సభ నుంచి పారిపోయిన పచ్చపార్టీ

()ప్రజా ప్రయోజనాలు పట్టని టీడీపీ సర్కార్
()హోదాపై చర్చకు పట్టుబట్టిన వైయస్సార్సీపీ
()ప్రతిపక్ష నేతకు నిమిషం కూడా మైక్ ఇవ్వని స్పీకర్
()ప్రత్యేక హోదాను తప్పుదారి పట్టించేందుకు బాబు యత్నం
()అడుగడునా ప్రతిపక్షం గొంతునొక్కిన అధికారపక్షం
()మూడు రోజులు నల్ల దుస్తులతో అసెంబ్లీకి వైయస్సార్సీపీ నేతలు
()అసెంబ్లీ లోపల, వెలుపల ప్రతిపక్ష సభ్యులపై టీడీపీ నేతల దౌర్జన్యం

ఇంట్రోః
ఏపీకి ప్రత్యేక హోదా తెస్తానని నాడు ప్రగల్భాలు పలికిన చంద్రబాబు నేడు తోక ముడిచాడు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయాక కేంద్రంతో కాళ్ల బేరానికి వచ్చాడు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు.. తనను కేసుల నుంచి బయట పడేయాలని వేడుకుంటున్నాడు. దీనిపై తనను ప్రతిపక్షం ప్రశ్నిస్తుందని భయపడే తాజాగా  మూడు రోజుల పాటు జరిగిన ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రతిపక్షం గొంతు నొక్కేశాడు. ఒక్క గంట కూడా చర్చ జరగకుండానే అసెంబ్లీని నిరవధిక వాయిదా వేయించాడు. 

ప్రత్యేక హోదా వలన ఎన్ని లాభాలు ఉంటాయో చంద్రబాబుకు తెలియంది కాదు. అయినా హోదా కావాలని కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించడు. కారణం ఓటుకు కోట్లు కేసు. ఒక్కో ఎమ్మెల్యేకి రూ.కోట్లాది డబ్బులిచ్చి కొనబోతూ ఆడియో టేపులు.. వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయిన బాబు ఆ కేసు నుంచి బయట పడేందుకు 5 కోట్ల మంది జీవితాలను కేంద్రం దగ్గర తాకట్టు పెట్టారు. రాష్ట్రానికి ఏమి ఇచ్చినా.. ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ తనను మాత్రం కేసునుంచి బయట పడేయాలని కేంద్రం వద్ద సాగిలపడి వేడుకుంటున్నాడు. అయితే గత రెండున్నర ఏళ్లుగా ప్రత్యేక హోదా కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతుంటే ఆ పోరాటాన్ని కూడా బాబు తన అధికార బలంతో అడ్డుకోవాలని చూస్తున్నాడు. అసెంబ్లీలో సైతం ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మోహన్‌రెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండానే సమావేశాలను ముగించేశాడు. అయితే ఈ మూడు రోజుల వర్షాకాల అసెంబ్లీ సమావేశాలను ఒకసారి పరిశీలిస్తే బాబు ఆడిన డ్రామా ఏంటో తెలిసిపోతుంది.

మొదటి రోజు (08–09–2016)
అసెంబ్లీ సమావేశాలకంటే ఒక్కరోజు ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని, అంతకంటే మంచి ప్యాకేజీ ఇస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే దాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఖండించాల్సింది పోయి స్వాగతిస్తున్నామని చెప్పడం గమనార్హం. కాగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు బాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.  అంతేకాదు మొదటి రోజు వైసీపీ సభ్యులు నల్లదుస్తులు వేసుకుని అసెంబ్లీకి వెళ్లారు. ముందుగా ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి అక్కడి నుంచి నడుచుకుంటూ ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లారు. అయితే అసెంబ్లీలోప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌కు మైక్‌ ఇచ్చినట్లే ఇచ్చి కట్‌ చేశారు. దీంతో కొద్దిసేపు సభ దద్దరిల్లింది. ఐదుకోట్ల మంది ప్రజల ఆకాంక్షను సమాధి చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదంది. అన్ని కార్యక్రమాలను పక్కన బెట్టి ప్రత్యేక హోదాపైనే ప్రధానంగా చర్చించాలని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ పట్టుబట్టింది. అయితే ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత చర్చిద్దామని అధికారపక్షం ప్రతిపాదించగా సభ్యులు చర్చించిన తర్వాతనే ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని వైసీపీ పట్టుబట్టింది.  దీంతో అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ సభను వాయిదా వేశారు.  అయితే మళ్లీ సభ ప్రారంభమైన వెంటనే వైసీపీ చర్చకు పట్టుబట్టడంతో సభను మరుసటి రోజుకు వాయిదా వేశారు. వాయిదా అనంతరం జగన్‌ మాట్లాడుతూ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నా చంద్రబాబు నోరు మెదపడం లేదని విమర్శించారు.  కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ వ్యాఖ్యలను స్వాగతిస్తున్నామని బాబు చెప్పడం 5 కోట్ల మంది ప్రజలకు వెన్నుపోటు పొడవడమేనన్నారు. ఇందుకు నిరసనగా 10వ తేదీ రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తున్నామని, ఈ బంద్‌ను విజయవంతం చేసి మన ఆకాంక్షను కేంద్రానికి తెలియజేయాలని కోరారు. 

రెండవ రోజు (09–09–2016)
రెండవ రోజు కూడా అసెంబ్లీలో సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయింది. ప్రత్యేక హోదాపై ప్రధాన ప్రతిపక్షం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చర్చకు పట్టుబట్టడం.. అధికార పార్టీ ప్రకటన చేసిన తర్వాత చర్చ చేస్తామని చెప్పడంతో రెండో రోజూ కూడా సభ వాయిదా వేశారు. పలు దఫాలు వాయిదా పడిన అసెంబ్లీ చివరకు మరుసటి రోజుకు సభను వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ కోడెల ప్రకటించారు. అయితే సభ అనంతరం ఏపీ ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి అధికార పార్టీ భాగోతాన్ని ప్రజలకు ఎత్తి చూపారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ కొత్తగా ఫలానాది ఇస్తున్నానని చెప్పకపోగా ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని చెప్పినా బాబు దాన్ని స్వాగతిస్తున్నామని చెప్పడం ఆయన దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. కేంద్రం ఇంత స్పష్టంగా హోదా ఇవ్వమని  చెబుతుంటే కేంద్రంలో తన మంత్రులను ఉపసంహరించుకుని కేంద్రంతో తెగతెంపులు చేసుకోవాల్సింది పోయి.. హోదా ఇవ్వకపోయినా పర్వాలేదు మేం మీతోనే కొనసాగుతామని చెబుతున్నారన్నారు. అసలు ఈయన ఎవరండీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడానికి అని జగన్‌ బాబును  ప్రశ్నించారు. వెంటనే ప్రజలకు బాబు క్షమాపణ చెప్పి  నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.  అంతేకాకుండా జైట్లీ ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీలో కొత్తగా చెప్పినవీ ఏవీ లేవన్నారు. కోటి జనాభా ఉన్న ప్రతి రాష్ట్రానికి ఇచ్చినవే మన రాష్ట్రానికి కూడా ఇస్తున్నారన్నారు. విద్యాసంస్థలు కానీ, పెంట్రోలియం యూనివర్సిటీలు, కేంద్రియ విద్యాలయాలు.. నిమ్స్, రిమ్స్‌ వంటివి అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నట్లే మనకు ఇస్తున్నారని పేర్కొన్నారు.  

మూడవ రోజు (10–09–2016)
మూడవ రోజు అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే సభ వాయిదా పడింది. అసలు ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌కు  మైక్‌ ఇవ్వనే లేదు. వెంటనే సభ వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష సభ్యులు తన వాదనను వినిపించేందుకు  మీడియా పాయింట్‌కు వెళ్లి అధికారపార్టీ డ్రామాలను ప్రజలకు తెలియజేస్తుంటే ఉలిక్కిపడిన అధికార పార్టీ సభ్యులు వెంటనే మీడియా పాయింట్‌ వద్దకు వచ్చి గందగోళం చేశారు. ప్రతిపక్ష సభ్యులను మాట్లాడనీయ కుండా  దౌర్జన్యం చేశారు. అనంతరం కొద్దిసేపటి స్పీకర్‌ కోడెల సభను నిరవధికంగా వాయిదా వేయడంతో ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌ సర్కార్‌ తీరుపై తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయ్యారు. గాంధీ విగ్రహం దగ్గర కూర్చుని నిరసన తెలిపిన అనంతరం జగన్‌ మీడియాతో మాట్లాడారు. బాబు చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, 5 కోట్ల మంది ఆకాంక్షను తెలియజేస్తుంటే తమకు మైక్‌ ఇవ్వకుండా అడ్డుపడ్డారని దుయ్యబట్టారు. తమ పార్టీ సభ్యులకు మీడియా ముందు కూడా మాట్లాడే హక్కు లేదా అన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు తాము అధికార పార్టీపై పోరాడుతూనే ఉంటామన్నారు. ఎవరెన్ని అడ్డుకున్నా ప్రజల అండదండలతో ప్రత్యేక హోదా సాధించి తీరుతామన్నారు. 
 
Back to Top