సమైక్యవాదం వైయస్ఆర్‌సిపి సమర నినాదం

హైదరాబాద్, 3 అక్టోబర్ 2013:

తెలుగునేల ఒక్కటిగా ఉండాలన్నది మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి ఆశయం. సీమాంధ్ర ప్రజల మనోగతం కూడా అదే. తెలుగుజాతి మధ్య చిచ్చుపెడితే సహించేది లేదని ఎప్పుడూ ప్రజల‌ పక్షాన నిలబడే జననేత, వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధినేత‌ శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సింహనాదం చేశారు. ఆయన బాటలోనే తొలి నుంచీ పార్టీ శ్రేణులు సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమంలో మమేకం అవుతూనే ఉన్నాయి. ఢిల్లీ పెద్దల కళ్లు తెరిపించడానికి పోరాటాన్ని మరింత పదునెక్కించాలన్నది శ్రీ జగన్మోహన్‌రెడ్డి పిలుపు.

రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న సమర నినాదంతో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ముందుకు దూసుకుపోతోంది. పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించిన నెల రోజుల భాగంగా ఉద్యమ కార్యాచరణలో భాగంగా బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు, శ్రేణులు నిరాహార దీక్షలు ప్రారంభించారు. సమైక్యాంధ్రను రక్షించుకోవడమే పార్టీ లక్ష్యంగా వారంతా ఉద్యమించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచుతామని కేంద్ర ప్రకటించే వరకూ ఉద్యమాన్ని ఆపే ప్రసక్తి లేదని నిరాహార దీక్షా వేదికల నుంచి నాయకులు స్పష్టం చేశారు.
కలసి ఉంటేనే తెలుగుజాతికి మేలు జరుగుతుందని విస్పష్టంగా ప్రకటించిన వైయస్ఆర్ కాంగ్రె‌స్‌ పార్టీ తొలి నుంచీ సమైక్య ఉద్యమంలో అదే చిత్తశుద్ధితో అగ్రభాగంలో నిలుస్తోంది. సత్యాగ్రహంతో సమున్నత లక్ష్యాలను సాధించగలం అని నిరూపించిన మహాత్ముని స్ఫూర్తితో.. ఆయన జయంతి రోజైన బుధవారం రాష్ట్రం వ్యాప్తంగా 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు సమైక్యదీక్షలు చేపట్టారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో విజయం తథ్యమన్న భరోసాను సమైక్యవాదులకు కల్పించారు.

సమైక్యాంధ్ర సత్యాగ్రహం దీక్షలో భాగంగా... పార్టీ శ్రేణుల నిరాహార దీక్షలకు మద్దతుగా పలు చోట్ల జాతీయ రహదారిపై వాహన చోదకులు, పాదచారులకు గులాబీలు పంచిపెట్టి, సమైక్య నినాదాలు చేశారు. పార్టీ నిర్వహించిన సత్యాగ్రహం శిబిరాలకు వేలాదిగా తరలివచ్చిన ప్రజలు వైయస్ఆర్‌ కాంగ్రెస్ చేపట్టిన పోరాటానికి సంపూర్ణ మద్దతు ప్రకటిం‌చారు. జేఏసీల ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు దీక్షలో కూర్చున్న వారిని పరామర్శించి సంఘీభావం తెలిపారు.

దీక్షా శిబిరాల్లో ముఖ్య నాయకులు మాట్లాడుతూ.. సమైక్య రాష్ర్టంలో కలిగే ప్రయోజనాలు, విభజనతో వాటిల్లే నష్టాలను వివరించారు. రాష్ట్రాన్ని విడదీసి పాలించేందుకు కేంద్ర కుట్ర పన్నిందని విమర్శించారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు సీమాంధ్రుల పట్ల కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ తెలుగుజాతిని విడదీసేందుకు పూనుకుందని ఆరోపించారు. ఈ కుట్రలను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తిప్పికొడుతుందని స్పష్టం చేశారు. ప్రజల మనో భావాలను గౌరవించి పదవులను గడ్డిపోచలా విడిచిపెట్టి ప్రజల్లోకి రావాలని కాంగ్రెస్, టిడిపి ప్రజా ప్రతినిధులను డిమాండ్‌ చేశారు. ప్రజల కంటే పదవులు ఎక్కువ కాదని వారికి హితవు పలికారు. రాజీనామా డ్రామాలాడుతున్న ఎమ్మెల్యేలు, ఎంపీలు చిత్తశుద్ధి ఉంటే స్పీకర్ల ద్వారా తమ రాజీనామాలను ఆమోదింపజేసుకోవాలని వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు.

మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి రెండవ ఎస్సార్సీకే కట్టుబడ్డారని, అయితే.. దిగ్విజయ్‌సింగ్‌ లాంటి కొందరు నాయకులు వైయస్ఆర్‌ తెలంగాణకు అనుకూలమని అసత్యాలు ప్రచారం చేయడం తగదని పార్టీ ఉద్యమ నేతలు నిప్పులు చెరిగారు. విభజన నిర్ణయం రావడంతో రాష్ట్రం రావణకాష్టంలా మారిపోయిందని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తంచేశారు.‌ ఈ పరిస్థితికి కాంగ్రెస్‌తో పాటు, మద్దతు పలికిన టిడిపి నైతిక బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. విభజనపై నిర్ణయం తీసుకునే ముందు విద్యుత్, నీటి పారుదల‌, హైదరాబాద్, ఆదాయ వనరుల సమస్యలను ముందే పరిష్కరించి ఉండాల్సిందన్నారు.

సమైక్యాంధ్ర కోసం శ్రీ జగన్మోహన్‌రెడ్డి చేస్తున్న ఉద్యమం, చిత్తశుద్ధి అన్ని పార్టీలకూ, నాయకులకు ఆదర్శప్రాయం అని వైయస్ఆర్‌ కాంగ్రెస్ మహిళా ‌నాయకులు అన్నారు. శ్రీ జగన్‌ను స్ఫూర్తిగా తీసుకుని సీమాంధ్ర ప్రజల కోసం అన్ని పార్టీలూ పోరాడాలని పేర్కొన్నారు. కాగా, రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర ఎడారిగా మారిపోతుందని మరికొందరు నాయకులు ఆందోళన వ్యక్తంచేశారు. సీమాంధ్రకు ఆదాయ వనరులు తగ్గిపోయి అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. కాంగ్రెస్, టిడిపి మ్యాచ్ ఫిక్సింగ్ వల్లే రాష్ట్రం విడిపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. ఈ పరిస్థితుల్లో అందరినీ భాగస్వాములను చేస్తూ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని మరి కొందరు నాయకులు పిలుపునిచ్చారు.

సమైక్య రాష్ట్రాన్ని రక్షించుకునే వరకూ వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ చేపట్టిన ఉద్యమం ఆ‌గే ప్రసక్తే లేదని పార్టీ నాయకులు స్పష్టం చేశారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో మాట్లాడుతూ సీమాంధ్రులను, తెలంగాణ వాదులను కూడా మోసం చేస్తున్నారని దుయ్యబట్టాన్నారు. సమైక్యాంధ్ర కోసం కేంద్రానికి ఎవరు లేఖ రాసినా తాను మొట్టమొదటి సంతకం చేస్తానని ప్రకటించిన శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్ర సమైక్యత విషయంలో తన చిత్తశుద్ధిని చాటుకున్నారని పలువరు వక్తలు దీక్షా శిబిరాల వద్ద మాట్లాడుతూ ప్రస్తుతించారు.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో‌ మన రాష్ట్రంలో సువర్ణయుగం నడిచిందని అన్ని దీక్షా శిబిరాల వద్దా వక్తలు ప్రస్తావించారు. ఆయన అకాల మరణం తర్వాత రాష్ట్రంలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహానేత ఆశయాలను నెరవేరుద్దాం అంటూ కొన్ని చోట్ల దీక్షా శిబిరాల్లో నినదించారు. మహానేత వైయస్ఆర్ కలలు‌గన్న రాజన్న రాజ్యం శ్రీ జగన్‌తోనే సాధ్యమని స్పష్టం చేశారు. శ్రీ జగన్ నాయకత్వాన్నే‌ రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారని పలువురు పేర్కొన్నారు. శ్రీ జగన్‌ను రాజకీయంగా ఎదుర్కొనలేక కాంగ్రెస్, టిడిపిలు కుమ్మక్కై రాష్ట్రాన్ని ముక్కలు చేసే కుట్రకు తెర లేపాయని పలువురు విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసిన శ్రీ జగన్‌ భావి ముఖ్యమంత్రి అని, ఆయన హయాంలో వచ్చే 25 ఏళ్లలో దేశంలోనే మన రాష్ట్రం అగ్రగామిగా నిలుస్తుందని అన్నారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంతో వినిపించే సమైక్య సింహనాదం ఢిల్లీ వరకు వినిపించాలన్నారు. ఈ నాదంతో విభజన కుట్ర వెనక్కిపోవాలన్నారు.

సీమాంధ్రలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ పెద్ద ఎత్తున జరుగుతున్న మహోన్నత సత్యాగ్రహ ఉద్యమాన్ని చూసైనా కాంగ్రెస్ అధిష్టానం ‌విభజన నిర్ణయాన్ని వెనకకు తీసుకోక తప్పదని కొందరు నాయకులు అన్నారు. తెలుగు ప్రజలను విడదీయాలన్న కుట్రలను తాము ఎదుర్కొంటామని, వారికి ప్రజలే తగిన సమయంలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమైక్య ఉద్యమం రెండు నెలలుగా తీవ్రంగా జరుతుతున్నా కాంగ్రెస్ ‌నాయకులకు చీమ కుట్టినట్టయినా లేదని నిప్పులు చెరిగారు.

వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ చేస్తున్న సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమాన్ని మరో స్వాతంత్య్ర పోరాటంగా పార్టీ నేతలు అభివర్ణించారు. రాజకీయ లాభాపేక్షతో కేసీఆర్ అతని కుటుంబం రాజేసిన చిచ్చుకు కాంగ్రెస్ నాయకులు వాయువులా మారి రాష్ట్రాన్ని రావణకాష్టం చేశారని ధ్వజమెత్తారు. వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సమైక్య సత్యాగ్రహం దీక్షలకు వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది.

Back to Top