‘ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే...’

 
దొంగే.. పోలీస్‌ని దొంగ అని పిలిచినట్టు ‘ఉల్టా చోర్‌ కొత్వాల్‌ కో డాంటే...’ అని హైదరాబాద్‌లో అందరికీ సముపరిచితమైన సామెత ఉంది. ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మీద దాడి జరిగిన రోజు నిర్వహించిన ప్రెస్‌మీట్‌ చూసిన లక్షల మంది నుంచి వచ్చిన స్పందన ఇది. నాలుగు రోజులుగా ఆంధ్రా రాజకీయాలన్నీ హత్యాయత్నం చుట్టూనే తిరుగుతున్నాయి. జగన్‌ మౌనాన్ని తట్టుకోలేని చంద్రబాబు అండ్‌ కో ఆపసోపాలు పడుతోంది. హత్యపై నిజానిజాలు బహిర్గతమైతే తమ అస్తత్వానికి ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయోనని ఉలికిపాట్లు పడుతున్నారు. జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా సానుభూతి కోసం దాడి చేయించుకున్నాడని ప్రచారం చేస్తున్న చంద్రబాబు సహా ఎల్లో గ్యాంగ్‌.. దానిపై థర్డ్‌ పార్టీ విచారణ చేయించేందుకు మాత్రం జంకుతోంది. గతంలో జరిగిన పలు కేసుల్లో విచారణకు ఆదేశించి చేతులు దులిపేసుకున్నట్టే ప్రతిపక్ష నేత మీద జరిగిన దాడిని కూడా పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. 

చంద్రబాబు నాలుగేళ్ల పాలన పరిశీలిస్తే అడుగడునా అరాచకాలే.. ఆ అరాచకాలను ప్రశ్నిస్తే విచారణ పేరుతో కాలయాపన చేసేసి.. సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారు. తమ పరిధిలో ఉండే సీఐడీతో విచారణ జరిపించేసి మమ అనిపించేస్తున్నారు. ఎలాగూ అధికారంలో ఉన్నారు కాబట్టి సీఐడీ విచారణను పక్కదారి పట్టించవచ్చనేది వారి ఆలోచన. గతంలో ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఒక సందర్భంలో కేసీఆర్‌ను ఉద్దేశించి చంద్రబాబు ఇలాంటి ఆరోపణలే చేశారు. నీకూ సీఐడీ ఉంటే.. నాకూ సీఐడీ ఉందని రంకెలేశారు. స్వత్రంత్ర దర్యాప్తు సంస్థను తమ ఇంటి పెరట్లో కట్టేసే పెంపుడు జంతువులా చేసిన వ్యాఖ్యలు ఎంతోమందిని నివ్వెరపరిచాయి. తర్వాత కాలంలో వాటినే నిజం చేశారు. 

పుష్కరాల్లో తొక్కిసలాటను విచారణకు ఆదేశించి మూడేళ్ల తర్వాత విచారణ రిపోర్టు ఇచ్చారు. జనం అత్యుత్సాహం వల్లే ప్రమాదం జరిగిందని తేల్చేశారు. ఏఎన్‌యూలో రిషితేశ్వరి అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంటే.. యూనివర్సిటీ హాస్టళ్లు మూసేసి కాలేజీకి సెలవులిచ్చి విద్యార్థులను ఇంటికిం పంపించి వేశారు. ఒకరిద్దర్ని కొన్నాళ్లు సస్పెండ్‌ చేసేసి చేతులు దులుపుకున్నారే తప్ప.. నిందితులకు శిక్ష పడలేదు.. బాధితులకు న్యాయం జరగలేదు. జేసీ దివాకర్‌రెడ్డి బస్సు ఘటనలో డ్రైవర్‌ మృతదేహానికి పోస్టుమర్టం నిర్వహించకుండానే బంధువులకు అప్పగించబోయారు. నిజాలు బయటకు రాకుండా తొక్కిపెట్టాలని చూశారు. ప్రతిపక్ష నేత కల్పించుకుంటేగానీ స్పందించలేదు. కృష్ణా నదిలో జరిగిన బోటు ప్రమాదంలో 23 మంది నీట మునిగి చనిపోయినా.. లైఫ్‌ జాకెట్టు ఇచ్చుంటే బతికేవారని అన్ని పత్రికలు ఘోషించినా పట్టించుకోలేదు. విచారణ పేరుతో సమస్యను సైడ్‌ ట్రాక్‌ చేశారు. విచారణకు ఆదేశించినా ఏమైందో ఆ దేవుడికే తెలియాలి. ఏర్పేడు వద్ద జరిగిన లారీ ఢీకొన్న ఘటనలో 17 మంది చనిపోయినా.. అందులో టీడీపీ నాయకులు హస్తం ఉందని తెలిసినా.. ఇద్దరు నాయకులను తాత్కాలికంగా పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి చేతులు దులుపుకున్నారే తప్ప.. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగింది లేదు. ఆ తర్వాతి కాలంలో సస్పెండ్‌కు గురైన నాయకులు పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్‌ అయ్యారుతప్ప బాధితులకు ప్రభుత్వం న్యాయం చేసింది లేదు. తహసీల్దార్‌ వనజాక్షి విషయంలో మరీ ఘోరం.. అందరూ చూస్తుండగానే అధికార పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌.. మహిళా అధికారి అని కూడా చూడకుండా వనజాక్షిని జుట్టు పట్టి ఈడ్చుకెళ్లినా అతడిపై చర్యలు తీసుకోలేదు. ఇసుక రీచ్‌లు చింతమనేనికి రాసిచ్చాడనే విషయం తెలియక వనజాక్షి.. ఎమ్మెల్యేతో పెట్టుకుందని ఆ తర్వాత చాలా మంది వనజాక్షిపై సానుభూతి వ్యక్తం చేశారు. చంద్రబాబే బెదిరించి మరీ కేసును నీరుగార్చాడని వార్తలొచ్చాయి. పత్తికొండ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త చెరుకులపాటి నారాయణరెడ్డిని అత్యంత కిరాతకంగా నరికి చంపినా నిందితులను అరెస్టు చేసిన పాపాన పోలేదు. ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కొడుకు ఉన్నాడని ఆరోపణలు వినిపించినా.. దర్యాప్తు పేరుతో కొన్నాళ్లు కాలయాపన చేశారు తప్ప.. నిందితులను పూర్తిగా విచారించి శిక్ష వేయించింది లేదు. ఇప్పుడు సాక్ష్యాత్తు ప్రతిపక్ష నేత మీద దాడి జరిగితే.. అనుమానాలన్నీ టీడీపీ నాయకుల చుట్టూనే తిరుగుతున్నా.. నిందితులను కాపాడే ప్రయత్నం చేయడానికి సీఐడీ దర్యాప్తు పేరుతో కేసును నీరుగార్చేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. 

తాజా వీడియోలు

Back to Top