ప్ర‌త్యేక హోదా కోసం నిర‌వ‌ధిక నిరాహార దీక్ష‌

జ‌నం కోసం జ‌న నేత నిర్ణ‌యం

ప్ర‌తిప‌క్ష నేత‌ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. ఈరోజు నుంచి ఈనెల 15 వరకు ప్రత్యేకహోదా  రాకపోతే ..మరుక్షణమే గుంటూరులో నిరవధిక నిరహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. అసెంబ్లీలో చంద్రబాబు అనుసరించిన తీరు రాష్ట్రప్రజలంతా చూశారని జగన్ అన్నారు. తాను తీర్మానం కోసం పట్టుబడితే చంద్రబాబు ముందుకొచ్చారని చెప్పారు. సభ ఆమోదించిన తీర్మానానికి బలం రావాలంటే కేంద్రానికి ఓ టైమివ్వాలన్నారు. ఆలోగా స్పందించకపోతే కేంద్రంలో మంత్రులను ఉపసంహరించుకోవాలని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంత్రులు బయటకు వస్తేనే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందన్నారు

విభజన సమయంలో రాజ్యసభలో అప్పటి అధికార,ప్రతిపక్షాలు రాష్ట్రానికి ప్రత్యేకహోదా హామీ ఇచ్చి గాలికొదిలేశారని విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి 15 నెలలవుతున్నా హామీని సాధించలేకపోయారని ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో బాబు మోడీ వద్ద మోకరిల్లడంతో కేంద్రం కూడా ప్రత్యేకహోదాను లైట్ గా తీసుకుంటుందని జగన్ ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు మెడలు వంచుతామన్నారు. 

చంద్రబాబు  ఢిల్లీలో ఉన్నప్పుడు ఓమాట, విజయవాడలో ఉన్నప్పుడు మరో మాట మాట్లాడుతూ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని జగన్ మండిపడ్డారు. వారి మాటల వల్ల ఉద్యోగాలు రావని ఐదుగురు చనిపోయిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో చనిపోయిన వారికి సంతాపతీర్మానంన పెట్టిన చంద్రబాబు కనీసం వారిపేర్లు కూడా ఉచ్చరించలేదని  వాపోయారు. అందరం కలిసికట్టుగా భాగస్వామ్యం అయి హోదాని సాధించుకుందామని జగన్ పిలుపునిచ్చారు. 
Back to Top