సర్కార్‌ మొద్దు నిద్ర

– ఏపీలో కానరాని సంక్షేమం, అభివృద్ధి జాడ 
– మూడేళ్లు కావస్తున్న తప్పని ఇబ్బందులు
– మొదలెట్టడం.. పక్కనెట్టడమే బాబు సిద్ధాంతం
– ప్రతిపక్ష నేత పోరాడితే తప్ప ఉలుకు పలుకు లేని ప్రభుత్వం
– బాబుకు వైయస్‌ జగన్‌ బెత్తం దెబ్బలు ఇంకెన్నాళ్లో

చంద్రబాబును చూస్తే చిన్నప్పుడు ఎప్పుడో చదువుకున్న భర్తృహరి సుభాషితం ఒకటి గుర్తొస్తుంది. ‘‘ ఆరంభింపురు నీచ మానవులు విఘ్నాయాస సంతుష్టులై ఆరంభించి పరిత్యజింతురు మధ్యముల్‌... ’’ఇలా ఉంటుందా పద్యం. అధములైన మానవులు ఏదైనా పనులు మొదలు పెట్టాలంటే ఎక్కడ ఏ ఆపద వచ్చిపడుతుంతోనని మొదలు పెట్టంకుండానే వదిలేస్తారు. మధ్యములు పనిని మొదలు పెట్టి చిన్న కష్టమొచ్చినా ఇక ముందుకు కదల్లేక అక్కడే చతికిలబడిపోతారు.  చంద్రబాబు పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రదేశ్‌ ప్రజలు అభివృద్ధి అనే మాటకు మొహం వాచి పోయి ఉన్నారు. చంద్రబాబు సభల్లో ఆయన చెబుతుంటే వినడమే తప్ప ఈ మూడేళ్ల కాలంలో ఎక్కడ చూసినట్టు గుర్తులేదు. ఏ పనీ అంతసామాన్యంగా మొదలు పెట్టరు.. మొదలు పెట్టిన పనేదీ పూర్తి చేయరు. వెళ్లినచోటల్లా సృష్టకర్త బ్రహ్మలాగా విశ్వానికి ఆది నేనే.. అంతమూ నేనే అన్నట్టు చెప్పుకోవడంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. 

ఎన్నాళ్లు బెత్తంతో కొట్టాలి
పూర్వం గ్రామాల్లో పెద్దోళ్లకి ఒక నమ్మకం ఉండేది... వాళ్ల పిల్లలకు చదువు సరిగ్గా అబ్బకపోతే రెండు తగిలించైనా పాఠం బుర్రరకెక్కించమని పంతుళ్లకి మొహమాటం లేకుండా చెప్పేవారు. ఏపీలో ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసే ఓవరాక్షన్, అవినీతిపై ఎప్పటికప్పుడు చీవాట్లు పెడుతూ అదిలిస్తుంటే తప్ప పాలన సరిగా సాగని పరిస్థితి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజు నుంచి నేటి వరకు దాదాపు మూడేళ్ల కాలంలో చంద్రబాబును వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముళ్ల క్రర పెట్టి అదిలించాల్సి రావడం ముఖ్యమంత్రికే సిగ్గుచేటు.
 
మొదలుకాదు..పూర్తవదు
చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేస్తూనే భారీ వాగ్ధానాలు, కపట ప్రేమతో పరిపాలన మొదలుపెట్టాడు. ఆనాటి నుంచి నేటి వరకు ఒక్క మాటలో నిలకడ లేదు. ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టత ఉండదు. ఎప్పుడు మొదలు పెడతారో కూడా తెలియదు. కానీ డెడ్‌ లైన్‌ మాత్రం ముందే చెప్పడం బాబుకు అలవాటు. తీరా మొదలెట్టిన పనులు పూర్తయ్యే సమయం వచ్చే నాటికి అవి పురిటి కష్టాల్లోనే ఉంటాయి. అమరావతి నిర్మాణం, పోలవరం, తుంగభద్ర లాంటి పెద్ద పెద్ద నిర్మాణాలు మొదలుకుని ఆయా జిల్లాల్లో మొదలెట్టి వదిలేసిన చిన్న చిన్న పనులు అడుగు కూడా ముందుకు పడని పరిస్థితి ఇప్పడు ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తుంది. 

రుణమాఫీ మొదలు.. నిన్నటి తూ.గో పర్యటన దాకా 
రైతులు, డ్వాక్రా మహిళలకు బేషరతుగా రుణాలు మాఫీ చేస్తాను నేను మారాను. మొన్నటి ముఖ్యమంత్రిని కాను. నాలో మార్పొచ్చింది. రైతులే నా దేవుళ్లు.  మీకోసం వస్తున్నా.. అని పాదయాత్రలో కన్నీళ్లు కార్చిన చంద్రబాబు సీఎం కాగానే.. కుర్చీ ఎక్కిన క్షణం నుంచే.. సీఎం ఆఫీస్‌ గాలి సోకగానే.. ఏదో మంత్రం వేసినట్టు మారిపోయారు. అంతా మామూలే.. డబ్బా కొట్టుకోవడం మొదలైంది. అంతర్జాతీయ రాజధాని నిర్మిస్తానని మొదలెట్టిన బాబు ఇప్పటకి పునాది రాళ్లు కూడా వేయలేకపోయాడు. బేషరతుగా రుణాలు మాఫీ చేస్తా ఎవరూ కట్టొద్దు.. అధికారంలోకి వచ్చీ రాగానే చేసే మొదటి పని అదేనని చెప్పిన బాబు రైతుల ఆశలపై నీళ్లు చల్లాడు. బాబు చేసిన రుణమాఫీ వడ్డీలకు కూడా సరిపోని పరిస్థితి. రుణాలు మాఫీ చేయకుండానే అంతా చేశానంటూ పచ్చి అబద్ధాలు చెబుతూ ఓటేసి గెలిపించిన రైతులకు మొహం వాచేలా లెంపకాయలు కొట్టాడు. 

 ప్రతిపక్ష నాయకుడు వైయస్‌ జగన్‌ రంగంలోకి దిగి రైతు దీక్షలు, భరోసా యాత్రలు, నిరాహార దీక్షలు చేస్తే తప్ప ప్రభుత్వం దిగిరాలా. ఎట్టకేలకు మొదటి విడత అలా ముగిసింది. రెండో విడత కూడా షరా మామూలే. మళ్లీ వైయస్‌ జగన్‌ దీక్షలు.. ప్రభుత్వం దిగిరావడం.. రెండో విడత జరగడం. ఇప్పుడు మూడో విడత ఏం జరుగుతుందో చూద్దాం. డ్వాక్రా మహిళలకు చేస్తానన్న రుణమాఫీ ఏమైనా చేశాడా అంటే లేదు. మళ్లీ వైయస్‌ జగన్‌ దీక్ష చేయక తప్పని పరిస్థితి. ఎన్నికలకు ముందు పూర్తి మాఫీ అన్న బాబు పదివేలకు మించి ఇవ్వడం కుదరదన్నాడు. ఆ ముష్టి పదివేలు కూడా మూడు విడతల్లో ఇస్తానని చావు కబురు చల్లగా చెప్పాడు. అనంతపురంలో కరువుతో రైతులు అల్లాడుతుంటే వైయస్‌ జగన్‌ వెళ్లి దీక్ష చేయాలి. బాబూ జనం రోగాలతో చచ్చిపోతున్నారు ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయండి అని వైయస్‌ జగన్‌ ఒంగోలు వెళ్లాలి. పోలవరం నిర్వాసితులకు, గిరిజన ప్రజలకు నష్టపరిహారం ఇవ్వమని తూర్పుగోదావరి వెళ్లి చెప్పి రావాలి. ప్రత్యేక హోదా ఇస్తామన్న కేంద్రాన్ని నిలదీయమని మళ్లీ ప్రతిపక్ష నాయకుడే గుర్తుచేయాలి. ప్యాకేజీకి ఒప్పుకున్నట్లు ప్రకటిస్తే ప్యాకేజీతో ప్రయోజనాలుండవు.. హోదా రాష్ట్రం బాగుపడుతుందని ఊరూరా తిరిగి జనాలకు అవగాహన కల్పించాలి. అప్పుడు హోదా సంజీవని అన్నావ్‌ కాదా ఇప్పుడెందుకు మాటమార్చావ్‌ బాబూ.. అని మళ్లీ వైయస్‌ జగన్‌ వెళ్లి నిలదీయాలి. 

ప్రత్యేక హోదా వల్ల కలిగే లాభాలపై వైయస్‌ జగన్‌ యువభేరి ద్వారా విద్యార్థులకు చెబితే.... వారు చంద్రబాబును తిట్టిపోస్తే తప్ప టీడీపీ నాయకులు మాట్లాడరు. సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న చిన్నారులు అన్నం బాగలేదని తూగో పర్యటనలో ఉన్న వైయస్‌ జగన్‌ వద్ద లబోదిబోమంటే ఆయన వెళ్లి ఇలాంటి ఆహారమా పిల్లలకు పెట్టేది అని నిలదీస్తే తప్ప అధికారులకు మెళకువ రాదు. రంపచోడవరం గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు బాధలు అక్కడే ఉన్న అధికారులకు ఎక్కడో ఉన్న ప్రతిపక్ష నాయకుడు చెబితే తప్ప తెలియడం లేదు. వారిలో చలనం లేదు. ఈ నెల 7, 8 తేదీల్లో జగన్‌ తూర్పు గోదావరి జిల్లా ఏజన్సీలో పర్యటించిన విషయం తెలిసిందే. మొదటి రోజు రంపచోడవరంలో పోలవరం నిర్వాసితులతో ముఖాముఖి జరిపాక మారేడుమిల్లి వెళుతుండగా.. రంపచోడవరం గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులు ఆయన కాన్వాయ్‌ని ఆపారు. సరైన భోజనం, హాస్టల్‌లో కనీస మౌలిక వసతులు లేక తాము పడుతున్న ఇబ్బందులను చూడాలని కోరారు. విద్యార్థుల విజ్ఞప్తిని మన్నించిన వైయస్‌ జగన్‌.. గురుకుల పాఠశాలను స్వయంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. 

ఐటీడీఏ పీవోగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన ఏఎస్‌ దినేష్‌కుమార్‌ గురుకుల పాఠశాలను ఆదివారం సందర్శించారు. మరుగుదొడ్లను పరిశీలించారు. వాటి మరమ్మతులకు తక్షణం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఈ సమస్యను ఇప్పటివరకూ పట్టించుకోలేదేమంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమస్యపై ప్రిన్సిపాల్‌ రాజ్యలక్ష్మితోనూ చర్చించారు. చివరికి రాష్ట్రంలో పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయంటే వైయస్‌ జగన్‌ కల్పించుకుంటే కానీ ఏ పనీ ముందుకు కదల్లేని దుస్థితి. వెనకుండి బెత్తం పట్టుకుని వీపు మీద నాలుగు తగిలిస్తే తప్ప చంద్రబాబుకు ప్రజలు గుర్తురారు. గడ్డి పెడితే తప్ప అవినీతి తప్పని తెలియదు. ఆయన పస్తులుంటే తప్ప రైతుల కష్టాలు కనబడవు. 
 
Back to Top