బాబుగారి మరో దుబారా వ్యవహారం!

మాస్టర్‌ప్లాన్‌లో తప్పటడుగులు
మార్పులు చేస్తున్న సింగపూర్ కంపెనీలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి గారి కబుర్లు చూస్తే అబ్బో అసలు ఆయన లేకపోతే ఈ ప్రపంచం ఏమైపోయి ఉండేదో అన్నట్లుంటాయి... రాజధానిపై చంద్రబాబు చెప్పిన, చెబుతున్న కబుర్లు చూసి ఇంకేముంది సింగపూర్ వచ్చి తుళ్లూరులో కూర్చుంటుంది అనుకుంటారు ఎవరైనా... ప్రపంచస్థాయి నగరం... సింగపూర్ కంపెనీల మాస్టర్‌ప్లాన్... కన్సల్టెన్సీలతో భేటీలు.. ఇంకేముంది అంతా ఆహా ఓహో అనుకున్నారు. మాస్టర్‌ప్లాన్ రెడీ అయిపోయింది అని కూడా ఊదరగొట్టారు. తీరా చూస్తే మాస్టర్‌ప్లాన్‌లో అనేక తప్పటడుగులున్నట్లు తేలింది. క్షేత్రస్థాయి పరిస్థితులకు విరుద్ధంగా మాస్టర్‌ప్లాన్ రూపొందినట్లు రుజువయ్యింది. వాస్తవాన్ని గ్రహించిన సింగపూర్‌కంపెనీలు ఇపుడు మాస్టర్‌ప్లాన్‌ను మార్చే పనిలోపడ్డాయి. సీఆర్‌డీఏ, మున్సిపల్‌శాఖ అధికారులతో సింగపూర్ ప్రతినిధులు సమావేశాల మీద సమావేశాలు జరుపుతున్నారు. కొండవీటివాగు, ఇతర వాగుల వల్ల రాజధాని ప్రాంతానికి ముంపు ముప్పు ఉందన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా సింగపూర్ కంపెనీలు మాస్టర్‌ప్లాన్‌ను రూపొందించాయి. ముంపు ఉంటుందనే విషయం సింగపూర్ ప్రతినిధులకు తెలియదు. కొండవీటి వాగును క్రమబద్ధీకరించాలని, ముంపు నీటిని మళ్లించేందుకు రిజర్వాయర్‌ను నిర్మించాలని సీఆర్‌డీఏ, నీటిపారుదల శాఖ అధికారులు కొన్ని ప్రతిపాదనలను సిద్ధం చేశారు. అపుడే మనవాళ్లకు మాస్టర్‌ప్లాన్ గుర్తుకొచ్చింది. అందులో కొండవీటి వాగు ముంపు ప్రమాదం, రిజర్వాయర్ నిర్మాణం విషయాల గురించి సింగపూర్ ప్రతినిధులకు తెలియదన్న విషయం వెల్లడయ్యింది. దాంతో రాష్ర్ట ప్రభుత్వ బృందం హడావిడిగా సింగపూర్ వెళ్లి రాజధాని ప్రాంతానికి వరద ముంపు ప్రధాన సమస్య అని సింగపూర్ ప్రతినిధులకు చెప్పారు. ఏటా వర్షాకాలంలోను, తుపానుల సమయంలోను రెండుసార్లు వాగులు పొంగి ఈ ప్రాంతం మునిగిపోయే పరిస్థితి ఉందని చెప్పి వరద ఎక్కడి నుంచి ఏ గ్రామాల మీదుగా ప్రవహిస్తుంది.. కృష్ణానదిలో ఎలా కలుస్తుంది.. అనే విషయాలను వివరించారు. వరదల సమయంలో కొండవీటి వాగు ప్రభావం ఎక్కువగా ఉంటుందని, దానికి పొట్టేల, పాల, అయ్యన్న, నరుకుల్ల, యర్ర, ఓగేరు, నల్లమడ వంటి చిన్న చిన్న వాగులు తోడై వరద ఇంకా పెరుగుతుందని చెప్పారు. ఈ వాగుల ద్వారా మూడు టీఎంసీల నీరు గ్రామాలను ముంచెత్తుతుంది. ఇది ఐదు టీఎంసీల వరకు పెరిగే అవకాశం ఉంటుంది కూడా. ఈ సమస్యను పరిగణనలోకి తీసుకోకపోతే భవిష్యత్‌లో రాజధానికి ముంపు ముప్పు ఉంటుందని వివరించారు. వరద నీటిని మళ్లించేందుకు రిజర్వాయర్లు నిర్మించడం, కొండవీటి వాగును వెడల్పు చేయడం ఈ సమస్యకు పరిష్కారమని సూచించారు. ఈ  నేపథ్యంలో నాలుక్కరుచుకున్న సింగపూర్ ప్రతినిధులు ముంపును దృష్టిలో ఉంచుకుని మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేపట్టారు. వారంరోజుల నుంచి మార్పుల కసరత్తు జరుగుతున్నదని సమాచారం. గత కొన్ని సంవత్సరాలుగా రాజధానిప్రాంతంలో వర్షపాతం వివరాలను అడిగితే అందుబాటులో లేవని అధికారుల నుంచి సమాధానం వచ్చింది. దాంతో కొన్నేళ్లుగా వస్తున్న వరదల లెక్కలను దృష్టిలో ఉంచుకుని సింగపూర్ ప్రతినిధులు మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు చేస్తున్నారట. రాష్ర్ట ప్రభుత్వం ప్రతిపాదించినట్లు ఒక రిజర్వాయర్ కాకుండా రాజధాని ప్రాంతంలో రెండు రిజర్వాయర్లు నిర్మించాలని మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదిస్తున్నారని సమాచారం.
Back to Top