రేషన్‌.. పరేషాన్‌

– చంద్రన్న మాల్స్‌తో ప్రైవేటుకు బార్లా  
– ప్రజా పంపిణీ వ్యవస్థకు పెను ముప్పు
– కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు బాబు సర్కారు యత్నలు

లాభాల వేటలో ఆవురావురుమంటున్న బహుళజాతి సంస్థలు చిల్లర వర్తకంలో ప్రవేశానికి తెలుగు దేశం ప్రభుత్వం తలుపులు బార్లా తీశారు. ’రాష్ట్రమంతా 6500 చంద్రన్న విలేజ్‌ మాల్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రత్తిపాటి ఇప్పటికే పుల్లారావు ప్రకటించారు. ఈ మాల్స్‌ను రిలయన్స్, ప్యూచర్‌ గ్రూప్‌లకు అప్పగిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇక్కడ మామూలు ధర కంటే 20 శాతం తక్కువకే సరకులు లభిస్తాయని ప్రజలను ఊరించే ప్రయత్నం చేశారు. రేషన్‌ డిపోలకు అనుబంధంగా మాల్స్‌ ఏర్పాటు చేస్తున్నామన్న మంత్రి, అక్కడ ఎవరైనా సరుకులు కొనుగోలు చేసుకోవచ్చని, రేషన్‌ కార్డులతో సంబంధం లేదని’ వివరించారు. అంటే రేషన్‌ షాపులు బహుళజాతి సరుకుల అమ్మకాలకు అడ్డాలుగా మారబోతున్నాయనే.

విలేజ్‌ మాల్స్‌లో అధిక ధరలు  

ప్రస్తుతం రేషన్‌ దుకాణాల్లో బియ్యం మినహా మరే ఒక్క సరుకూ అందించడం లేదు. దీంతో లబ్ధిదారుల్లో, రేషన్‌ డీలర్లలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గతంలోనే రేషన్‌ దుకాణాలను విలేజ్‌ మాల్స్‌లా మార్చి నిత్యావసర సరుకుల (కందిపప్పు, సెనగపప్పు, మినప గుళ్లు)ను బహిరంగ మార్కెట్‌ కన్నా తక్కువ ధరలకు కిలో రూ.50కు విక్రయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే విలేజ్‌ మాల్స్‌ పేరుతో విక్రయించేందుకు రేషన్‌ దుకాణాలకు సరఫరా చేస్తున్న సరుకుల్లో నాణ్యత కొరవడింది. దుకాణాలకు సరఫరా చేసిన పామాయిల్‌ లీటరు ప్యాకెట్‌ రూ.52కు సరఫరా చేస్తే, బహిరంగ మార్కెట్లో రూ.50లకే అందుబాటులో ఉండేది. దీంతో విలేజ్‌ మాల్సులోని నాణ్యత లేని సరుకులు కొనేందుకు రేషన్‌ వినియోగదారులు ఆసక్తి చూపలేదు. 
పథకం ప్రకారం నిర్వీర్యం 
జూలై నుండి చౌక ధరల దుకాణాల్లో చక్కెర పంపిణీని కేంద్రం నిలిపివేసింది. అప్పటి నుండే బియ్యానికి బదులు నగదు బదిలీ చేస్తామని చంద్రబాబు ప్రభుత్వం లంకించుకుంది. అందులో భాగంగా రేషన్‌ బియ్యం ఇచ్చినా తీసుకోవట్లేదంటూ కట్టుకథలల్లి ఏకంగా 19 లక్షల తెల్ల రేషన్‌ కార్డులను రద్దు చేసేందుకు కుయుక్తులు పన్నింది. మూడు మాసాలుగా రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ డేగ కన్నేసి శోధించి 19 లక్షల కుటుంబాలు బియ్యం తీసుకోవట్లేదని తేల్చింది. కార్డులు రద్దు చేయదలచిన 19 లక్షల కుటుంబాల్లో 57 లక్షల మంది సభ్యులున్నారు. రేపోమాపో వీరందరూ రేషన్‌ బియ్యం కోల్పోక తప్పదు. కార్డుల రద్దు ఘనకార్యం వలన నెలకు 28 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం మిగులుతాయని, ఆ మేరకు ప్రభుత్వం భరించే సబ్సిడీ రూ.91 కోట్లు ఆదా అవుతుందన్నది అంచనా. చంద్రబాబు విదేశీ పర్యటనల కోసం కోట్లు గుమ్మరించేందుకు వెనుకాడని ప్రభుత్వం.. పేదలకు సరుకుల పంపిణీలో చిల్లర చేష్టలు చేయడం దుర్మార్గం. 

చిల్లర వర్తకంపై ప్రభావం 

ప్రధాన నగరాల్లో మాల్స్‌ ఏర్పాటు చేయడం ఇప్పటికే చిల్లర వర్తకులపై ప్రభావం చూపుతోంది. వ్యాపారులు 40 శాతం మార్కెట్‌ను కోల్పోయారని పరిశీలకులు అంటున్నారు. ఇప్పుడు రేషన్‌ దుకాణాల్లో రిలయన్స్, ఫ్యూచర్‌ గ్రూపులను అనుమతిస్తే గ్రామీణ చిల్లర వర్తకులపై ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వ్యవసాయం నష్టాల పాలు కావటంతో లక్షల మంది చిల్లర వర్తకంపై ఆధారపడి జీవిస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అయినా రేషన్‌ డిపోలను ప్రయివేటు వ్యక్తులకు ఇవ్వడం వలన సరుకుల్లో నాణ్యతా ప్రమాణాలు లోపించడంతో పాటు నిలదీసే హక్కు కూడా లబ్ధిదారులు కోల్పోతారు. సబ్సిడీ కొనసాగించాలనే నియమం కూడా ఉండదు. క్రమంగా కొన్నాళ్లకు రేషన్‌ కార్డులు ఉపయోగపడని విధంగా మారుతాయి
రైతులకూ ముప్పే..

ప్రజాపంపిణీ వ్యవస్థను కార్పొరేట్లకు అప్పగిస్తే ప్రజల ఆహార భద్రతకు ముప్పు వస్తుంది. భారత ఆహార సంస్థను మూసేస్తే రైతుల పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోతుంది. రైతులు పంటలు అమ్ముకునే పరిస్థితి ఉండదు. దీంతో పంటలు కొనే దిక్కులేక రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయి. పేదలకు ఇస్తున్న సబ్సిడీలను తగ్గించాలని గతంలోనే చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నించింది. నేడు మరలా అదే ప్రయత్నాన్ని కొనసాగిస్తోంది. ప్రజాపంపిణీ ద్వారానే పేదలకు కొద్దోగొప్పో ఆహారం అందుతోంది. ఇప్పటికే పౌష్టికాహారం లేని దేశాల్లో మొదటి స్థానంలో మనం ఉన్నాం. ఈ పరిస్థితి ఇప్పుడు మరింత దిగజారుతుంది.  

తాజా వీడియోలు

Back to Top