జాబురావాలంటే బాబు అధికారంలోకి రావాలంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేసి యువతను ఆకర్షించిన చంద్రబాబు ఏడాది గడుస్తున్నా ఇంతవరకు ఉపాధి కల్పనపై మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. పైగా ఉన్న ఉద్యోగాలను ఊడబీకుతున్నారు. ఉద్యోగాలు కల్పించలేకపోతే నెలకు రెండువేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని కూడా చంద్రబాబు ప్రచారం చేశారు. ఇపుడు ఎక్కడా ఆ ఊసే లేదు. అదలా ఉంచితే ఎన్నికలయ్యాక బాబుగారు మరో కొత్త నాటకానికి తెరతీశారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిలో వివిధ రంగాలలో స్కిల్ డెవలప్‌మెంట్‌పై శిక్షణ ఇస్తామని, ఆ తర్వాత ఉపాధి కల్పిస్తామని ఆయన ప్రకటనలు గుప్పించారు. స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో శిక్షణ ఇచ్చేందుకు పలు విద్యాసంస్థల వారికి ప్రభుత్వం లక్షల్లో చెల్లించిందని వార్తలు వచ్చాయి కూడా. ఆ తర్వాత ప్రభుత్వం డీఆర్‌డీఏ ద్వారా కొంత మంది నిరుద్యోగులకు పలు వృత్తులలో శిక్షణ ఇచ్చింది. కానీ వారిలో రెండు శాతం మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వలేదు. మూడు నుంచి ఆరు నెలల కంప్యూటర్ కోర్సులలో కూడా శిక్షణ ఇచ్చారు. శిక్షణ ఇచ్చినవారే శిక్షణ తీసుకున్నవారికి ఉద్యోగం చూపించాలనే నిబంధన ఉంది. అంతేకాదు ప్రైవేట్ కంపెనీల్లో వారికి ఉద్యోగం ఇప్పించినట్లు సర్టిఫికెట్ తీసుకుని డీఆర్‌డీఏకి ఇవ్వాలన్న నిబంధన కూడా ఉంది. కానీ ఈ నిబంధనలేవీ అమలు కావడం లేదు. అరకొర శిక్షణతో ప్రజాధనం వృథా చేస్తున్నారు తప్ప నిరుద్యోగులను ఆయా రంగాలలో నిష్ణాతులుగా తీర్చిదిద్దలేకపోతున్నారు. విజయవాడ, గుంటూరు నగరాలు, వాటి పరిసరాల్లోని ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రతి సంవత్సరం వేలాది మంది ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారు. ఉద్యోగాలు రానివారి సంఖ్యా వేలల్లోనే ఉంది. నాలుగేళ్లు ఇంజనీరింగ్ చదివినా ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతుంటే కేవలం మూడు నెలల్లో స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో ఉద్యోగాలకు సరిపడా శిక్షణ ఎలా ఇస్తారన్న సందేహాలున్నాయి. ఇదంతా నిరుద్యోగులను మభ్యపుచ్చడానికేనన్న విమర్శలూ ఉన్నాయి. ఈ మధ్యే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సీఆర్‌డీఏ పరిధి గ్రామాల్లో పర్యటిస్తూ 778 పోస్టులు మంజూరయినట్లు ప్రకటించారు. అయితే ఆ పోస్టులు ఏస్థాయి పోస్టులు ? వాటి క్వాలిఫికేషన్ ఏమిటి ? అనే వివరాలను ఆయన వెల్లడించలేదు. ప్రభుత్వమూ ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు.