హైదరాబాద్: ఇంధన సర్దుబాటు చార్జీల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విద్యుత్ వినియోగదారుల నుంచి రూ. 10 వేల కోట్లు వసూలు చేస్తూ నడ్డి విరుస్తోందని సర్వత్రా నిరసనలు వినిపిస్తున్నాయి. తాజాగా వచ్చే ఏప్రిల్ నుంచి విద్యుత్ చార్జీలు పెంచేసి మరో రూ. 15 వేల కోట్లు జనం జేబుల నుంచి కొల్లగొట్టాలని యత్నిస్తుండడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రజల కష్టాలు పట్టించుకోకుండా నిరుపేదలు, సామాన్యుల మీద కూడా మోయలేని ఆర్థిక భారం మోపాలని ప్రభుత్వం యత్నిస్తోంది. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనకు ప్రజలు పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నా కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం వెనక్కు తగ్గకపోవడం పట్ల సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వం తీరుపై తీవ్రంగా స్పందించిన వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిలిచింది. ప్రభుత్వం కళ్లు తెరిపించాలని కంకణం కట్టుకుంది. బుధవారంనాడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోని విద్యుత్ సబ్ స్టేషన్లు, ఎస్‌ఈల కార్యాలయాల ముందు ఆందోళనలు చేస్తోంది.
విద్యుత్ సంస్థ (డిస్కిం)లు చేసిన ప్రతిపాదనలు అన్ని వర్గాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయకపోవడంతో నష్టాల్లో కూరుకుపోయామని పరిశ్రమల యజమానులు లబోదిబోమంటున్నారు. ప్రస్తుతం రూ.1,20 ఉన్న విద్యుత్ యూనిట్ చార్జీలు ఏకంగా రూ.1.69లకు పెంచడం అన్యాయం అని చిన్న, భారీ పరిశ్రమల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోకపోతే పరిశ్రమలు మూసుకోవాల్సిందేనని వారు ఆవేదన చెందుతున్నారు. సమయానికి విద్యుత్ లేక పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు నీరుగారిపోతున్నారు. కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక గృహ వినియోగదారులు కూడా అవస్థలు పడుతున్నారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోయినా బిల్లుల మోత పెరిగిపోయిందని సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఒక్క పైసా చార్జి పెంచని మహానేత వైయస్ : 2004లో అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తన ఐదేళ్ళ పాలనా కాలంలో ఒక్క పైసా కూడా విద్యుత్ చార్జీలు పెంచకుండా సువర్ణయుగాన్ని అందించారు. అయితే, మహానేత మరణానంతరం పగ్గాలు చేపట్టిన రోశయ్య 2010 ఆగస్టు 1 నుంచి 300 పైబడి వినియోగించిన వారికి యూనిట్ల చార్జీలు, సర్వీసు చార్జీ పెంచారు. దీంతో ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం పడింది. రోశయ్య తరువాత అధికారంలోకి వచ్చిన కిరణ్ కుమార్‌రెడ్డి ప్రభుత్వం 2011 ఏప్రిల్ 1న పెంచిన చార్జీలతో వాణిజ్య, పారిశ్రామిక కనెక్షన్లతో పాటు గృహ వినియోగదారులపై తీవ్రమైన ఆర్థిక భారం మోపింది. అప్పుడూ రాష్ట్ర ప్రజలపై మరింత భారం పడింది. 2012 ఏప్రిల్ 1 నుంచి యూనిట్‌పై 35 పైసలు పెంచి మరిన్ని కోట్ల భారాన్ని ప్రజలపై మోపింది. ఇప్పుడు తాజాగా చేస్తున్న ప్రతిపాదనలకు సిఎం పచ్చజెండా ఊపడంతో వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రాష్ట్ర ప్రజలపై మరో రూ. 15 వేల కోట్ల మేరకు భారం పడనున్నది.
కిరణ్ ప్రభుత్వం 2012 ఏప్రిల్ నుంచి సర్దుబాటు చార్జీలు వసూలు చేసేందుకు దీపావళి ముందు ఉత్తర్వులు జారీ చేసింది. యూనిట్‌పై రూ.1.32 పైసలు వసూలు చేసి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండేసి సర్దుబాటు చార్జీలు వేసింది. 2009 ఏప్రిల్ నుంచి ఏడాది పాటు వినియోగించిన యూనిట్‌పై 40 పైసల చొప్పున పాత సర్దుబాటు చార్జీలు వసూలు చేసేందుకు 2012 జూలైలో ప్రభుత్వం అంగీకరించి రెండు నెలల పాటు బిల్లుల్లో వేశారు. దీనిపై ప్రజా సంఘాలు హైకోర్టును ఆశ్రయించడంతో స్టే విధించింది. అయితే దీనిపై విద్యుత్ శాఖ సుఫ్రీం కోర్టును ఆశ్రయించింది. కోర్టు నుంచి విద్యుత్ శాఖకు త్వరలో అనుమతి వస్తుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. సుప్రీంకోర్టు అనుమతి అలా ఇస్తే మరింత భారం ప్రజలపై పడనుంది. ఈ మోతలు చూసి విద్యుత్ మాటెత్తితేనే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
మహానేత వైయస్ హామీని నీరుగార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం :తీవ్ర వర్షాభావ పరిస్థితులకు తోడు రైతులను విద్యుత్ కష్టాలు వెంటాడుతున్నాయి. మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ ప్రకటించిన వ్యవసాయానికి ఏడు గంటల ఉచిత విద్యుత్ హామీని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే నీరుగార్చింది. రెండు విడతల్లో ఏడు గంటలు ఇవ్వాల్సి ఉండగా ఐదారు విడతల్లో నాలుగు గంటలు కూడా ఇవ్వలేని దుస్థితి నెలకొంది. సర్వీసు చార్జీలు పెంచడం, చెల్లించని రైతుల వ్యవసాయ కనెక్షన్లు కత్తిరించడం, స్టార్టర్లు తీసుకుపోవడం వంటి చర్యలకు విద్యుత్ శాఖ అధికారులు పాల్పడుతున్నారు.
మూడేళ్ల కాలంలో ఏడు సార్లు విద్యుత్ చార్జీలు పెంచిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. మహానేత డాక్టర్ వైయస్‌ఆర్ బాటలోనే ఆయన తనయుడు, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజలకు దగ్గరవడాన్ని జీర్ణించుకోలేక అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష టిడిపి కుట్ర పన్ని ఆయనను జైలుపాలు చేశాయి. అయినప్పటికీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక నిర్ణయాలపై పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి విజయమ్మ నిరంతర పోరాటం సాగిస్తున్నారు. అందులో భాగంగానే మరోసారి విద్యుత్ చార్జీల పెంపునకు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైయస్‌ఆర్‌సిపి ఆధ్వర్యంలో బుధవారం విద్యుత్ సబ్‌స్టేషన్ల ముట్టడికి పిలుపునిచ్చింది. కర్నూలులోని విద్యుత్ భవన్ ఎదుట పెద్ద ఎత్తున చేపట్టనున్న ధర్నాలో శ్రీమతి విజయమ్మ స్వయంగా పాల్గొంటున్నారు.