‘శంకర’గిరి మాన్యాలు!

స్వపక్ష విపక్ష నిర్ధూమధాముడనే బిరుదు పొందిన మాజీ మంత్రి డాక్టర్ శంకరరావు హస్తవాసి -ఆయన వైద్యుడిగా ఉన్న రోజుల్లో- పెద్దగా ప్రాచుర్యం పొందలేదు.ఒక్కొక్క ‘చెయ్యి’ మహిమ అలా ఉంటుంది మరి!
స్వపక్ష విపక్ష నిర్ధూమధాముడనే బిరుదు పొందిన మాజీ మంత్రి డాక్టర్ శంకరరావు హస్తవాసి -ఆయన వైద్యుడిగా ఉన్న రోజుల్లో- పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. కానీ, రాజకీయాల్లో నిండా ములిగిన తర్వాత, శంకరన్న చెయ్యి తగిలితే చాలు- శంకరగిరిమాన్యాలేననే వాడుక స్థిరపడింది. సుప్రీం కోర్టు తప్పబట్టిన మంత్రులందరూ పదవుల్లోంచి తక్షణమే తప్పుకోవాలని శంకరన్న ఇప్పుడు కొత్త డిమాండ్ ఎత్తుకున్నారు. గతంలో మంత్రి పదవిలో ఉండగానే జైలుపాలయిన మోపిదేవి వెంకటరమణ, ఇప్పుడు ధర్మాన ప్రసాద రావు రాజీనామాలు చేసిన నేపథ్యంలో శంకరన్న మొత్తం మంత్రులందరికీ మునుంపట్టినట్లు అనిపిస్తోంది. తన పదవి పోతే పోయింది- మరెవరికీ మిగలకూడదని శంకరన్న పంతం పట్టినట్లు కనిపిస్తోంది.
అంతేకాదు- సుప్రీం కోర్టు తప్పుబట్టిన మంత్రులెవరికీ న్యాయ సహాయం ఇవ్వకూడదన్నది శంకరన్న మరో డిమాండు. న్యాయ సహాయం దిశగా జారీ అయిన జీవోను తక్షణమే ఉపసంహరించుకోవాలని కూడా అన్న డిమాండ్ చేశారు. ‘సుప్రీం కోర్టు మంత్రుల ప్రవర్తనకు అభ్యంతరం చెప్పిందంటే అర్థమేమిటి? ఆయా మంత్రులు తప్పు చేశారనే కదా! తప్పు చేసినవాళ్లను ముఖ్యమంత్రి కాపాడేందుకు ప్రయత్నించడం ఇంకా పెద్ద తప్పు అవుతుం’దని శంకరన్న హెచ్చరించారు. అంతవరకూ బాగానే ఉంది. కానీ, అక్కడే ఆగిపోతే ఆయన శంకరన్న ఎందుకవుతాడు? సుప్రీం కోర్టును అడ్డుపెట్టుకుని శంకరన్న ముఖ్యమంత్రి మీద నిప్పులు చెరిగారు. అసలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి వల్లనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్వనాశనమవుతోందని శంకరన్న తేల్చిచెప్పారు.
ఎలుకలు ఎక్కువయినందుకు ఎవరో కొంపకు నిప్పు పెట్టుకున్నారట. వాళ్లెవరోకానీ, కాంగ్రెస్ వాళ్లే అయ్యుంటారనిపిస్తుంది. శంకరరావు లాంటి వాళ్లను ఆయుధాలుగా వాడి రాజకీయ ప్రత్యర్థుల పనిపట్టాలనుకున్న వారికి తమ అస్త్రం బూమరాంగ్ కావడం చూసి మతిపోతోంది. ప్రత్యర్థి పక్షాల మీదే అస్త్ర ప్రయోగం చెయ్యాలనిశంకరరావు లాంటివాళ్లకు ఎంత నచ్చచెప్పినా వాళ్లు వింటారా? కనీసం, స్వపక్షీయులపై దాడులు చెయ్యకయ్యా మహానుభావా అన్నా లెక్కచెయ్యడే శంకరన్న! ఓకే- మొత్తం కాంగ్రెస్ పార్టీని ఉద్ధరించాల్సిన అవసరం లేదుగానీ, నాగ్రూపు వాళ్ల జోలికి రాకుండా ఉండు బాబూ నీకో దణ్ణం! అని బతిమాలుకున్నారు కొందరు నేతలు. ఊహూ(, మన శంకరన్న వింటేగా! ఈ గాలిదుమారం కాంగ్రెస్ పార్టీలోని సకల గ్రూపులనూ చుట్టుముట్టి ‘దుమ్ము రేపుతోంది’- శంకరన్నా, మజాకానా?
ఎందరిని ఎన్ని తిట్లు తిట్టినా, శంకరన్న ఒక్క చేదు నిజం మాత్రం చెప్పాడు- అందుకాయనకు ధన్యవాదాలు చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో పిల్చి బతిమాలినా ఎవ్వరూ కాంగ్రెస్ టికెట్లు తీసుకోబోరని శంకరన్న అన్నమాట అక్షరాలా వాస్తవం! లయకారుడయిన శంకరరావు ద్వారా ఎవరినో ఏదో చేద్దామనుకున్న కాంగ్రెస్ నేతలు ఆయన చేతుల్లోనే తమ పార్టీ మొత్తం శంకరగిరి మాన్యాలు పట్టిపోవడం చూసి బెంబేలెత్తుతున్నారు!

 
Back to Top