పార్టీ శ్రేణులు - ఉత్సాహంతో ఉరకలు

జనసామాన్యానికి భరోసా ఇచ్చే యాత్ర

ప్రపంచ చరిత్రలోనే ఓ మహోత్కృష్ట ఘట్టం గురువారం ఆవిష్కృతం కానుంది.  వర్తమాన రాజకీయాలలో తమ ప్రత్యర్థిని అణగదొక్కడానికి కుయుక్తులు పన్నుతున్న దుష్ట శక్తులపై  ఓ శక్తిస్వరూపిణి కదనభేరి మోగించనుంది. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల చేపట్టనున్న మరో ప్రజాప్రస్థానం పార్టీ శ్రేణుల్ని ఉత్సాహంతో ఉరకలు వేయిస్తోంది.
మహానేత తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్థులపై ఎమ్మెల్యే డాక్టర్ డి. శంకరరావు రాసిన లేఖతో ప్రారంభమైన కాంగ్రెస్  పార్టీ కుట్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. మధ్యలో తోడైన తెలుగుదేశం పార్టీతో జగన్‌కు వ్యతిరేకంగా చర్యలు చేపడుతూనే ఉంది. కోర్టుకు హాజరు కావాల్సిన ముందు రోజు ఆయను వ్యూహాత్మకంగా సీబీఐతో అరెస్టు చేయించి మరింతగా పట్టు బిగించింది. జనామోదం.. అభిమానం.. కలగలిసిన ఆయుధాన్ని చేబూనిన జగన్మోహన్ రెడ్డి తన పోరాటాన్ని కొనసాగించారు. ఉప ఎన్నికలలో తన పరోక్షంలో తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలలను రంగంలోకి దింపి పాలకవిపక్షాల వ్యూహాలను తుత్తునియలు చేశారు. 
వైయస్ జగన్‌కు బెయిలు లభిస్తుందనుకుంటున్న తరుణంలో తెలుగుదేశం నేతలు కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరాన్ని కలసి వినతిపత్రం సమర్పించడం.. అనంతరం కొద్ది గంటలలోనే జగన్ ఆస్థులను అటాచ్ చేస్తూ ఈడీ ఆదేశించడం చకచకా సంభవించాయి. విచారణకు మరింత గడువు కావాలని సీబీఐ మరుసటి రోజు కోర్టులో విన్నవించుకుంది. బెయిలుకు కోర్టు తిరస్కరించింది. ఈ పరిస్థితుల్లో  ప్రజలతో మమేకం కావడానికీ, వారికి మేమున్నామన్న భరోసా కల్పించడానికీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహానేత తనయ షర్మిలతో పాదయాత్ర చేయించాలని నిర్ణయించింది. దానికి పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆమోద ముద్ర వేశారు. తన మాటగా వారికి భరోసానిమ్మని కోరారు. ఈ నెల 18 అంటే గురువారం నుంచి ఈ యాత్ర ప్రారంభం కానుంది. 
పాలక, విపక్షాల ఎత్తులను చిత్తు చేసే దిశగా సాగనుంది. ఇడుపులపాయలోని వైయస్ ఘాట్‌లో ప్రార్థనల అనంతరం షర్మిల పాదయాత్రను  ఆరంభిస్తారు. మహానేత రాజశేఖర రెడ్డి 2003లో రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకూ సాగించిన ప్రజాప్రస్థానం కార్యక్రమాన్ని ఈ సందర్భంగా స్మరించుకోవడం ఎంతైనా అవసరం.

పల్లె కన్నీటిని తుడిచిన వైయస్ఆర్

64 రోజుల పాటు 1475 కిలోమీటర్ల దూరం మండుటెండల్లో సాగిన యాత్ర అది. పంచెకట్టులో తెలుగుదనం ఉట్టిపడే వేషధారణతో, ఆత్మీయ దరహాసంతో ఆయన ప్రజల మనసు కొల్లగొట్టారు. అందరినీ పలకరిస్తూ జనసామాన్యం   కష్టనిష్ఠూరాలను స్వయంగా తెలుసుకున్నారు. ప్రజలు ఇచ్చిన వేనవేల వినతి పత్రాలను అందుకున్నారు. వాటిని అవగతం చేసుకున్నారు. ప్రజలు కోరుకుంటున్నదేమిటో తెలుసుకోవడానికి ఇది ఆయనకు తోడ్పడింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైటెక్‌ పాలన వల్ల, వ్యవసాయం దండగమారిదన్న పెడధోరణి వల్ల ప్రజలు విసిగి వేసారిన వైనాన్ని వైయస్‌ గమనించారు. పల్లె కన్నీరు పెడుతున్న విషాదాన్ని ఆయన ప్రత్యక్షంగా చూశారు. ప్రజలతో మమైకమయ్యారు.
వృత్తులు నాశనమై, పల్లె సీమలు తమ ప్రాభవాన్నీ, ప్రశాంత, స్వతంత్ర జీవనాన్నీ కోల్పోయిన తీరును వైయస్‌ గుర్తించారు. స్థానిక సమస్యలు తెలుసుకోవడంతో పాటు, ప్రజల జీవికకు, ఉపాధి కల్పనకు ఏమేం చేయాలో ఆయనకు ఈ పాదయాత్రే నేర్పింది.

జలయజ్ఙానికి పునాది

ప్రజల జీవనం అస్తవ్యస్థం కావడానికి ముఖ్యకారణం నీటిలభ్యత లేకపోవడమేననీ, ప్రాజెక్టుల నిర్మాణం పట్ల నాటి ప్రభుత్వ వైముఖ్యమే ఈ దురవస్థకు మూలమనీ వైయస్ఆర్ అర్థం చేసుకున్నారు. అందుకే జలయజ్ఞం వంటి బృహత్‌ పథకానికి ముఖ్యమంత్రి అయిన ఆ తర్వాత శ్రీకారం చుట్టారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అందించాలన్న ఆలోచన సాకారం కావడానికి కారణం ఆయన సంకల్పబలం.


విశ్వసనీయత పరమార్థాన్ని గుర్తించిన రాజన్న

ఎన్టీఆర్‌ పట్ల ప్రజలలో అభిమానం చెక్కుచెదరకపోవడానికి కారణం ఆయన విశ్వసనీయతేనని ప్రజాప్రస్థానంలో వైయస్‌ గుర్తించారు. రెండు రూపాయల కిలో బియ్యం పథకం సామాన్యుడికి మేలు చేకూరుస్తుందని భావించారు. దానిని పునరుద్ధరిస్తానని  వాగ్దానం చేశారు. బియ్యం పథకం తక్షణ ఉపశమనమైతే, ఉచిత విద్యుత్తు, జలయజ్ఞం దీర్ఘకాలిక ప్రయోజనం కలిగినవని భావించారు. వ్యవసాయానికి ఏడుగంటల కరెంటు ఇస్తామని చెప్పి మాట నిలుపుకున్నారు. ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా చేసిన వాగ్దానం నిలుపుకున్నందునే వైయస్‌కు విశ్వసనీయత వచ్చింది. వెండితెర హీరోలకున్న ఆకర్షణను కూడా అతిగమించిన కరిష్మా తెచ్చిపెట్టింది.

తాజా వీడియోలు

Back to Top