మంత్రిగారి కొడుకా..మ‌జాకా..!

హైద‌రాబాద్‌) ఆడ‌పిల్ల‌ను వేధించిన కేసులో అడ్డంగా దొరికి పోయిన మంత్రి రావెల కిశోర్ కుమారుడు రావెల సుశీల్ కేసులో ఎన్నెన్నో మ‌లుపులు క‌నిపిస్తున్నాయి. చ‌ట్టం నుంచి త‌ప్పించుకొనేందుకు చేసిన ప్ర‌య‌త్నాలు అన్నీ బెడిసికొట్టాయి.
ప‌ట్ట ప‌గ‌లు తప్ప తాగి అధికార మ‌దం, ధ‌న మ‌దంతో రావెల సుశీల్ హైద‌రాబాద్ న‌డిబొడ్డున చెల‌రేగిపోయాడు. రోడ్డున వెళుతున్న మ‌హిళా టీచ‌ర్ ను చెర‌ప‌ట్టేందుకు తీవ్రంగా ప్ర‌య‌త్నించాడు. స్థానికులు గ‌మ‌నించి, ప‌ట్టుకొని పోలీసుల‌కు అప్ప‌గించారు. మంత్రి కొడుకుని అని బెదిరించి అక్క‌డ నుంచి సుశీల్ జారుకొన్నాడు. అయితే ఈ విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌డంతో బెయిల్ కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నించాడు. అది దొర‌క్క పోవ‌టంతో తెల్ల‌వారు జాము స‌మ‌యంలో పోలీసు స్టేష‌న్ లో లొంగిపోయాడు. 
మైనార్టీ యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఏపీ మంత్రి రావెల కిశోర్ తనయుడు రావెల సుశీల్(24)తో పాటు ఆయన కారు డ్రైై వర్ రమేష్‌కు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో సుశీల్ ను అరెస్టు చేసిన బంజారాహిల్స్‌ పోలీసులు నిందితులను న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. కోర్టు సెలవు కావడంతో తుర్కయాంజాల్‌లో నివసించే మూడవ అదనపు మెట్రోపాలిటన్ జడ్జి తిరుపతిరావు ముందు హాజరుపరిచారు.  కేసు పూర్వాపరాలు పరిశీలించిన మీదట ఈ ఇద్దరికీ 14 రోజులు రిమాండ్ విదిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో నిందితులను పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. 
కాగా... రావెల సుశీల్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ ఈ నెల 8కి వాయిదా పడింది. పోలీసులు వీరిద్దరినీ కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా దానిపై మంగళవారం విచారణ నిర్వహిస్తానని చెప్పారు.
 
Back to Top