హైదరాబాద్: అసెంబ్లీలో స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు అనుసరిస్తున్న పక్షపాత వైఖరితో విసుగెత్తిపోయిన ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఆయన మీద అవిశ్వాస తీర్మానం కోరుతూ నోటీసు ఇచ్చారు. దీంతో ఇటువంటి నోటీసు ఇచ్చిన తరువాత చట్ట సభల్లో అనుసరించే విధానాల మీద ఆసక్తి నెలకొంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ నోటీసు మీద ఎటువంటి చర్యలు తీసుకొంటారు అనే దానిపై చర్చ నడుస్తోంది. 1. భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 179 క్లాజ్ సీ ప్రకారం స్పీకర్ తొలగింపునకు ఏ సభ్యుడు అయినా పట్టు పట్టవచ్చు. ఇందుకోసం ప్రతిపాదన్ని తీసుకొని వస్తే 14 రోజుల్లోపు చర్చించి నిర్ణయం తీసుకోవాలని రాజ్యాంగం చెబుతోంది. 2. దీన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వ్యవహారాల రూల్ బుక్ లో నిబంధనలు పొందు పరిచారు. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఈ నిబంధనల్ని రూపొందించారు. నియమావళి లోని రూల్ 71 ఇందుకు సంబంధించిన విధి విధానాల్ని తెలియ చేస్తుంది. 3. అసెంబ్లీ నియమావళి రూల్ 71 (1) ప్రకారం సభ్యులు స్పీకర్ తొలగింపునుకోరుతూ అవిశ్వాస తీర్మానం ప్రతిపాదనకు నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది. బుధవారం ఉదయం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఇందుకు అనుగుణంగా నోటీసు ఇవ్వటం జరిగింది. 4. ఇందులో స్పీకర్ పై విశ్వాసం కోల్పోయాం అన్న డిక్లరేషన్ తప్పనిసరి. ఇందుకు అనుగుణంగా వైఎస్సార్సీపీ సభ్యులు ఈ వాక్యాన్ని కోట్ చేస్తూ నోటీసు ఇచ్చారు. 5. రూల్ 71(2) ప్రకారం ఈ నోటీసును స్వీకరించిన అసెంబ్లీ స్పీకర్ ఏదేని ఒక రోజు సభకు సంబంధించిన అజెండాలో దీన్ని పొందుపరచాలి. నోటీసు ఇచ్చిన నాటి నుంచి 14 రోజులకు మించకుండా ఇది జరగాలి. అంటే వైఎస్సార్సీపీ సభ్యులు బుధవారం నాడు నోటీసు ఇచ్చారు కాబట్టి రెండు వారాలలోపు ఇది జరగాలన్న మాట. 6. అజెండాలో లిస్టు చేసిన రోజు.. ఈ నోటీసుకి సంబంధించిన కార్యకలాపాల్ని సాధారణంగా స్పీకర్ పక్కకు తప్పుకొని డిప్యూటీ స్పీకర్ లేదా నిర్దేశించిన సభ్యుని చేతుల మీదుగా చేపడతారు. సాధారణంగా స్పీకర్ అటువంటి సమయంలో సభా కార్యకలాపాలకు దూరంగా ఉండటం కూడా జరగుతుంది. 7. అప్పుడు హాజరైన సభ్యుల్లో ఎంత మంది ఈ నోటీసుని బలపరుస్తున్నారు అనేది లెక్క చేస్తారు. కనీసం 50 మంది దాన్ని బలపరుస్తుంటే అప్పుడు దాని మీద చర్చను చేపడతారు. ఈ నోటీసు ఇవ్వాల్సి వచ్చిన సందర్భం, దాని వివరాలు, స్పీకర్ ను ఎందుకు తొలగించాలని కోరుతున్నారు అనేది నోటీసు ఇచ్చిన సభ్యులు సభకు చెప్పటం జరుగుతుంది. 8. అప్పుడు శాసనసభలోని అధికార ప్రతిపక్ష సభ్యులు దీని మీద మాట్లాడేందుకు సభాపతి స్థానంలోని డిప్యూటీ స్పీకర్ లేదా మరో సభ్యుడు అనుమతించటం జరుగుతుంది. 9. చివరలో ఈ తీర్మానాన్ని ఆమోదించాలా వద్దా అనే అంశం మీద సభ లో ఓటింగ్ నిర్వహిస్తారు. స్పీకర్ ను తొలగించాలన్న తీర్మానం మీద వచ్చిన ఓట్ల మీద ఫలితం ఆధారపడుతుంది. 10. ఈ విధానం ప్రకారం త్వరలోనే శాసనసభలో స్పీకర్ తొలగింపునకు సంబంధించిన చర్చ జరుగుతుందని వైఎస్సార్సీపీ సభ్యులు భావిస్తున్నారు.