కాంట్రాక్టర్ల జేబులు నింపే ప్రాజెక్టుప్రభుత్వ పెద్దలకూ కమీషన్లు పోలవరం పూర్తికాకుండా చూడడమే లక్ష్యంరాయలసీమకు ప్రయోజనం ఒట్టిమాట...?కృష్ణా నికర జలాలకు మంగళంకాచుక్కూచున్న ఎగువరాష్ట్రాలు పట్టిసీమ... ఇపుడు ఆంధ్రప్రదేశ్‌తో పాటు దాని సరిహద్దు రాష్ట్రాలలో కూడా ఇది హాట్ టాపిక్ గా మారింది.. ఎంతో అనుభవజ్ఞుడైన (?) అపర చాణక్యుడు నారా చంద్రబాబు నాయుడి కలల ప్రాజెక్టు ఇది. బహుళార్థసాధక ప్రాజెక్టు అయిన పోలవరాన్ని పక్కనపెట్టి ఆయన ఈ పట్టిసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును నెత్తికెత్తుకున్నారు. ఒక్క ఏడాదిలో దీనిని పూర్తి చేసి అద్భుతాలు సృష్టిస్తానని చెబుతున్నారు. గోదావరి జలాలను సత్వరమే కృష్ణానదికి తరలించి డెల్టా నీటి అవసరాలు తీర్చుతామని, తద్వారా కృష్ణలో ఆదా అయ్యే నీటిని శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు అందిస్తామని చంద్రబాబు, ఆయన మంత్రివర్గ సహచరులు చెబుతున్నారు. పైకి వినడానికి బాగానే ఉన్నా ఇందులో అనేక వాస్తవాలను వారు మరుగున పరుస్తున్నారు. పోలవరాన్ని పక్కన పెట్టి ఈ పట్టిసీమను ఎందుకు ఎంచుకున్నారు? ఇందులో ఉన్న నిజానిజాలేమిటి? వారి వాదనల ప్రకారం కృష్ణాడెల్టాకు, రాయలసీమకు ఈ పట్టిసీమతో ప్రయోజనం ఉంటుందా? వంటి విషయాలను చూద్దాం.... కాంట్రాక్టర్ల జేబులు నింపే ప్రాజెక్టుకాంట్రాక్టర్ల జేబులు నింపి వారు ఇచ్చే కోట్ల రూపాయల కమిషన్ల కోసం కక్కుర్తి పడి ఈ పట్టి సీమ ప్రాజెక్టును తెలుగుదేశం ప్రభుత్వం హడావిడిగా తలకెత్తుకుంది. పట్టిసీమ టెండర్లలో జరిగిన మోసాలే ఇందుకు ప్రబల నిదర్శనం. కేవలం ఇద్దరే ఇద్దరు కాంట్రాక్టర్లు టెండర్లలో పాల్గొన్నారు. ఇతర కాంట్రాక్టర్లను ఈ టెండర్ల ప్రక్రియలో పాల్గొననీయకుండా భయపెట్టారు. 21.9 శాతం ఎక్కువకు టెండరు కోట్ చేసిన పట్టిసీమ కాంట్రాక్టరుకు.. ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తే 16.9శాతాన్ని బోనస్‌గా ఇస్తామని బాబు సర్కారు హామీ ఇవ్వడం దేన్ని సూచిస్తుంది? పోలవరం ప్రాజెక్టు వల్ల రాష్ట్రానికి ప్రయోజనం చేకూరితే పట్టి సీమ వల్ల కాంట్రాక్టర్ల ద్వారా లబ్ది పొందే చంద్రబాబుకు మాత్రమే ప్రయోజనమని దీనిని బట్టి అర్ధం కావడం లేదూ? పోలవరంపై శీతకన్ను ఎందుకు?గోదావరి నదిపై నిర్మిస్తున్న చిట్టచివరి రిజర్వాయరే పోలవరం. మొట్టమొదటి నదుల అనుసంధాన ప్రాజెక్టు అయిన పోలవరం ఆంధ్రప్రదేశ్‌కి జీవనాడి. కోస్తా జిల్లాల్లోని బీడువారిన భూములను సస్యశ్యామలం చేయడంతో పాటు విద్యుత్ కొరతను తీర్చగలిగే సామర్థ్యమున్న, అలాగే రాయలసీమకు తాగునీటి అవసరాలు తీర్చే బహుళార్థ సాథక ప్రాజెక్టు ఇది. ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి సాహసోపేతంగా ప్రారంభించారు. దాని అంచనా వ్యయం రు.16,060 కోట్లు. ఇప్పటివరకు చేసిన ఖర్చు రు.5,150 కోట్లు. దీనిని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్టు అథారిటీని కూడా ఏర్పాటు చేసింది. వైఎస్ మరణానంతరం ఈ ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. మూడేళ్లకు పైగా కాలయాపన జరిగింది. చివరకు ఏడాదిన్నర క్రితం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం మరో కంపెనీకి పనులను అప్పగించింది. 48నెలల గడువులో పూర్తి కావలసిన పనులు ఇప్పటికి 20 నెలలు గడుస్తున్నా కేవలం ఐదున్నరశాతం మాత్రమే పూర్తయ్యాయి. చంద్రబాబు సర్కారు కూడా ఏదో విధంగా పోలవరాన్ని ఆలస్యం చేయడానికే మొగ్గుచూపుతోంది. బాబు అధికారం చేపట్టి 11 నెలలవుతున్నా 11 అంగుళాల పనులు కూడా జరగలేదు. అందుకే కేంద్రం నుంచి ఈ ప్రాజెక్టుకు నిధులు రావడం ఆగిపోయిందని అధికారవర్గాలంటున్నాయి. పోలవరాన్ని పూర్తి చేస్తే వైఎస్‌కు ఆఘనత దక్కుతుందని అందుకే చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తున్నారనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. అందులో భాగంగానే పోలవరాన్ని నీరుగార్చడం కోసం పట్టిసీమను ముందుకు తెచ్చారనే విమర్శలున్నాయి. కుడికాల్వ పూర్తికాకుండా నీటి సరఫరా ఎలా?పోలవరం దిగువన పట్టిసం వద్ద గోదావరి జలాలను 24 పంపులతో తోడి 3.2 మీటర్ల వ్యాసం గలిగిన పైపుల ద్వారా 4.5 కిలో మీటర్ల దూరం లోని పోలవరం కుడికాల్వలోకి చేరుస్తారు. ఇందుకు 150 మెగావాట్ల విద్యుత్ అవసరమని అంచనా. పట్టిసీమ నుంచి గోదావరి నీరు కృష్ణాలోకి చేరేది పోలవరం కుడికాల్వ ద్వారానే. అయితే పట్టిసం నుంచి కుడికాల్వకు మధ్య ఇంకా భూసేకరణ జరగలేదు. దానిని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉండగా 174 కిలోమీటర్ల పొడవైన పోలవరం కుడి కాల్వలో ఇంకా 43.5 కిలోమీటర్ల భాగం తవ్వకం జరగాలి. అందుకు గాను 1,820 ఎకరాల భూ సేకరణ జరగాలి. అది జరగాలంటే హైకోర్టులో ఉన్న రైతుల దావాలు తేలాలి. అటవీ, గిరిజన భూముల సేకరణ కూడా జరగాలి. ఇవన్నీ జరిగితేనే పని మొదలయ్యేది. ఈ కాలువ పూర్తి కానిదే పట్టిసీమ నీరు కృష్ణానదికి చేరడం దుర్లభం. ఆరు నుంచి 9 నెలల్లోగానే గోదావరి నీటిని కృష్ణానదికి తరలిస్తామని చెబుతున్న తెలుగుదేశం నాయకులు ఈ విషయాలు ఎందుకు చెప్పడం లేదు? కుడికాల్వ పూర్తి చేయడానికి ఇంకా 1,800 కోట్లు కావాలి. పట్టిసీమకు రాష్ర్ట బడ్జెట్‌లో ఇచ్చిన రు.257 కోట్లకు తోడు కేంద్ర ప్రభుత్వం ఏఐబీపీ నిధులు రు.850 కోట్ల నుంచి రు.775 కోట్లు కేటాయించారు. మొత్తం 1,032 కోట్లు. ప్రాజెక్టు వ్యయం 22 శాతం పెరిగి రు.1,450 కోట్లకు చేరింది. మిగతా రు.400 కోట్లు లేకుండా ఈ ప్రాజెక్టు ఎలా పూర్తవుతుంది? ఎగువరాష్ట్రాలకు 70 టీఎంసీలు కోల్పోతాం..గోదావరి ట్రిబ్యునల్ అవార్డ్ 7(ఇ) ప్రకారం పోలవరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి లభించిన వెంటనే కుడికాల్వకు ఎప్పుడు నీటిని మళ్లిస్తారనే విషయంతో సంబంధం లేకుండా 80 టీఎంసీల్లో 35 టీఎంసీల కృష్ణా నీటిని ఎగువ రాష్ట్రాలైన మహారాష్ర్ట, కర్ణాటక వాడుకునే స్వేచ్ఛ ఉంటుంది. అదే విధంగా 7(ఎఫ్) ప్రకారం కుడికాల్వకు మళ్లించే 80 టీఎంసీలకు అదనంగా మళ్లించే నీటిలోనూ ఎగువ రాష్ట్రాలకు వాటా ఉంటుంది. అదనంగా మళ్లించే నీటిలోనూ 7(ఇ)లో పేర్కొన్న దామాషా ప్రకారం వాటా పొందే హక్కు ఎగువ రాష్ట్రాలకు ఉంటుంది. దీని ప్రకారం చూస్తే పోలవరం ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ అనుమతి వచ్చింది కాబట్టి 35 టీఎంసీలు, పట్టిసీమ ద్వారా కుడికాల్వకు మళ్లిస్తామని ప్రభుత్వం చెబుతున్న 80 టీఎంసీల్లో మరో 35 టీఎంసీలు.. మొత్తం 70 టీఎంసీల నీటిని ఎగువ రాష్ట్రాలు మన రాష్ట్రానికి లభించే నికర జలాలనుంచి తీసుకోవడానికి స్వేచ్ఛ లభిస్తుంది. అంటే గోదావరి నుంచి చుక్కనీరు కృష్ణా డెల్టాకు చేరక ముందే.. 70 టీఎంసీల కృష్ణా నికర జలాలను ఎగువ రాష్ట్రాలకు కోల్పోయే ప్రమాదముందన్నమాట. సీమకు ప్రయోజనం... ఒట్టి డొల్ల కబుర్లేగోదావరి నీటిని కృష్ణాకు మళ్లించడం ద్వారా కృష్ణా డెల్టాలో మిగిలే నీటిని సీమకు వినియోగిస్తామని చంద్రబాబు చెప్పడం విడ్డూరమే. నిజానికి గోదావరి, కృష్ణా నదులు రెండింటికీ దాదాపు ఒకే సమయంలో వరదలొస్తాయి. కృష్ణాలో వరదలున్నపుడు గోదావరి నీటిని లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు. అలాగే కృష్ణా డెల్టాకు నీటి అవసరం ఉన్నపుడు గోదావరిలో వరద లేకపోతే లిఫ్ట్ చేయడానికి అవకాశమూ ఉండదు. అంటే కృష్ణా డెల్టాకే గోదావరి నీటి తరలింపుపై గ్యారెంటీ లేదు. కానీ గోదావరి నీటిని కృష్ణా డెల్టా అవసరాలకు వాడి అక్కడ మిగిలే కృష్ణా నికర జలాలను శ్రీశైలం నుంచి రాయలసీమకు మళ్లిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే కృష్ణానీటిని రాయలసీమకు తీసుకెళ్లడానికి రెండే మార్గాలున్నాయి. ఒకటి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, రెండోది హంద్రీనీవా సుజల స్రవంతి. ఈ రెండు ప్రాజెక్టుల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని పూర్తి చేయకుండా రాయలసీమకు అదనంగా నీటిసరఫరా అసాధ్యం. ఆ ప్రాజెక్టుల పూర్తికి తగినన్ని నిధులు కేటాయించని చంద్రబాబు ప్రభుత్వం సీమకు నీరెలా సరఫరా చేస్తుందో అర్ధం కాని విషయం. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచడానికి, హంద్రీనీవా పనులు పూర్తిచేయడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి శాయశక్తులా కృషి సాగించారు. ఆయన మరణానంతరం ఇవి వెనకపట్టుపట్టాయి. గోదావరి నీటి మళ్లింపు జరిగినా జరగక పోయినా పట్టిసీమలో పంపింగ్ ప్రారంభం కాగానే బచావత్ అవార్డు ప్రకారం ఎగువ రాష్ట్రాలు 70 టీఎంసీలను అదనంగా వినియోగించేసుకుంటే నష్టపోయేది సీమవాసులే. ఎందుకంటే శ్రీశైలం రిజర్వాయర్‌లో కనీసం 854 అడుగుల నీటిమట్టం ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా సీమకు కృష్ణా జలాలు అందుతాయి. పోలవరం, పట్టిసీమ పేరుతో ఎగువ రాష్ట్రాలు 70 టీఎంసీల కృష్ణా నికర జలాలను అదనంగా వాడుకుంటే శ్రీశైలం రిజర్వాయర్‌లో తగినంత నీరు చేరుతుందా? అంటే రాయలసీమకు ఇపుడు అందుతున్న అరకొర నీరు కూడా హుళక్కేనా..? అందువల్ల పట్టిసీమతో రాయలసీమకు పెను ప్రమాదం పొంచి ఉంది. బాబు చెబుతున్న సీమ ప్రయోజనాలు ఒట్టి కల్లబొల్లి కబుర్లే...