ఉద్యోగులపై కక్షసాధింపు

– ఉద్యోగుల వేతనాల్లో భారీగా కోతలు
– ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం అమల్లో సర్కారు విఫలం
– ఉద్యోగులను బాధ్యులను చేసే కుట్రలో భాగంగానే కోతలు 
– ఆరు జిల్లాల్లో 50 శాతానికిపైగా.. పది జిల్లాల్లో 40 శాతానికిపైగా కోతలు 
– ప్రభుత్వంపై వ్యతిరేకతను ఉద్యోగులపై నెట్టేందుకే 

తప్పులు చేసి దొరికి పోయి కూడా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడటంలో చంద్రబాబును మించిన వ్యక్తి మరొకరుండరు. అందరి పనితీరుపై సర్వేలు నిర్వహించి సుద్ధులు చెప్పే చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ఉద్యోగుల మీద పడ్డాడు. ప్రభుత్వ అసమర్థతను కప్పి పుచ్చుకోవడం కోసం గృహనిర్మాణ శాఖ ఉద్యోగులను చంద్రబాబు బలిపశువులను చేసేందుకు సిద్ధమయ్యాడు. తానేదో నీతిమంతుడైనట్టు మాట్లాడుతుండే ముఖ్యమంత్రి తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఎదుటివారి మీద బురద చల్లడమే పనిగా పెట్టుకుని తాజాగా ఉద్యోగుల మీద పడ్డాడు. ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకంలో ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగడంపై అధికారులను బాధ్యులను చేస్తూ వారి వేతనాల్లో భారీగా కోత విధించాడు. 

కోత ఎందుకు వేసినట్టు..
గృహనిర్మాణ శాఖలో ఉద్యోగుల ‘పనితీరు’ముసుగులో ఎంత శాతం జీతాలివ్వాలో ఉన్నతాధికారులు నిర్ణయించి అంతే ఇస్తారంట. ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కె.వి.రమణ అంతర్గతంగా మెమో జారీ చేశాడు. ఫిబ్రవరి నెల నుంచే జీతాల్లో కోత కూడా విధించారు. నిర్ణయించిన మేరకు లబ్ధిదారుల ఆధార్‌ నంబర్, మొబైల్‌ నంబర్, బ్యాంకు వివరాలు, జియో ట్యాగింగ్, ఇళ్ల నిర్మాణాలు తదితర వాటిపై దృష్టి సారించనందున కోత విధిస్తున్నట్టు వెల్లడించారు. ఇకపై జిల్లా స్థాయి ఇళ్ల నిర్మాణాల శాతం ఆధారంగా వేతనాలు చెల్లిస్తారు. ఉద్యోగులు వారు పనిచేస్తున్న మండలంలో ఎన్ని నిర్మాణాలను ఏ స్థాయిలో పూర్తి చేయించారో నిర్ధారించాలి. మండలాల లెక్కలన్నీ కలిపి జిల్లా వ్యాప్తంగా ఎన్ని నిర్మాణాలు జరిగాయి, వాటి శాతాన్ని లెక్కగట్టి జిల్లాస్థాయిలో వేతనాలకు అంతే శాతం బడ్జెట్‌ను కేటాయిస్తారు. ఉదాహరణకు అనంతపురం జిల్లాలో ఫిబ్రవరి నెల వేతనాల్లో 51 శాతం కోత విధించి 49 శాతమే మంజూరు చేశారు. అంటే ఆ జిల్లాలో ప్రతి ఉద్యోగి వేతనంలో 51 శాతం కోత వేశారు. 40 వేలు వేతనం అందుకునేవారు ఫిబ్రవరి నెలలో కేవలం 19600 మాత్రమే అందుకున్నారు. 

బాధ్యులు ఉద్యోగులా.. బాబా..? 
నిజానికి ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగడం వెనుక కారణం చంద్రబాబు అసమర్థతే. పబ్లిసిటీ కోసం హడావుడిగా మాటలు చెప్పడం తప్ప తగినంతగా నిధులు కేటాయించడు. అయితే దానికి అధికారులను బాధ్యులను చేస్తూ వారి వేతనాల్లో భారీగా కోతలు విధించాడు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద 3,12,261 ఇళ్లు మంజూరు చేశారు. ఇందులో 2.04,864 ఇళ్లకు ఐడీ, ఆధార్‌ నంబర్లు ఇచ్చారు. 1,10,510 ఇళ్లకు బ్యాంకు ఖాతాలు, 87,713 ఇళ్లకు మాత్రమే ఫోన్‌ నంబర్లు అనుసంధానం చేశారు. అయితే వీటి నిర్మాణానికి అవసరమైనన్ని నిధులు ప్రభుత్వం కేటాయించలేదు. పైగా లబ్దిదారుల ఎంపి బాధ్యతను అధికారుల నుంచి తప్పించి ఆయా గ్రామాల్లో జన్మభూమి కమిటీలకు అప్పగించారు. ఇదొక్కటి చాలదా నిర్మాణాలు ఆలస్యం కావడానికి. అయితే తప్పు వారి వద్ద ఉంచుకుని నెపాన్ని మాత్రం అధికారుల మీద రుద్దేసి వారి వేతనాల్లో భారీగా కోతలు విధించారు. ఇక్కడ చంద్రబాబు అబద్ధాలను మరోసారి ప్రస్తావించాలి. తాను సీఎం అయిన మొదట్లో యూనిట్‌ ధర రూ. 3లక్షలుగా నిర్ణయించారు. ఆ తర్వాత రూ. 2.25లక్షలకు ఆ తర్వాత మళ్లీ రూ. 1.50 లక్షలు మాత్రమే ఇస్తామని మూడు సార్లు మాటతప్పాడు. పైగా ఇందులో రూ. 92వేలు ప్రభుత్వం, మిగిలిన రూ. 58 వేలు ఉపాధి హామీ పథకం ద్వారా చెల్లిస్తారని మెలికపెట్టాడు. ఈ చెల్లింపులతోనే పక్రియ ఆలస్యం అవుతోంది. చేసిందంతా ప్రభుత్వమే చేసి జాప్యానికి ఉద్యోగులను బాధ్యులను చేసింది. జిల్లాల వారీగా ఉద్యోగుల వేతనాల్లో కోతను గమనిస్తే అత్యధికంగా సీఎం సొంత జిల్లా చిత్తూరులోనే 67 శాతం కోత విధించారు. అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో 21 శాతం కోత విధించారు. చిత్తూరు, కృష్ణా, కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం తదితర ఆరు జిల్లాల్లో 50 శాతానికిపైగా కోత విధిస్తే.. మొత్తం పది జిల్లాల్లో నలభై శాతానికి పైగా కోత విధించారు. 

ఉన్నట్టుండి ఉద్యోగుల మీద ఎందుకు పడ్డాడు
చంద్రబాబు సర్కారు మీద రోజురోజుకీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ విషయం ఇంటిలిజెన్సు రిపోర్టుల ద్వారా చంద్రబాబుకు కూడా తెలిసింది. ఈ వ్యతిరేకతకు కారణం ఆరాతీస్తే ఆయన ఎన్నికల హామీ ఇచ్చిన గృహ నిర్మాణ పథకం కూడా ఒకటి. పైగా గతంలో దివంగత నేత వైయస్‌ఆర్‌ హయాంలో ఐదేళ్లలో 40 లక్షల ఇళ్లను నిర్మించి దేశంలోనే రికార్డు సృష్టించాడు. దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో నిర్మించిన ఇళ్లకంటే ఇది పది రెట్లు అధికం. ఈ విషయాన్ని జననేత పలు సందర్భాల్లో ప్రస్తావించారు కూడా. అయితే ఈ హామీని నెరవేర్చడానికి ప్రభుత్వం దగ్గర తగినన్ని నిధులు లేవు. కానీ తనమీద వ్యతిరేకత లేకుండా చేసుకోవాలి. అంతే ఏం చేయాలి. తక్షణోపాయం తన తప్పును ఎవరొకరి మీద నెట్టేయాలి. తాను ధర్మ ప్రభువుగా బయటి ప్రపంచం మాట్లాడుకోవాలి. అందుకే తక్షణోపాయంగా ఉద్యోగులను బలిపశువులను చేసేశాడు. నిజానిజాలను కప్పి పుచ్చి ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం ఆలస్యం కావడం వెనుక అసలు కారణం ఉద్యోగులేనని వారి వేతనాల్లో భారీగా కోతలు విధించాడు. ఇక్కడ చంద్రబాబుకు మరో ప్రయోజనం కూడా ఉంది. ఇప్పటికే చంద్రబాబు మీద ఉద్యోగులు డీఏ, పీఆర్‌సీలు ఇవ్వలేదని కోపంగా ఉన్నారు. వారి నోళ్లు మూయించడానికి ఈ కోతల అస్త్రాన్ని బాబు ప్రయోగించాడు. ఈ సంఘటనతో బాబు నైజం మరోసారి బహిర్గతమైంది. నేను మారానని ముసలి కన్నీరు కార్చిన బాబు ఏమాత్రం మారలేదని స్పష్టమైంది. 

తాజా వీడియోలు

Back to Top