాలను రేకెత్తించేందుకు ఇవి స్పష్టమైన, నిర్ధిష్టమైన సంకేతాలు. 

రాష్ట్ర ప్రభుత్వం తన అవసరాలకు అనుగుణంగా దర్యాప్తు సంస్థను ప్రేరేపిస్తున్న నేపథ్యంలో మీరు తక్షణం జోక్యం చేసుకోవాలని కోరుతున్నా. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేని దర్యాప్తు సంస్థకు విచారణ బాధ్యతలు అప్పగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నా. ఈ చర్య దర్యాప్తును మలినం చేయకుండా ఉంటుంది. దాడి వెనక వాస్తవాలను వెలికితీసేందుకు దోహదపడుతుంది. నేరస్తులకు శిక్ష పడేలా చేస్తుంది..’     
    భవదీయుడు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి 
 


తాజా వీడియోలు

Back to Top