పవన్ అత్యుత్సాహం

త్వరలో చంద్రబాబు జగన్ తోనూ కలిసే అవకాశం లేకపోలేదంటూ పవన్ కళ్యాణ్ విమర్శలు చేసాడు. ఇది పవన్ కు ఉన్న అవగాహనా రాహిత్యానికి, అత్యుత్సాహానికి నిదర్శనం అనుకోవాలి. అధికారం కోసం, కేసుల నుంచి రక్షణ కోసం, రాజకీయ అవసరాలకోసం చంద్రబాబు ఎంతైనా దిగజారుతాడు అని పవన్ కళ్యాణ్ ఉద్దేశ్యమే కావచ్చు. కానీ ఆ విషయాన్ని నేరుగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. అంతేకానీ ఇలా చౌకబారు విమర్శలు చేయకూడదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంటూ ప్రజల తరఫున అనుక్షణం పోరాడుతోంది. ప్రభుత్వ అక్రమాలను అడుగడుగునా ఎదుర్కుంటోంది. ఆ పార్టీ నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లో తమకంటూ ఓ నమ్మకాన్ని, ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. చంద్రబాబు ప్రతిపక్షంతో చేతులు కలిపాలని ఉవ్విళ్లూరినా అందుకు వైఎస్సార్ పార్టీ సిద్ధంగా లేదు. 
పవన్ వాఖ్యల్లో మరో ఉద్దేశ్యం కూడా తొంగి చూస్తోంది. ఈమధ్యే తన అభిమానులతో సిఎమ్ సిఎమ్ అని పిలిపించుకుని ఆనందించిన పీకె 2019 ఎన్నికల్లో తానే గెలుస్తాననే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎలాగూ సీటుకింత బేరం అనేది సమావేశం పెట్టి మరీ నిర్ణయించి సెట్ చేసేసారు. ఇక ఎన్నికల్లో గెలవడమే మిగిలింది అనుకుంటున్నాడీ పవర్ స్టార్. అయితే సినిమాల్లో చూపే పవర్ వెనుక సాంకేతిక బృందం ఉంటుంది. కానీ రాజకీయాల్లో, ప్రజా సేవలో పవర్ చూపడానికి గుండె ధైర్యం కావాలి. పట్టుమని పాతికడుగులు వేయలేని పవన్ కు, పక్కనుంచున్న వారిని తోసుకుంటూ పోయే పవన్ కు ఆ ధైర్యం ఎప్పుడూ లేదు. ఇక చంద్రబాబు జగన్ తో చేతులు కలుపుతారని పవన్ వాఖ్యానించడం వెనుక రాబోయే ఎన్నికల్లో జనసేనను ఎదుర్కునేందుకు ఈ రెండు పార్టీలు కలిసి పని చేస్తాయని ఆయన చెప్పదలుచుకుంటున్నాడేమో అనిపిస్తోంది. అదే నిజమైతే పవన్ అంత పిచ్చివాడు మరొకడు ఉండడు అనుకోవాలి. మెజారిటీ స్థానాలు గెలిచేసే జనసేనను ఎదుర్కునేందుకు టిడిపి, వైసిపి కలుస్తోందనే ప్రచారం చేయడానికి జనసేన నాయకుడు కూడా వెనుకాడడేమో అనిపిస్తోంది. తనకు లేని గొప్పతనాన్ని ఆపాదించుకుని, ఎదుటి వారిని అవమానించడం చంద్రబాబు లక్షణం. కొన్నాళ్లు ఆ బాబుతో, ఆ పార్టీతో కలిసి తిరిగిన పాపానికి పవన్ కళ్యాణ్ కి కూడా ఆ జబ్బు అంటుకున్నట్టుంది. కనుక పీకే తన అత్యుత్సాహాన్ని కాస్త కట్టిపెట్టి విమర్శలు చేసేముందు కాస్త ఆలోచిస్తే బావుంటుందంటున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. బాబు వచ్చి స్వయంగా జగన్ కాళ్లావేళ్లా పడ్డా పవన్ ఊహించిన  సంఘటన జరగదని చెబుతున్నారు. ఇప్పటికైనా పవన్ తన నోరు అదుపోలో పెట్టుకుని మాట్లాడతాడా??
 
Back to Top