షర్మిల యాత్రలో జన సునామీ ఆవిష్కారం

కాకినాడ 14 జూన్ 2013:

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఎగసిపడుతున్న కడలి కెరటాలను చిన్నబుచ్చుతూ ఆ సాగరతీరంలో జనహృదయాల నుంచి అనల్పమైన అనురాగ తరంగాలు ఉప్పొంగాయి. గురువారం కాకినాడ, ఆ నగర పరిసరాలు- దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ కుమార్తె, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల సాగిస్తున్న ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్రతో కిక్కిరిసిపోయాయి. జన సునామీని తలపించాయి. ‘జోహార్ వైయస్ఆర్.. జై జగన్.. జై షర్మిల’ అన్న నినాదాల హోరు ముందు సాగరఘోష- దీపావళి టపాసుల సందడి ముందు చిటికె వేసిన సవ్వడిలా మిగిలింది.

అగాధమైన జలనిధిలో ఆణిముత్యాలు ఉన్నాయో, లేవో గానీ- శ్రీమతి షర్మిలను చూసేందుకు, ఆమె పలుకులు వినేందుకు, ఆమెతో కరచాలనం చేసేందుకు వచ్చిన జనవాహినిలో ప్రతి ఒక్కరి నేత్రాలూ ఆనందంతో మంచి ముత్యాలను మించి మెరిసిపోయాయి. ఆ మెరుపులో మంచిరోజులపై ఆశ కొట్టొచ్చినట్టు కనిపించింది.

కాకినాడ నగరాన్ని జనసునామీ ముంచెత్తింది. ఓవైపు తీరంలో సముద్రపు కెరటాలు ఎగసిపడుతుంటే మరోవైపు నగరంలో జనకెరటాలు ఉప్పొంగాయి. రాజన్నపై గుండెల్లో దా చుకున్న అభిమానాన్ని నగరప్రజలు ఆయన తనయపై చాటారు. శ్రీమతి షర్మిలకు అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. జగనన్నకు అండగా ఉంటామని ఘంటాపథంగా చెప్పారు. శ్రీమతి షర్మిల పాదయాత్ర సాగిన దారులే కాక నగరంలోని అన్ని దారులు జన ప్రవాహాలను తలపించాయి. కాకినాడ నుంచి పిఠాపురం, యానాం, రామచంద్రపురాలకు వెళ్లే రహదారులన్నీ జనమయమయ్యాయి. నగరం సుమారు మూడుగంటల పాటు ట్రాఫిక్ వలయంలో చి క్కుకుపోయింది. శ్రీమతి షర్మిల నగరంలో అడుగుపెట్టింది మొదలు బస ప్రాంతానికి చేరే వరకు పూలవర్షం కురిపిస్తూనే ఉన్నారు. ‘జోహార్ వైయస్ఆర్... జై జగన్.. జై షర్మిల’ నినాదాలతో నగరం హోరెత్తిపోయింది.

కదం తొక్కిన నేతలు, కార్యకర్తలు
కాంగ్రెస్ ప్రజాకంటకపాలన, చంద్రబాబు కుట్రలకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్‌ రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరోప్రజాప్రస్థానం పాదయాత్ర జిల్లాలో పదవ రోజైన గురువారం అనపర్తి, కాకినాడ రూరల్ నియోజకవర్గాల పరిధిలోని గ్రామాల మీదుగా కాకినాడ నగరంలోకి ప్రవేశించింది. ఇంద్రపాలెం వంతెన నుంచి నగరంలోకి అడుగుపెట్టిన శ్రీమతి షర్మిలకు కాకినాడ సిటీ తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, రూరల్ నియోజక వర్గ కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు, కాకినాడ పార్లమెంటు నియోజకవర్గ నాయకులు చలమలశెట్టి సునీల్‌ నాయకత్వంలో అపూర్వస్వాగతం లభించింది. వేలాదిగా నగర ప్రజల, నాయకులు, కార్యకర్తలు కదం తొక్కారు. తీన్‌మార్ నృత్యాలు..డప్పుమేళాలు..గారడీ విన్యాసాలు.. బాణా సంచా కాల్పులతో హోరెత్తించారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొన్నారు. అడుగడుగునా హారతులిచ్చారు. ఇంద్రపాలెం వంతెన నుంచి బహిరంగ సభ ఏర్పాటుచేసిన జగన్నాథపురం భావన్నారాయణ సెంటర్‌కు కేవలం మూడు కిలోమీటర్ల దూరం నడిచేందుకు రెండుగంటలకు పైగా సమయం పట్టిందంటే జనం ఏస్థాయిలో వెల్లువెత్తారో అర్థమవుతుంది. ఇంద్రపాలెం వంతెన వద్ద అంబేద్కర్ విగ్రహానికి శ్రీమతి షర్మిల నివాళులర్పిం చారు.

జనప్రవాహాలే
అంతకు ముందు ఉదయం తొమ్మిదిన్నర గంటలకు అచ్యుతాపురత్రయం శివార్లలో ఏర్పాటు చేసిన బస నుంచి శ్రీమతి షర్మిల జిల్లాలో పదవరోజు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. రామేశ్వరం, రేపూరు సెంటర్, కొవ్వాడ, గంగనాపల్లి సెంటర్, చీడిగ, నేరేళ్లమ్మగుడి సెంటర్‌ల మీదుగా ముసలమ్మ గుడి సెంటర్ వరకు పల్లె దారులన్నీ జనప్రవాహాలుగా మారాయి. మధ్యాహ్నం ముసలమ్మగుడి సెంటర్ నుంచి మొదలైన యాత్ర ఇంద్రపాలెం వంతెన, కాకినాడ అంబేద్కర్ సెంటర్, యూటీఎఫ్ హోం వీధి, పాత బస్టాండ్, కచేరిపేట, గంజాంవారి వీధి, మెయిన్‌రోడ్డు, జగన్నాథపురం, వన్‌టౌన్ పోలీస్ స్టేషన్, సినిమా రోడ్ల మీదుగా సాగి కల్పనాసెంటర్ లోని వెంకటేశ్వర ఫంక్షన్ హాలు వద్ద ఏర్పాటు చేసిన బస ప్రాంతానికి చేరుకుంది.

Back to Top