రాజన్న జలయజ్ఞంతో అన్నాచెల్లెళ్ళ అనుబంధం

హైదరాబాద్, 19 డిసెంబర్‌ 2012: తండ్రి ఆశయాలనే తమ ఆశయాలుగా చేసుకున్నారు ఆ అన్నా చెల్లెళ్ళు.  నాన్న లక్ష్యాలనే తమ లక్ష్యాలుగా మార్చుకున్నారు వారిద్దరూ. ఆ మహానేత మాటనే తమ మాటగా మలచుకున్నారు. నాన్న ధ్యేయాన్ని పూర్తిచేయాలని అన్న కంకణం కట్టుకున్నారు. పోలవరం ప్రాజెక్టు కోసం హరిత యాత్ర చేశారు. కృష్ణా జలాల కోసం దేశ రాజధాని ఢిల్లీలో దీక్ష చేపట్టారు. కాగా, నాన్న ఆశయాలను భుజానికి ఎత్తుకున్నారామె. అన్న లక్ష్యాలను మనసుతో మోస్తున్నారామె. ఆ అన్న ఎవరో కాదు దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి తనయుడు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి, రాజన్నగా ప్రజలంతా హృదయంలో నిలుపుకున్న పెద్దాయన ముద్దుల తనయ శ్రీమతి షర్మిల ఆ చెల్లెలు. గలగల పారే నీళ్ళలో నాన్నను చూసుకోవాలని ఆ బిడ్డలిద్దరూ తపస్సు చేస్తున్నారు.

రాష్ట్రంలోని బీడు భూముల్లో జలరాశులు గలగల పారాలన్నది దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆశయం. రాష్ట్రంలోని ఏ ఒక్క ఎకరా కూడా నీళ్ళు లేక పంట ఎండిపోయిందనే పరిస్థితి రాకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు. అందుకే జలయజ్ఞానికి రూపకల్పన చేశారు. నిధులు కేటాయించారు. దాదాపు 90 శాతం పనులను పూర్తిచేశారు. ఆ మహనీయుని అకాల మరణంతో మిగిలిన కొద్దిపాటి జలయజ్ఞం పనులూ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన నిలిచిపోయాయి. ఒక వైపున ప్రకృతి నిరాదరణతో అనావృష్టి లేదా అతివృష్టి. లేదంటే అకాల వర్షాలు. మరో పక్కన అసమర్థ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి. ఈ పరిస్థితులతో అన్నదాతలు, ప్రజలు అల్లాడిపోతున్న వైనం.

సరిగ్గా ఈ సమయంలోనే తండ్రి ఆశయాలను అమలు చేయాలన్న సదాశయంతో ముందుకు వచ్చారు శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి. తండ్రి అకాల మరణాన్ని తట్టుకోలేక తనువు చాలించిన వందలాది అభిమానుల కుటుంబాలను వారి ఇళ్ళకే వచ్చి ఓదార్చుతానని మాట ఇచ్చారు. నల్లకాలువలో జరిగిన తండ్రి సంస్మరణ సభలో తాను ఇచ్చిన మాటకు శ్రీ జగన్మోహన్‌రెడ్డి కట్టుబడ్డారు. ఎన్ని వత్తిడులు ఎదురైనా మడమ తిప్పకుండా ముందుకు నడిచారు. జనం బాధలు తన బాధలుగానే భావించారు. అన్నదాతల ముఖంలో చిరునవ్వులు పూయించాలనుకున్న రాజన్న బాటలోనే ముందడుగు వేశారు.

మహానేత రాజన్న ప్రారంభించిన జలయజ్ఞంపై వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ జగన్మోహన్‌రెడ్డి, ఆయన సోదరి శ్రీమతి షర్మిల పూర్తి స్థాయిలో స్పందించారు. స్పందిస్తూనే ఉన్నారు. ప్రాజెక్టులను సందర్శించినప్పుడు, ప్రాజెక్టుల కోసం నినదించినప్పుడు, ఉద్యమాలు చేసినప్పుడు వారి భావనలు, ఆలోచనలు సుస్పష్టం అవుతున్నాయి.

అసమర్థ కాంగ్రెస్‌ ప్రభుత్వం తీరుకు, దానితో అంటకాగుతున్న చంద్రబాబు నాయుడి శైలికి నిరసనగా అన్న శ్రీ జగన్మోహన్‌రెడ్డి తరఫున శ్రీమతి షర్మిల చరిత్రాత్మకంగా మరో ప్రజాప్రస్థానం పేరిట సుదీర్ఘ పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్రలో కొద్ది రోజుల క్రితం మోకాలికి గాయమై, అపోలో ఆస్పత్రిలో డిసెంబర్ 18న (2012) శస్త్ర చికిత్స చేయించుకున్నారు. కాలి నొప్పితోనూ ఆమె మొక్కవోని ధైర్యంతో ప్రజల కోసం పాదయాత్ర కొనసాగించారు. తాను బాధపడుతున్నా ప్రజల కోసమే, వారితో మమేకమయ్యేందుకే తపించారు.

పాదయాత్ర సందర్భంగా శ్రీమతి షర్మిల కాల్వలను చూశారు. వాగులను చూశారు. ప్రాజెక్టులను సందర్శించారు. పారే నీళ్ళలో‌ మహానేత వైయస్ఆర్‌ ఆశయాలను, జగనన్న లక్ష్యాలనూ చూశారామె. నాన్న బతికే ఉంటే ఈ పాటికి జలయజ్ఞం పూర్తయి ఉండేదని భావించారు. 'నాన్న బతికే ఉంటే నేను నిలబడిన చోటే నిలబడి ఆ నీళ్ళను చూస్తూ నాన్న ఎంతో ఆనందపడేవారు' అని షర్మిల అన్న మాటలు ఆమె ఆలోచనలకు అద్దం పడతాయి. ప్రాజెక్టులను ఎప్పుడు పూర్తిచేస్తారంటూ  శ్రీమతి షర్మిల ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు.

మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర ప్రారంభించినప్పటి నుంచీ శ్రీమతి షర్మిల జలయజ్ఞం గురించి ప్రజలకు వివరిస్తున్నారు. వైయస్‌ఆర్‌, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పాదయాత్ర సందర్భంగా శ్రీమతి షర్మిల హంద్రీ -నీవా ప్రాజెక్టు గురించి తెలుసుకున్నారు. జలయజ్ఞం పూర్తయితే వచ్చే ప్రయోజనాల గురించి ఆమె చెప్పారు. హంద్రీ- నీవా ప్రాజెక్టుతో రాయలసీమ సస్యశ్యామలం అవుతుందన్నారు.

అయితే, మహానేత మరణించిన తరువాత ఐదు నుంచి పదిహేను శాతం పనులు పూర్తిచేయడానికే ఈ ప్రభుత్వం మూడేళ్ళ సమయం తీసుకుందని శ్రీమతి షర్మిల వ్యాఖ్యానించారు. హంద్రీ- నీవా ప్రాజెక్టు ప్రారంభించినప్పుడు మహానేత వైయస్‌ పేరును సీఎం కిరణ్‌ ప్రస్తావించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమలోనే హంద్రీ -నీవా అతి పెద్ద ప్రాజెక్టు అని, అనంతపురం తరువాత కర్నూలు జిల్లాకు దీని ద్వారా ఎంతో మేలు జరుగుతుందని మహానేత భావించిన విషయాన్ని శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టు రాకపోతే రాయలసీమకు నీళ్ళు రావని రాజశేఖరెడ్డి దీన్ని ఎలాగైనా పూర్తిచేయాలని చిత్తశుద్ధితో కృషిచేసిన విషయాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు రెండుసార్లు శిలా ఫలకాలు వేసి వదిలేసినా ఈ పథకాన్ని వైయస్‌ ముఖ్యమంత్రి అయ్యాక చేపట్టి 90 శాతం పూర్తిచేసిన విషయం తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాయలసీమలో 6 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం వచ్చే విషయాన్ని వెల్లడించారు. ఎన్నో వందల గ్రామాలకు తాగునీరు కూడా వస్తుందని తెలిపారు. కేవలం రూ. 40 కోట్లు ఖర్చు చేస్తే మొదటి దశ పూర్తవుతుందని తెలిసి కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిన వైనాన్ని తూర్పారపట్టారు.

తెలంగాణలో అతి పెద్ద ఎత్తిపోతల పథకం ప్రాణహిత- చేవెళ్ళను మహానేత వైయస్‌ సాహసోపేతంగా ప్రారంభించిన విషయం శ్రీమతి షర్మిల గుర్తుచేశారు. తెలంగాణ ప్రాంతం నుంచి ఎందరో ముఖ్యమంత్రులైనప్పటికీ, చివరికి ప్రధాన మంత్రి పీఠం అధిష్ఠించినప్పటికీ ఈ ప్రాజెక్టు జోలికి పోని విషయం ప్రస్తావించారు. తెలంగాణ పట్ల తన తండ్రి వైయస్‌కు ఎంత ప్రేమ లేకపోతే ప్రాణహిత - చేవెళ్ళను చేపడతారని అన్నారు. ఈ ప్రాజెక్టు తెలంగాణలోని ఏడు జిల్లాలను సస్యశ్యామలం చేస్తుందని, 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే విషయాన్ని తెలిపారు. ఈ ప్రాజెక్టు అసాధ్యమని ఎంత మంది చెబుతున్నా, తెలంగాణకు ఇది అవసరం అని భావించి ధైర్యంగా చేపట్టి, తన తండ్రి సాహసం చేశారన్నారు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించేందుకు మహానేత వైయస్‌ పడిన తపన గురించి వివరించారు. కల్వకుర్తి, భీమా, పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు, రామన్‌పాడు మంచినీటి ప్రాజెక్టు గురించి కూడా శ్రీమతి షర్మిలకు స్పష్టమైన అవగాహన ఉంది.

పాలమూరు పాదయాత్రలో శ్రీమతి షర్మిల నెట్టెంపాడు ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు వివరాలను ఇంజనీర్లను అడిగి ఆమె తెలుసుకున్నారు. ప్రాజెక్టు ఆవరణలో ఉన్న వైయస్‌ విగ్రహానికి పాలతోను, అనంతరం పవిత్ర కృష్ణా జలాలతో అభిషేకం చేశారు. జలయజ్ఞంలో భాగంగా మహానేత వైయస్‌ ప్రారంభించిన నెట్టెంపాడు ప్రాజెక్టు పూర్తయితే 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ప్రాజెక్టును పరిశీలిస్తున్న సమయంలో శ్రీమతి షర్మిల దివంగత వైయస్‌ఆర్‌ను గుర్తుచేసుకుని ఉద్వేగానికి గురయ్యారు. పాలమూరు జిల్లాలోని ఈ ప్రాజెక్టు ద్వారా గద్వాల, ఆలంపురం నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందుతుంది.

2004లో ఎన్నికలకు ముందు చంద్రబాబు ఆపద్ధర్మ సిఎంగా ఉండగా 25 వేల ఎకరాలకు సాగునీరు అందించే విధంగా రూ. 78 కోట్ల అంచనాతో నెట్టెంపాడుకు శంకుస్థాపన చేస్తే, మహానేత వైయస్‌ ముఖ్యమంత్రి అయిన తరువాత 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.1428 కోట్ల ఖర్చు అంచనాతో దీనికి పునాదిరాయి వేశారు. 2009 వరకూ వైయస్ వెయ్యి కోట్లతో 70 నుంచి 80 శాతం పనులు పూర్తిచేశారు. అయితే, వైయస్‌ మరణం తరువాత నిధులు రాకపోవడంతో ప్రాజెక్టు పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. ప్రాజెక్టు పూర్తయినా, కెనాల్‌లు అందుబాటులోకి రాకపోవడంపై శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. నెట్టెంపాడు ప్రాజెక్టు పరిధిలోని గ్రామాలకు సాగు, తాగునీటికి లోటు ఉండకూడదని వైయస్‌ డబ్బులు కేటాయించిన విషయాన్ని వెల్లడించారు.‌ ఈ ప్రాజెక్టు కోసం వైయస్ డబ్బులు కేటాయించినా కానీ ప్రస్తుత ప్రభుత్వం మూడేళ్ళుగా నిధులు విడుదల చేయని వైనాన్ని తూర్పారపట్టారు. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా సాగునీరు కాదుగదా కనీసం తాగడానికి కూడా నీళ్ళు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

భారీ నీటిపారుదల ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలన్న దేశ ప్రథమ ప్రధాని పండిట్ జవహర్‌లాల్‌ నెహ్రూ మాటలను కచ్చితంగా పాటించిన మహానేత వైయస్‌ఆర్‌. ఇంకుడుగుంతలు కాదు భావి తరాలకు భారీ ప్రాజెక్టులు అవసరమని గుర్తించి జలయజ్ఞాన్ని ఆయన చేపట్టారు. జలయజ్ఞం ప్రాజెక్టులను ప్రారంభించడమే కాకుండా వాటిని వేగంగా పూర్తిచేయాలని పరుగులు పెట్టించిన వ్యక్తి ఆయన. ఒక్క గ్రామాన్ని కూడా ముంపునకు గురి కానివ్వనని ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు ప్రారంభం సందర్భంగా విశాఖపట్నం సభలో ధైర్యంగా ప్రకటించిన ధీశాలి వైయస్‌. ఆంధ్రప్రదేశ్‌ను దేశానికే అన్నపూర్ణ చేయాలనుకున్నారు.

తండ్రి రక్తాన్నే కాదు ఆ మహానేత వైయస్ ఆశయాలు, ఆలోచన‌లు, లక్ష్యాలను పుణికిపుచ్చుకున్నారు ఆయన తనయుడు, జననేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డి. జలయజ్ఞం ప్రాధాన్యతను తన తండ్రి నుంచే ఆయన తెలుసుకున్నారు.  జలయజ్ఞం పూర్తయితే, రాష్ట్రం ఎంతగా సస్యశ్యామలం అవుతుందో ఆయన మాటల నుంచే గ్రహించారు శ్రీ వైయస్‌ జగన్‌. అందుకే మహానేత వైయస్‌ అకాల మరణం తరువాత జలయజ్ఞంపై నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ఈ అసమర్థ ప్రభుత్వాన్ని పలుమార్లు నిలదీసి ప్రశ్నించారు.

ప్రాణహిత చేవెళ్ళ, పోలవరం ప్రాజెక్టుల ప్రాధాన్యత ఆయనకు బాగా తెలుసు. ఈ రెండు ప్రాజెక్టులే కాకుండా జలయజ్ఞంలోని 86 ప్రాజెక్టుల ఆవశ్యకత గురించి శ్రీ జగన్మోహన్‌రెడ్డికి విపులంగా తెలుసు. ప్రాజెక్టులు పూర్తయితే, రైతన్న ముఖంలో చిరునవ్వులు చూడాలన్న ధ్యేయంతో మహానేత  వైయస్‌ జలయజ్ఞాన్ని ప్రారంభించిన విషయాన్ని గుర్తించారు. దివంగత ప్రియతమ నేత కలలుగన్న హంద్రీ నీవా ప్రాజెక్టు పనులను చూస్తే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు కనబడుతోందన్నది శ్రీ జగన్మోహన్‌రెడ్డి ఆవేదన. హెచ్‌ఎల్‌సి తుంగభద్ర ప్రాజెక్టు పూర్తిచేసుకుని ఉంటే ప్రతి రైతు సోదరుడి ముఖంలో చిరునవ్వు కనపడేదని ఆయన భావన.

పోలవరం ప్రాజెక్టు సాధన కోసం హరిత యాత్ర పేరుతో శ్రీ జగన్మోహన్‌రెడ్డి వారం రోజులు పాదయాత్ర చేశారు. పోలవరం పూర్తయితే మన రాష్ట్రం దేశానికే అన్నపూర్ణగా మారుతుందన్నది ఆయన నిశ్చితాభిప్రాయం. మన రాష్ట్రం బాగుపడాలంటే పోలవరం ప్రాజెక్టుతో పాటు ప్రాణహిత- చేవెళ్ళ సాధించాలని అంటారాయన. దుమ్ముగూడెం నుంచి నాగార్జునసాగర్‌ టేల్‌ పాండ్‌ వరకూ నీళ్ళు తీసుకువెళ్ళే ప్రాజెక్టూ సాధించాలంటారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కలలు కూడా నెరవేరాలన్నది శ్రీ జగన్‌ మాట. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే తప్ప మన రాష్ట్రానికి మంచి రోజులు రావన్నది ఆయన అభిప్రాయం. అయితే, జలయజ్ఞాన్ని ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదని ఆయన ఆవేదన, ఆగ్రహం. ప్రాజెక్టులు పూర్తి చేయాల్సిన ఆవశ్యకతను ఆయన గుర్తించారు.

రాష్ట్రం బాగుండాలని, పాడి పంటలతో కళకళలాడాలని మహానేత బిడ్డలు చేస్తున్న పోరాటం వృథా కాదు. కృష్ణ, గోదావరి నదులను కలపాలని తహతహలాడిన అపర భగీరథుడి ఆశయం నెరవేరే రోజు త్వరలోనే వస్తుందన్నది రాష్ట్ర ప్రజల ఆకాంక్ష.
Back to Top