ఓవైపు జనం కోసం జగన్‌ తలపెట్టిన ప్రజాసంకల్పయాత్ర జైత్రయాత్రలా సాగుతుంటే, నారా బాబుగారి రాజకీయాలు రంగులు మారుతున్నాయి. ఓవైపు జనంతో మమేకమవుతూ, వారి సమస్యలు వింటూ, వారికి భరోసానిస్తూ జగన్‌ నడుస్తున్న కొద్దీ, చంద్రబాబు రోజుకో రాజకీయరంగు పులుముకుంటున్నారు.
దాదాపు నాలుగున్నరేళ్లపాటు బీజేపీతో అంటుకట్టిన మొక్కలా అతుక్కుపోయి, ఎదిగిపోవాలని చూసిన బాబుగారి ఆటలు అక్కడ పెద్దగా సాగకపోయేసరికి, ఇదేదో అసలుకే ఎసరు తెచ్చేలా వుందని ఆ పార్టీతో కటీఫ్‌ చెప్పారు. తాను చెప్పినట్టు వినడానికి, తాను ఆడమన్నట్టు ఆడటానికి బీజేపీ ఏమీ టీడీపీ తోకపార్టీ కాదు. ఆ మాటకొస్తే..టీడీపీనే ఇంతకాలం బీజేపీ తోక పట్టుకుని ’ఆ..విధంగా ముందుకు’ పోయే ప్రయత్నాలు చేసింది. ప్రపంచానికే పాఠాలు చెప్పి..జీడీపీల  రేటింగ్స్‌ వివరించే తనను ఏమాత్రం పట్టించుకోకపోవడం నిజంగానే బాబును బాధించింది. ఆత్మగౌరవాన్ని భ్రమరావతిలో వదిలేసి...అంతగా చేతులు కట్టుకుని, మరీ వంగివంగి దండాలు పెట్టినా...’హు ఆర్‌ యూ..’ అన్నట్టుగా మోడీగారు చూస్తుంటే, బాబుగారికేంటి ఎవరికైనా కాలాల్సిన చోట కాలుతుంది. అందులో తప్పులేదు. కాపురం చేసినంత కాలం నా ఆయనకు సాటిలేరని వీధివీధి చాటేసి, మట్టిచ్చిన, ముంతనీళ్లిచ్చినా కల్పవృక్షాన్ని, కామధేనువును ఇంటికాడే కట్టేశాడని అడక్కునా అందరికీ చెప్పేసి...తేడా వచ్చాక, విడిపోయాక...నా మొగుడు..నా డ్యాష్‌బోర్డు అని ఎంత మొత్తుకుంటే మాత్రం ఏమి ఒరుగుతుంది. చూశాంలే మ్మా, నీ సంబడం...నీ పొత్తుల కాపురాలు ఎవరికి తెలియదు అని ఎవరైనా ఈసడించుకుంటారు. నవ్విపోతే నవ్విపోదురుగా...నాకేటి సిగ్గు తరహాలో రాజకీయం నడుపుకొచ్చే బాబుగారు అవేవీ పెద్దగా పట్టించుకోరు. కింద పడ్డా తనదే పై చెయ్యి అంటారు. పైగా, నన్ను పడేయడానికి కుట్రలు, కుయుక్తులు పన్నేవాళ్లు ఎక్కువయిపోయారు...ఇక మీరే నా రక్షణ వలయం..నన్ను మీరు కాపాడుకోండి, మిమ్మల్ని నేను కాపాడుతాను, ప్రజల ముందు కొత్తరంగుతెర తీస్తారు. 

అచ్చంగా బాబుగారు నెలకోసారి నాలుకమడతపెట్టేస్తూ...ఇలాంటి రాజకీయమే నడుపుతున్నారు. తను వదిలేస్తే వదిలేశాడు కదా అనుకోకుండా...వైఎస్సార్‌సీపీ బురద చల్లుతున్నాడు. తమ పచ్చటి కాపురంలో నిప్పులు పోశారని బోరుమంటున్నాడు. ప్రజలకు భ్రమరావతిని కట్టించేసి, పోలవరాన్ని పారించేద్దామనుకుని, ఇంకా ఇంకా ఏవేవో చేసేద్దామనుకుంటే...ఈ నాలుగేళ్లలో ఏ ఒక్కటీ చేయకపోవడానికి కారణం ప్రతిపక్షమే కారణమంటూ నల్లరంగు రాజకీయ రంగు రాజకీయంతో రంగులేస్తున్నాడు. ఈ సారేదో అయిపోయింది...ఇక మరోసారి గద్దెనెక్కించండి...పంచరంగులే మీకు పులుముతానంటూ ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను నమ్మించడానికి పసుపు పచ్చగా ప్రలోభపెట్టే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నాడు. చంద్రబాబుగారంటే అంతే మరి! ఊసరవెల్లికే సరి!!