ప్యాకేజీ క‌లేనా?

* ఏపీ సమస్యలపై ఏన్డీఏ ప్రభుత్వం చిన్న చూపు
* చట్టబద్దత నోట్‌ హిందీలో రాలేదని కుంటి సాకులు 
* బాబు అసమర్థతను కప్పి పుచ్చేలా పచ్చ పత్రిక కథనం
* మార్చి 9 బడ్జెట్‌ సమావేశాల్లో ప్రస్తావన అవకాశం శూన్యం

ఆంధ్రప్రదేశ్‌కు ప్యాకేజి కూడా కలగానే మిగిలేలా ఉంది. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా గళం విప్పిన టీడీపీ,  బీజేపీ ద్వయం ఎన్నికలయ్యాక రకరకాల కారణాలు చూపి మొత్తానికే మంగళం పాడేందుకు సిద్దమయ్యాయి. మొన్నటి వరకు ప్రత్యేక హోదా కింద దక్కే అన్ని ప్రయోజనాలను కూడా ప్యాకేజీ ద్వారా కల్పిస్తామని ఊదరగొట్టిన రెండు పార్టీలు ఇప్పుడు అదే ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్దత కల్పించమంటే నీళ్లు నములుతున్నాయి. ఈ రెండు పార్టీల వ్యవహారం చూస్తే మూడేళ్లు ఎలాగోలా బండి లాగించేశాం.. మరో రెండేళ్లు నానబెడితే సరిపోదా అన్నట్టుగా మారింది వ్యవహారం. 

ఆసక్తి చూపని ప్రధాని...!
గతంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రమిచ్చిన ప్యాకేజీకి చట్టబద్ధతపై చర్చించిన మంత్రివర్గ సమావేశం దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే వాయిదా వేసింది. దీంతో మార్చి 9 నుంచి జరిగే మలివిడత బడ్జెట్‌ సమావేశాల్లో ఈ అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశమేలేదు. దీనిపై ఇప్పుడు చర్చించలేమని, తదుపరి సమావేశంలో చూద్దామని ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్‌లో పేర్కొన్నట్లు వార్తలు వెలువడుతున్నాయి. దీన్ని బట్టి చూస్తే ప్యాకేజీకి చట్టబద్ధత అంశాన్ని నాన్చడమే కేంద్ర ప్రభుత్వ విధానంగా వుంది. ప్యాకేజీ చట్ట బద్ధతకు సంబంధించి నోట్‌ తయారవుతోందని, త్వరలో నిర్ణయం తీసుకుంటామని ఇన్నాళ్లు తెగ హడావుడి చేసిన ముఖ్యమంత్రి ఇప్పడు కొత్త నాటకానికి తెరతీశారు. నోట్‌పై కొన్ని మంత్రిత్వ శాఖల పరిశీలన పూర్తి కాకపోవడం వల్లే దీనిని వాయిదా వేశారని కుంటి సాకులతో కాలం వెళ్లదీసే కుట్రకు బాబు అండ్‌ కో.. వ్యూహ రచన చేస్తున్నారు. 

యూపీఏను మించుతున్న ఎన్డీఏ
యూపీఏ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రాన్ని ముక్కలు చేసి ఆంధ్రాకు చేసిన అన్యాయం కంటే ఎన్‌డీఏ సర్కారు చేస్తున్న అన్యాయం ఇంకా ఎక్కువగా ఉంది. రాష్ట్రాన్ని విడదీయడంలో బీజేపీ కీలక పాత్ర పోషించినప్పటికీ విభజన తరువాత ఆంధ్రా విషయంలో కూడా చాలా దారుణంగా వ్యవహరిస్తుంది. ఆంధ్రాకు సంబంధించిన ప్రతి విషయాన్ని విపరీతంగా నానుస్తోంది. సా...గదీస్తోంది. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధత కల్పించే విషయంలో కేంద్రం వైఖరి టీవీ సీరియల్‌ను తలపిస్తోంది. ఐదు నెలలైనా ప్రత్యేక ప్యాకేజీకి ఇప్పటివరకు చట్టబద్ధత ఇవ్వడం సాధ్యం కాలేదు. 

నిజంగా అంత పెద్ద వ్యవహారమా..
ఇదేమీ రోజుల తరబడి చేసే పనికాదు. ఈ చిన్న పనికి ఇప్పటివరకు ముహూర్తం కుదరలేదు. ఫిబ్రవరి 22న జరిగిన కేబినెట్‌ సమావేశంలో ప్యాకేజీకి చట్టబద్ధత కల్పిస్తారని టీడీపీ అనుకూల పత్రిక నమ్మకంగా చెప్పింది. కానీ అది మార్చి ఒకటో తేదీకి వాయిదా పడింది. ఆ రోజు జరిగే కేబినెట్‌ సమావేశంలో ఆమోదముద్ర వేస్తారట...! కేబినెట్‌ అజెండాలోనే ప్యాకేజీకి చట్టబద్ధత అంశం చేర్చలేదంటే కేంద్రానికి ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతోంది. టేబుల్‌ అజెండాగానైనా ప్రవేశపెట్టాలని అరుణ్‌జైట్లీ ప్రయత్నించినా సాధ్యం కాలేదట...! మోదీకి ముఖ్యమైన పని ఉండటంతో వెళ్లిపోయారట...! చట్టబద్ధత అంశం కేబినెట్‌కు ఎందుకు రాలేదో వివరిస్తూ టీడీపీ అనుకూల పత్రిక ఓ కథనం రాసింది. అది చదివితే ఒక అంశం కేబినెట్‌ ఆమోదం పొందడం ఇంత కష్టమా అనేలా జనాన్ని నమ్మించడానికి మంచి స్క్రీన్‌ప్లే సిద్ధం చేసింది. చట్టబద్ధతకు సంబంధించిన నోట్‌లో చివరి నిమిషంలో మార్పులు చేయాల్సిరావడంతో అది కేబినెట్‌ అజెండాలో పెట్టలేదట...! చట్టబద్ధతకు సంబంధించిన నోట్‌ కొన్ని వారాల ముందే తయారైపోయి అన్ని శాఖల ఆమోదం పొందిందని `పచ్చ` పత్రికే రాసింది. మళ్లీ చివరి క్షణంలో మార్పులు చేర్పులేమిటి? అవి ఏమిటో వివరించలేదు. కాని అసలు విషయం ఇది కాదు. సినిమాలో కామెడీ బిట్‌ వంటి ఓ పని కారణంగా చట్టబద్ధత నోట్‌ కేబినెట్‌ ముందుకు రాలేదట. ఏమిటది? చట్టబద్ధతకు సంబంధించిన నోట్‌ అధికారులు ఇంగ్లిషులో మాత్రమే తయారుచేశారు. హిందీ కాపీ చేయలేదు. దీంతో కేబినెట్‌ ముందుకు ఇంగ్లిషు ప్రతి ఒక్కటే వచ్చింది. ఇలా కావడం ఇది రెండోసారి. వచ్చే సమావేశంనాటికి హిందీ ప్రతి కూడా తయారుచేసి ఇస్తారట...! చట్టబద్ధతకు ఆమోద ముద్ర వేయకపోవడానికి ఇదే కారణమని చెప్పడం చూస్తుంటే ఏపీ ప్రజలను బీజేపీ ఏమనుకుంటుందో చెప్పాల్సిన పనిలేదు. 
Back to Top