షర్మిల సంగ్రామ నినాదాలు!

వడివడిగా ముందడుగు వేస్తూ కొత్త ఒరవడి సృష్టిస్తోంది ఆ పాదం. నిస్సంశయం ఆమె గమ్యం. రికార్డులు, రివార్డులు ఆశించనిది ఆమె ఆశయం.. పల్లె లోగిళ్లను స్పృశిస్తూ... కల్లా కపటం ఎరుగని జనం గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంటూ... కుగ్రామాల్లో సంగ్రామ నినాదాలు వినిపిస్తూ సాగుతున్నది శ్రీమతి షర్మిల ప్రస్థానం... రాజన్న పాలన నాటి మరిచిపోలేని ఆ క్షణాలు సలక్షణంగా వస్తాయని, జగనన్న పాలనలో మళ్లీ అవి మన సొంతమవుతాయని చెబుతూ కదన కుతూహలంతో సాగుతున్న మహానేత తనయ తన పద ఘట్టనలతో కంటకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు.
మీ వెంటే ఉంటామమ్మా :

విజయనగరం :

‘రాజశేఖరరెడ్డిని మరువలేమమ్మా... ఆయన చలవతోనే పింఛన్లు తీసుకుంటున్నాం. మా కష్టాలు తెలిసిన మీ వెంటే మేమంతా ఉంటాం’ అంటూ మహిళలు, వృద్ధులు మహానేత తనయ శ్రీమతి షర్మిలకు భరోసా ఇస్తున్నారు. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా  భూపాలరాజపురం వచ్చిన ఆమెను స్థానికులు ఆప్యాయంగా ఆహ్వానించారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు సైతం రోడ్లపైకి వచ్చి శ్రీమతి షర్మిలను ఆశీర్వదించారు. నిరుద్యోగ సమస్య మళ్లీ ప్రబలుతోందని యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లుగా పనిచేస్తున్నా.. తమకు ఉద్యోగ భద్రత లేదని తెర్లాం పిహెచ్‌సిలో పనిచేస్తున్న అమల తెలిపింది. జగనన్న నేతృత్వంలో వచ్చే ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల కష్టాలను తీరుస్తుందని శ్రీమతి షర్మిల వారికి భరోసా ఇచ్చారు.

నువ్వు రైతుల గోడు :

సకాలంలో వర్షాలు కురవక పంట నష్టపోయామని మెరకముడిదాం మండలం భైరిపురం రైతు సాలాపు రామునాయుడు తన నువ్వు పంటను శ్రీమతి షర్మిలకు చూపించాడు. పంట వివరాలు శ్రీమతి షర్మిల అడిగినప్పుడు ఆయన తన బాధలు చెప్పుకున్నాడు. జగనన్న ప్రభుత్వంలో సబ్సిడీపై బోర్లు వేయించుకునే సదుపాయం కల్పిస్తారని శ్రీమతి షర్మిల తెలిపారు. వరికి కూడా మద్దతు ధర పెరుగుతుందని భరోసా ఇచ్చారు.

చదువు భారమైంది అక్కా :
సరాయివలస సమీపంలోకి వచ్చే సరికి కళాశాల విద్యార్థులు శ్రీమతి షర్మిలకు స్వాగతం పలికారు. తమ సమస్యలు చెప్పుకున్నారు. చదువుకొనడం కష్టంగా ఉందని విద్యార్థినులు ఎం. ప్రశాంతి, ఎం. రోషిణి వివరించారు. ‘అక్కా మాకు చదువుకొనటానికి సరైన వసతులు లేవు. డిగ్రీ కళాశాల నిర్మించాలని కోరినప్పటికీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. మీరైనా మా సమస్య అర్థం చేసుకోండి. డిగ్రీ, ఆపై చదువులు సాగాలంటే 20 నుంచి 30 కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడ బస్సు సదుపాయం కూడా లేదు.’ అంటూ వారు ఆవేదన వ్య క్తం చేశారు. పది నిమిషాల పాటు విద్యార్థుల కష్టాలు విన్న శ్రీమతి షర్మిల కరిగిపోయారు. తోడుగా ఉంటానని ధైర్యం చెప్పారు.

వికలాంగులకు భరోసా :
శ్రీమతి షర్మిలను చూసి తమ గోడు చెప్పుకోవటానికి వికలాంగులు కిలోమీటర్ల దూరం వచ్చారు. వారిని శ్రీమతి షర్మిల ఆప్యాయంగా పలకరించి కష్టసుఖాలు తెలుసుకున్నారు. దత్తిరాజేరు మండలం చినకాదకు చెందిన వికలాంగుడు తన తండ్రి సాయంతో శ్రీమతి షర్మిలను చూడటానికి భూపాలరాజపురం సమీపానికి వచ్చాడు. బెహరా పెంటబాబు అనే ఈ బాలుడు పుట్టినప్పటి నుంచీ మానసిక వికలాంగుడు. అయితే ప్రభుత్వం కనీసం మూడు చక్రాల బండి కూడా ఇవ్వలేదని అతని తండ్రి శ్రీమతి షర్మిల దృష్టికి తీసుకువచ్చారు. దీనికి చలించిపోయిన శ్రీమతి షర్మిల వారం రోజుల్లో మూడు చక్రాల సైకిల్ అందిస్తానని హామీ ఇచ్చా రు. దత్తిరాజేరు జంక్ష‌న్‌లో వికలాంగురాలైన కె. సత్యవతిని శ్రీమతి షర్మిల ఆప్యాయంగా పలకరించి కష్టాలు తెలుసుకున్నారు. తను ఐకేపీలో పనిచేస్తున్నానని, ఉద్యోగ భద్రత లేకుండాపోయిందని తెలుపగా... రాబోయే ప్రభుత్వంలో అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని శ్రీమతి షర్మిల ధైర్యం చెప్పారు.

అదే బాట.. అదే తీరు! :
ఆమె నడక ఒకే తీరున సాగుతోంది. ఆమె యాత్ర దిగ్విజయమవుతోంది. జనం బారులు తీరున్నారు. మంగళవారం నాటి యాత్ర ముగిసేనాటికి శ్రీమతి షర్మిల పాదయాత్ర 2819.2 కిలోమీటర్ల పూర్తయి రికార్డు సృష్టించింది. మరే మహిళా ఇప్పటివరకూ ఇంత దూరం పాదయాత్ర చేయలేదు. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా రాజన్న బిడ్డ, జగనన్న చెల్లెలు శ్రీమతి షర్మిల మంగళవారం ఉదయం భైరిపురంలో పాదయూత్ర ప్రారంభించి సరాయివలస, పోరలి, భూపాలరాజపురం చేరి మధ్యాహ్న భోజనానికి ఆగారు. అనంతరం దత్తిరాజేరు, గొభ్యాం జంక్షన్, దత్తి జంక్షన్, మానాపురం, కోమటిపల్లి జంక్షన్ మీదుగా రాత్రికి మరడాం చేరుకు‌న్నారు. మంగళవారంనాడు ఆమె మొత్తం 15.2 కిలోమీటర్లు నడిచారు.

కాగా, బుధవారంనాడు శ్రీమతి షర్మిల గజపతినగరం నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో యాత్ర పూర్తిచేసుకుని బొబ్బిలి నియోజకవర్గంలో అడుగిడతారు. పాదయాత్రలో వికలాంగులు, వృద్ధులు, పేదలు, దీనులను ఆమె పలకరిస్తూ ముందుకు కదిలారు. వివిధ గ్రామాల ప్రజలు శ్రీమతి షర్మిల పేరిట పూలతో ముగ్గులు వేసి, ఘనంగా స్వాగతం పలికారు. సొంతింటి ఆడబిడ్డలా ఆదరించారు. కోమటిపల్లి బహిరంగ సభలో ఆమె చంద్రబాబు, వైయస్ఆర్, ప్రస్తుత సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనలో ఉన్న తేడాలను ప్రజలకు వివరించారు. జగనన్న స్వర్ణయుగం తెస్తారని, రాజన్న రాజ్యం మళ్లీ వస్తుందని ప్రజలకు ధైర్యం చెప్పారు.

Back to Top