బలవన్మరణాలకు బాధ్యత ఎవరిది..?

– విద్యార్థులను పొట్టనపెట్టుకుంటున్న కార్పొరేట్‌ విద్యాసంస్థలు  
– నారాయణ, శ్రీచైతన్యలలోనే అధికం...చర్యలు శూన్యం
– మంత్రిని తొలగించే సాహసం కూడా చేయని వైనం  

విద్యాసంస్థలు విష కౌగిలిగా మారుతున్నాయి. ఎందరో తల్లిదండ్రుల ఆక్రందనలతో రాష్ట్రం ప్రతిధ్వనిస్తుంది. ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దుతారన్న ఆశతో తమ పిల్లలను లక్షలు డొనేషన్లు కట్టి కాలేజీలకు పంపుతుంటే.. యాజమాన్యాలు మాత్రం వారిని నిర్జీవంగా మూటకట్టి అప్పగిస్తున్నాయి. ఎందుకు చనిపోతున్నారో కూడా అర్థంకాని స్థితిలో వారి శవాలను తల్లిదండ్రులకు అప్పగిస్తుండటం చూసి ప్రతి హృదయం నీరుగారిపోతోంది. ఎంతోమంది తల్లులకు గర్భశోకం మిగిల్చి ఆయా విద్యాలయాలు పాపాలను మూటకట్టుకుంటున్నాయి. దేశానికి ఆశాజ్యోతులుగా నిలవాల్సిన రేపటి పౌరులు పదహారు పదిహేడేళ్లకే అర్ధాంతరంగా తనువు చాలిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.
గత వారం రోజుల వ్యవధిలో డజను మందికి పైగా విద్యా కుసుమాలు నేల రాలిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. అటు విజయనగరం నుంచి ఇటు అనంత పురం వరకు కార్పొరేట్‌ కాలేజీల్లో విద్యార్థుల బలవన్మరణాలు నిత్యకృత్యంగా మారాయి. ’ దేశంలో నేనే నెంబర్‌ వన్‌ కూలీ’ అని గొప్పగా చెప్పుకునే ముఖ్యమంత్రి ఏలుబడిలో రాష్ట్రం ఇతర రంగాల్లో ఎలా వున్నా విద్యార్థుల ఆత్మహత్యల్లో దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచిందన్నది కాదనలేని సత్యం. జాతీయ నేర గణాంక బ్యూరో నివేదిక ప్రకారం దేశం మొత్తం మీద 2015లో 360 మంది విద్యార్థుల బలవన్మరణం పాలైతే..  ఆంధ్ర ప్రదేశ్‌లోనే ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిలో చాలావరకు నారాయణ, చైతన్య కళాశాలల్లో సంభవించినవేనని లెక్కలు చెబుతున్నాయి. 

కార్పొరేటీకరణ ప్రభావం
విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు పరిశీలిస్తే నూటికి 99 శాతం కార్పొరేట్‌ కాలేజీల్లో జరుగుతున్నవే. ఏడాదికోసారి పేపర్లలో వేసుకునే ర్యాంకుల కోసం విద్యార్థులను తీవ్ర ఒత్తిడిలోకి నెడుతున్నారు.  తమ లాభాపేక్ష కోసం సాధారణ విద్యార్థి నుంచి మెరిట్‌ స్టూడెంట్‌ వరకు.. ఉత్తీర్ణత, ర్యాంకులు.. అని భవిష్యత్తు మీద భయోత్పాతం కలిగిస్తున్నారు. విద్యార్థులను మర మనుషులుగా చూసే ధోరణ ప్రబలిపోయింది. ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థులు వదిలి వెళ్లిన సూసైడ్‌ నోట్‌లను యాజమాన్యాలు బయటకు రానీయడం లేదు. ఈ బలవన్మరణాలను ఆపడానికి ప్రయత్నించడానికి బదులు, వాటికి కారణాలను బయటకు రాకుండా దాచిపెట్టేందుకు యజమాన్యాలు ప్రయత్నిస్తున్నంత కాలం, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కార్పొరేట్‌ విద్యా సంస్థలపై విద్యాశాఖ కొరడా ఝుళిపించనంత కాలం ఈ పరిస్థితిలో మార్పు రాదు. నిజానికి ఇవి ఆత్మహత్యలు కావు, కార్పొరేట్‌ యాజమాన్యాలు చేసిన హత్యలని విద్యార్థుల తల్లిదండ్రులు ఘోషిస్తున్నా పాలకుల్లో చలనం లేకపోవడం విస్తుగొలుపుతోంది. రైతాంగ ఆత్మహత్యలకు తప్పుడు కారణాలు చూపినట్లుగానే విద్యార్థుల ఆతహ్మత్యల విషయంలోనూ ప్రభుత్వాలు అసత్య ప్రచారం సాగిస్తున్నాయి. 

ఆత్మహత్యలకు మంత్రి కొత్త భాష్యం..
విద్యార్థుల ఆత్మహత్యలను నివారించాల్సిందిపోయి  విద్యాశాఖ మంత్రి వారి మరణాలకు కొత్త భాష్యం చెబుతున్నారు. విద్యార్థుల బలవన్మరణాలకు ప్రేమ వైఫల్యాలు, కుటుంబ సమస్యలే కారణమని చెప్పడం సమస్యను పక్కదారి పట్టించడమే తప్ప మరొకటి కాదు. విద్యారంగాన్ని అంధకారంలోకి నెడుతున్న ఈ బలవన్మరణాలకు కారకులెవరు? వీటిని నివారించేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలి? అన్న అంశంపై దృష్టి పెట్టాల్సిన విద్యా శాఖ కార్పొరేట్‌ విద్యా సంస్థలు ఎంత చెబితే అంత అనే ధోరణిలో వ్యవహరిస్తున్నాయి. విద్యాశాఖా మాత్యులు నారాయణ విద్యా సంస్థ అధిపతి, సహచర మంత్రికి స్వయానా వియ్యంకుడు కావడం, ఈ ఇద్దరు మంత్రులు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితులు కావడం విద్యాశాఖను తమ చేతుల్లోకి తీసుకుని రాష్ట్రాన్ని అచేతన వ్యవస్థలోకి నెట్టేస్తున్నారు. ఇంత మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా మంత్రి నారాయణ నిక్షేపంగా మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. ఆయనను తప్పుకోమని చెప్పే సాహసం ముఖ్యమంత్రి చేయలేకపోతున్నారు. రాజకీయాల్లో దిగజారుతున్న నైతిక విలువలకు ఇదొక నిదర్శనం.. గతంలో లాల్‌ బహుదూర్‌ శాస్త్రి రైల్వేమంత్రిగా వున్నప్పుడు ఎక్కడో జరిగిన రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు మంత్రి నారాయణ ఆధ్వర్యంలోని కళాశాలలోనే విద్యార్థులు పిట్టలా  రాలిపోతున్నా ఏమీ జరగనట్లు వ్యవహరిస్తున్నారు. కార్పొరేట్‌ కళాశాలల్లో పద్దెనిమిది గంటలు ఏకధాటిగా విద్యార్థులను రుద్దడం గురించి ఇప్పుడే తనకు తెలిసినట్లు విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడడం మరీ విడ్డూరంగా వుంది. 
Back to Top