దోచుకో.. దాచుకో


      – కాలువల పేరుతో కోట్లు కొల్లగొడుతున్న తమ్ముళ్లు..
      – కాసులు కురిపిస్తున్న సప్లై ఛానల్‌ పనులు..

అమడగూరు : ప్రస్తుత ప్రభుత్వం అవలంభిస్తున్న పథకాల అమలు, పనుల తీరు దోచుకుని దాచుకునే విధంగా అధికార పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు వినపడుతున్నాయి. ప్రభుత్వం నుండి అమలవుతున్న ప్రతి పథకం అలాగే నడుస్తుండగా, ముఖ్యంగా నీరు చెట్టు కింద ఇటీవల చేపట్టిన పనులు తెలుగు తమ్ముళ్లకు భారీగా కాసులు కురిపిస్తున్నాయనడంలో సందేహం లేదు. సప్లై ఛానల్‌ పేరిట కాలువలను శుభ్రం చేయించాలని, ఆ పనుల కోసం కోట్లాది రూపాయలను ఖర్చు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఆరు మండలాల్లోనూ చేపట్టిన ఈ కాలువ పనులకు తమ్ముళ్లు కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు.  కాగా ప్రభుత్వం నుంచి ప్రజానీకానికి అమలవుతున్న రేషన్‌ కార్డుల మంజూరు, పింఛన్ల మంజూరు, నూతన గహాల మంజూరు, సబ్సిడీ రుణాల మంజూరు ఇలా ఏ పథకమైనా అధికార టీడీపీకి చెందిన కార్యకర్తలకే తప్ప సామాన్యులకు న్యాయం జరగడం లేదని పేదలు లబోదిబో మంటున్నారు. అంతేకాక వచ్చే పథకాలన్నీ ఎమ్మెల్యే, మంత్రులకు సన్నిహితంగా ఉన్నవారికే సరిపోతున్నాయని, పార్టీని నమ్ముకుని ఉన్న చిన్నపాటి నాయకులకు, కార్యకర్తల ఇళ్ల వరకూ పథకాలు అమలు జరగలేక పోతున్నాయని అధికార పార్టీ కార్యకర్తలు తీవ్ర అసంతప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ కాలువ పనులు సులభతరంగా ఉండటంతో పనులు చేయడానికి తమ్ముళ్లే పోటీ పడుతున్నారు. ఈ పనులు చేయడానికి సిమెంట్, కంకర, ఇసుక, కమ్మీ, కలప, కూలీలు ఎవరూ అవసరం పడకపోగా కేవలం జేసీబీ యంత్రంతోనే పనులు నిర్వహించాల్సి ఉండటంతో తమ్ముళ్లు పనులు చేయడానికి ఎగబడుతున్నారు. మరో పక్క వానలు కురవక చినుకే నేల రాలక పోవడంతో ఇలాంటి పనులు చేపట్టి రైతులకు ఒరుగుతున్నదేంటని రైతన్నల నుండి పెత్త విమర్శలే వినపడుతున్నాయి. విమర్శల కథ, భవిష్యత్తు దేవుడికెరుగు ప్రస్తుతం మన పని బాగా జరుగుతోందని, వీలైనంత వరకూ దోచుకుని దాచుకోవాలని తమ్ముళంతా ఎవరి పనిలో వారు పడి దోచుకునే పనిలో పడ్డారు. 
పుట్టపర్తి నియోజకవర్గ వ్యాప్తంగా చేపట్టిన కాలువ పనులు, నిధుల వివరాలు:
మండలం పేరు              చేపట్టిన పనులు          నిధుల మంజూరు
అమడగూరు                     85                           7.55 కోట్లు
ఓడిచెరువు                        65                           5.05 కోట్లు
నల్లమాడ                          25                          1.60 కోట్లు
బుక్కపట్నం                       28                          2.25 కోట్లు
పుట్టపర్తి                            43                          1.56 కోట్లు
కొత్తచెరువు                         32                         3.00 కోట్లు
మొత్తం                             268                        21.01 కోట్లు

దోచుకోవడమే తమ్ముళ్ల పని:  శేషూరెడ్డి, అమడగూరు వైయస్సార్‌సీపీ కన్వీనర్‌:
ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకంతోనూ దోచుకోవడమే పనిగా పెట్టుకున్నారు తెలుగు తమ్ముళ్లంతా. ఎన్నికల్లో గెలిచిన అధికార పార్టీ నాయకులంతా ఓట్లేసి గెలిపించిన ప్రజలను గాలికొదిలేసి జల్సాలు చేస్తున్నారు. కేవలం ధనార్జనే ధ్యేయంగా పనిచేసుకుంటున్నారు. ఎనభై ఏళ్లు పైబడి రేపోమాపో రాలిపోయే ముదుసలిలకు కూడా పింఛన్లు దక్కని పరిస్థితి దాపురించింది. ఇలాంటి ప్రభుత్వాలను గుణపాఠం చెప్పే రోజులు రాబోతున్నాయి. 

పంటనష్టం లేదు కానీ, కాలువ పనులకు కోట్లు: దుద్టుకుంట శ్రీధర్‌రెడ్డి, పుట్టపర్తి సమన్వయకర్త :
వరుసగా ఖరీఫ్‌ వేరుశనగ పంటతో నష్టపోతున్న రైతులను ఆదుకోవడానికి నష్టపరిహారం ఇవ్వకలేక పోతున్నారు కానీ, కాలువ పనుల పేరిట కోట్లను విడుదల చేస్తూ తమ్ముళ్లకు కట్టబెడుతున్నారు. కాసింత కడుపు నింపుకోవడానికి, అన్నమో రామచంద్రా అని రైతులంతా ఏడుస్తుంటే అధికార పార్టీ నాయకులంతా దర్జాలు చేస్తున్నారు. నాయకులంతా ఎన్నికల సమయంలో ఏం చెప్పారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇది ప్రజాస్వామ్యమేనా? రాష్ట్రంలో రాక్షస పాలన తలపిస్తోంది. ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజులు దగ్గర పడ్డాయి. 


 

తాజా వీడియోలు

Back to Top