బోట్ల చోరీలో టీడీపీ నేతల హస్తం

మాజీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి 

 నెల్లూరు: నెల్లూరులో పోలీసుల ఆధీనంలో ఉ‍న్న బోట్లు దొంగలించుకుపోతే ఇంత వరకు చర్యలు ఎందుకు లేవని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బోట్ల చోరీ వెనుక ఉన్న టీడీపీ నేతలను ఎందుకు వదిలేశారని అడిగారు. చోరీ వెనుక పోలీసులు, టీడీపీ నేతల హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కాకాణి నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..‘స్థానిక మత్స్యకారులు తమ ప్రాణాలకు తెగించి తమిళనాడు బోట్లు తీసుకొచ్చి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై బిట్రగుంట, కావలి రూరల్‌లో  పోలీసులు కేసు  నమోదు చేశారు. అయితే, పోలీసుల ఆధీనంలో ఉన్న బోట్లు ఎలా మాయం అ‍య్యాయి.. ఇంతవరకు ఎందుకు చర్యలు లేవు?. సంబంధిత అధికారుల మీద ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?. 
బోట్ల చోరీ వెనుక ఉన్న టీడీపీ నేతలను ఎందుకు వదిలేశారు?.

మంత్రులు ఎందుకొచ్చారో.. అధికారులకు ఏం ఆదేశాలు ఇచ్చారో అర్థం కావడం లేదు. బోట్ల చోరీ విషయంలో మత్స్యకారులకు వైయ‌స్ఆర్‌సీపీ అండగా ఉంటుంది. చోరీ వెనుక పోలీసులు, టీడీపీ నేతల హస్తం ఉంది. తమిళనాడులో ఉండే బోట్లను వెనక్కి తీసుకొచ్చి.. జువ్వలదిన్నెలో పెట్టాలి. ఫిషింగ్ హార్బర్ ప్రైవేటీకరణతో పాటు బోట్ల చోరీ మీద వైయ‌స్‌ జగన్‌ ప్రత్యేక దృష్టి పెట్టారు. మత్స్యకారులకు మేము అండగా ఉంటాం. అవసరమైతే వైయ‌స్‌ జగన్ కూడా మత్సకారులతో మాట్లాడేందుకు నెల్లూరుకు రావచ్చు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. 

Back to Top