టీడీపీ అవినీతి సునామి

()మాస్టర్ ప్లాన్ అంతా మాయ
()రైతుల భూములు స్వాహా
()స్విస్ చాలెంజ్ ముసుగులో అంతా దోపిడీ
()అధికార టీడీపీ అవినీతి బాగోతం
()రాజధానిలో రాబంధుల రాక్షసత్వం

చంద్రబాబు సర్కార్ అమరావతి అభివృద్ధి పేరిట అతిపెద్ద అవినీతి సామ్రాజాన్ని స్థాపించింది. రైతుల భూములను భోంచేసి రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ స్విస్ ఛాలెంజ్ ముసుగులో భారీ కుంభకోణాలకు తెరతీసింది. రాజధానిలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండానే ల్యాండ్ ను డెవలప్ చేసి అమ్మేసేందుకు  కుట్రపన్నింది. కోర్ కేపిటల్ ప్రాంతం అభివృద్ధి చేస్తే ఆ చుట్టుపక్కల ప్రభుత్వ పెద్దల బినామీల భూములకు మంచి ధర వస్తుంది. వందల ఎకరాలను కైంకర్యం చేసిన సర్కారు పెద్దలు భారీగా లబ్ధిపొందనున్నారు... అదీ అసలు ప్లాన్. దీనిని అమలు చేయడానికి భారీ ప్రణాళికే సిద్ధం చేశారు. సింగపూర్ సర్కార్‌తో తనకు ఉన్న సంబంధాల వల్ల.. రాజధాని మాస్టర్ ప్లాన్‌ను ఉచితంగా తయారు చేసి ఇవ్వడానికి ఆ దేశం అంగీకరించిందని సీఎం మాయమాటలు  చెప్పుకొచ్చారు. రాజధాని మాస్టర్ ప్లాన్ ను రూపొందించడానికి సింగపూర్ ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఐఈ(ఇంటర్నేషనల్ ఎంటర్‌ప్రైజస్)తో ఏపీఐఐసీ(ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ)కి డిసెంబర్ 8, 2014న ఒప్పందం కుదిరింది.

ఆ తర్వాత మాస్టర్ ప్లాన్ రూపొందించే బాధ్యతను ప్రైవేటు సంస్థలు సుర్బానా ఇంటర్నేషనల్, జురాంగ్ ఇంటర్నేషనల్ సంస్థలకు సింగపూర్ సర్కార్ కట్టబెట్టింది. రాజధానికి భూసమీకరణ పేరుతో రైతుల నోళ్లు కొట్టి భూములు లాక్కున్న తరహాలోనే.. స్వప్రయోజనాల కోసం రాజధాని నిర్మాణ పనులను సింగపూర్ సంస్థలకు కట్టబెట్టడానికి వ్యూహాత్మకంగా సీఎం చంద్రబాబు ‘స్విస్ చాలెంజ్’  విధానాన్ని తెరపైకి తెచ్చారు. మార్చి 30, 2015న రాజధాని ప్రాంత(కేపిటల్ రీజియన్) మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ సంస్థలు అందించిన సమయంలోనే మాస్టర్ డెవలపర్‌ను స్విస్ చాలెంజ్ విధానంలో ఎంపిక చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆ వెంటనే సింగపూర్ మంత్రి ఈశ్వరన్ స్పందిస్తూ.. మాస్టర్ డెవలపర్ కోసం సింగపూర్ సంస్థలు పోటీ పడతాయని చెప్పారు. ముందస్తు ఒప్పందం మేరకు సింగపూర్ ప్రైవేటు సంస్థలు అసెండాస్, సిన్‌బ్రిడ్జి, సెమ్బ్‌కార్ప్ సంస్థలు విలీనమై కన్సార్టియంగా ఏర్పడ్డాయి.
 
లక్షకోట్లు దాటిపోయే దోపిడీ ప్రణాళిక 
‍() స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అమలుకు సింగపూర్ సంస్థల కన్సార్టియం, ప్రభుత్వానికి చెందిన కేపిటల్ సిటీ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్(సీసీడీఎంసీఎల్) కలిసి అమరావతి డెవలప్‌మెంట్ పార్టనర్(ఏడీపీ)ని ఏర్పాటు చేస్తాయి. ఇందులో సీసీడీఎంసీఎల్ వాటా 50 శాతం, తమ వాటా 50 శాతం ఉండేలా అక్టోబరు 30, 2015న సింగపూర్ సంస్థల కన్సార్టియం తొలుత ప్రతిపాదించింది.
()కానీ సింగపూర్ కంపెనీల్లో  బినామీ సంస్థలుండటంతో సింగపూర్ కంపెనీల వాటాను 58 శాతానికి పెంచాలని,  ఏడీపీలో సీసీడీఎంసీఎల్ వాటా 42 శాతానికి తగ్గంచాలని స్వయంగా సీఎం సింగపూర్‌లో ఈ ఏడాది జనవరి 24, 25 తేదీల్లో చర్చల్లో సూచించారు. ఎవరైనా ప్రభుత్వ వాటా పెంచమంటారు గానీ  తగ్గించడం అంతా దోపిడీలో భాగమే.

()ఇంతకూ స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు అభివృద్ధికి ఏడీపీలో సింగపూర్ సంస్థలు పెట్టే పెట్టుబడి ఎంతో తెలుసా? కేవలం రూ.306.4 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం సీసీడీఎంసీఎల్ తరఫున రూ.221.9 కోట్లు పెట్టుబడి పెడుతుంది. ఇదీ గాక మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్రం రూ.5,500 కోట్లు ఖర్చు చేస్తుంది. పైగా సింగపూర్ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే రెవెన్యూ వాటా మాత్రం చెప్పకుండా సీల్డ్ కవర్‌లో గోప్యంగా ఉంచాలని సింగపూర్ సంస్థలు కోరగా అందుకు ముఖ్యమంత్రి అంగీకరించారు.

()ఏడీపీలో రూ.306.4 కోట్లు పెట్టుబడి పెట్టే సింగపూర్ కన్సార్టియం వాటా 58 శాతం.. రూ.5,721.9 కోట్లు పెట్టుబడి పెట్టే సీసీడీఎంఎల్ వాటా 42 శాతమే. దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు. సింగపూర్ కంపెనీలకు ఎంత మేలు చేయబోతున్నారో.

()రైతుల నుంచి రకరకాల మార్గాలలో సమీకరించిన భూమిలో 1,691 ఎకరాలు స్టార్టప్ ఏరియా ప్రాజెక్టుకు ఇస్తున్నారు. విజయవాడ బందరు రోడ్డులో గజం భూమి విలువ రూ.రెండు లక్షలకుపైగానే పలుకుతోంది. రాజధానిలో అత్యంత కీలకమైన సీడ్ కేపిటల్‌లో గజం విలువ హీనపక్షం రూ.లక్ష పలుకుతుందని స్వయంగా  చంద్రబాబే చెబుతున్నారు.
()ఈ లెక్కన ఎకరా భూమిలో రహదారులు, పార్కులకు కొంత పోయి.. మిగిలే 2,800 గజాల స్థలం విలువ రూ.28 కోట్లు పలుకుతుంది. అంటే.. 1,691 ఎకరాల విలువ రూ.47,348 కోట్లు. ఇందులో సింగపూర్ కన్సార్టియం వాటా 58 శాతం. అంటే.. ఆ సంస్థలకు రూ.27,461.84 కోట్లు దక్కుతాయి. రాష్ట్ర ప్రభుత్వానిది 42 శాతమే కాబట్టి దక్కే సొమ్ము రూ.19,886.16 కోట్లే.
() అంతే కాదు.. ఈ భూమిని పాతికేళ్లలో ఎప్పుడైనా అమ్ముకునే వెసులుబాటు కల్పించారు. అంటే.. పదేళ్ల తర్వాత గజం నాలుగు లక్షలు ఉంటే సింగపూర్ కంపెనీలకు వచ్చే లాభం రూ.లక్ష కోట్లను దాటిపోతుంది. ఇదంతా చూస్తోంటే.. మన భూమి ఇచ్చి మనం ఎక్కువ ఖర్చు పెట్టి సింగపూర్ కంపెనీలకు అత్యధికంగా లాభాలిస్తున్నట్లు స్పష్టమవుతోంది. సింగపూర్ కంపెనీల కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఆ తర్వాత ఆ కంపెనీల నుంచి కమీషన్లు పొందేందుకు చంద్రబాబు వేసిన ప్లాన్ ఇదంతా. 
 



తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top