గుంటూరు : నాగార్జున యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకొన్న రిషితేశ్వరి మరణం విషయంలో ప్రభుత్వం ఆడతున్న దొంగాట వివాదాస్పదం అవుతోంది. సాధ్యమైనంత వరకు ఈ అంశాన్ని తక్కువ చేసి చూపించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీనిపై ఏర్పాటైన వైఎస్సార్‌సీపీ నిజ నిర్ధారణ కమిటీ క్యాంపస్ లో పర్యటించినప్పుడు అనేక విషయాలు వెల్లడయ్యాయి. యూనివర్శిటీ అధికారుల సాయంతో నిజాల్ని మరుగున పడేట్లుగా వ్యవహరిస్తున్నారు.<br/>రిషితేశ్వరి గదిలో సౌకర్యాలు బాగున్నాయంటూ కొత్త కథకు యూనివర్శిటీ అధికారులు తెర దీశారు. ఎదురుగా ఉన్న సీనియర్ల రూమ్ లో సౌకర్యాలు అంత సరిగ్గా లేవని, తాము ఈ రూమ్ లోకి వస్తామని గొడవ చేయటంతో రిషితేశ్వరి మనస్తాపం చెందిందంటూ కొత్త కథ అల్లుతున్నారు. ఈ మనస్తాపంతోనే ఆమె ఆత్మహత్య చేసుకొందంటూ ప్రచారం చేస్తున్నారు. దీనిపై విద్యార్థులు, స్థానికులు మండిపడుతున్నారు.<br/>రిషితేశ్వరి ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితుల మీద డైరీ రాసుకొంది. ఈ డైరీ లో ఎవరెవరు ఎలా ప్రవర్తించినదీ, ఏ విధంగా తాను క్షోభ పడింది వివరణాత్మకంగా ఆమె వర్ణించింది. ర్యాగింగ్ పేరుతో , ప్రేమ పేరుతో ఏ విధంగా వేధించిందీ ఆమె వెల్లడించింది. యూనివర్శిటీ లో ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ బాబూరావు ప్రవర్తన గురించి డేవిడ్ రాజు వంటి ప్యాకల్టీ సభ్యులు వివరంగా చెబుతూనే ఉన్నారు. ఫ్రెషర్స్ డే పార్టీ రోజున ఫుల్లుగా మందు కొట్టి ఏ రకంగా డ్యాన్సులు చేసిందీ వీడియో సాక్ష్యాలతో సహా దొరికాయి. <br/>ఇంత స్పష్టంగా ఆధారాలు ఉన్నప్పటికీ, ఎందుచేత ఈ విధంగా తప్పు దారి పట్టిస్తున్నారనే దానిపై నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు మండిపడ్డారు. ప్రిన్సిపాల్ మీద ఇంత వరకు ఎందుకు ఫిర్యాదు ఇవ్వలేదని నిలదీశారు. చివరకు అన్ని ఆధారాలు స్పష్టంగా ఉండటంతో ప్రిన్సిపాల్ బాబూరావు వైఖరి మీద వీసీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. <br/>