నాకు తెలిసిన కిరణ్... గురవారెడ్డి

మం

చితనం, మానవత్వం మూర్తీభవించిన పి.ఆర్.కిరణ్ కుమార్ రెడ్డి మరణం సమాజానికి తీరని లోటు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంకిత భావంతో పని చేసిన కిరణ్ అందరితోనూ సోదరభావంతో మసలేవారు. ఆయన ఎంతో గౌరవనీయులు, సహృదయులు. పి.ఆర్.కిరణ్‌తో నాకు విడదీయలేని అనుబంధం ఉంది. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి వ్యక్తిగత మాజీ కార్యదర్శిగాను, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగాను పని చేసిన పి.ఆర్. కిరణ్ మృతిని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఆయన మృతికి సంతాపంగా, బాధాతప్త హృదయంతో నివాళిగా ఈ నాలుగు మాటలూ వ్రాస్తున్నాను.

     మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి రూపకల్పన చేసి ఎంతో మంది నిరుపేదలను నిస్సహాయులను ఒక తండ్రిగా, అన్నగా, స్నేహితుడిగా కిరణ్ ఆదుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతూ ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూసిన ఎందరికో కిరణ్ అండగా నిలిచారు.

     నెల్లూరు జిల్లా దామరమడుగులో ఒక చిన్న వ్యవసాయ కుటుంబంలో పి.ఆర్.కిరణ్ కుమార్ రెడ్డి జన్మించారు. వృత్తిపరంగా ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్. వైయస్ రాజశేఖరరెడ్డిగారి ప్రోద్బలంతో బలపనూర్ గ్రామానికి చెందిన ఒక యువతిని ఆయన వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి వైయస్ రాజశేఖరరెడ్డిగారితో కిరణ్ కుమార్ రెడ్డికి సాన్నిహిత్యం ఏర్పడింది. మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి మరణం వరకు ఆ అనుబంధం అవిచ్ఛిన్నంగా కొనసాగింది. పి.ఆర్. కిరణ్ క్యాన్సర్‌తో బాధపడుతూ హ్యూస్టన్- టెక్సాస్‌లోని ఎండీ అండర్సన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో నేను ఆయనను కలిశాను. చాలా సమయం ఆయనతో గడిపాను.

     పేద ప్రజలకు తన సేవలను కొనసాగిస్తాననే నమ్మకంతో కిరణ్ ఉండేవారు. దేవుడు ఇచ్చిన మనోధైర్యం, సంకల్పంతో ఇప్పటి వరకు చేయగలిగిన సాయం చేశానని ఆయన చెప్పారు. వైయస్ రాజశేఖరరెడ్డిగారితో పంచుకున్నఅనుభవాలను వ్యక్తం చేస్తూ సగర్వంగా ఫీలయ్యారు. మరో ప్రపంచంలోకి వెళ్లేందుకు వైయస్ఆర్‌తో తనకున్న 25 ఏళ్ల అనుబంధం చాలన్నారు.

     ఆయనను నేను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మొదటిసారి కలిశాను. హ్యూస్టన్- టెక్సాస్, హైదరాబాద్‌లలో అతనితో గడిపిన క్షణాలు చిరస్మరణీయంగా ఉండిపోతాయి. అనారోగ్యం నుంచి ఆయన తప్పక కోలుకుంటారని ఎంతో నమ్మకంతో ఉంటూ వచ్చాను. కానీ, తన స్నేహితులకు, వైయస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులకు విషాదాన్ని మిగిల్చి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు.

     కిరణ్ ఆరోగ్యంపై నిత్యం ఆరాతీసే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డితోపాటు వేలాది మంది స్నేహితులకు ఆయన భౌతికంగా దూరమయ్యారు. కానీ కిరణ్ స్మృతులు మాసిపోవు. అవి కలకాలం గుర్తుండిపోతాయి. హ్యూస్టన్‌ - టెక్సాస్‌లో, హైదరాబాద్‌లోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నేను గంటల కొద్ది సమయం ఆయనతో గడిపాను. పి.ఆర్.కిరణ్ చివరిసారిగా హ్యూస్టన్ వచ్చినపుడు స్వాగతం పలకడమే కాకుండా హైదరాబాద్‌కు తిరిగి వెళ్లేటప్పుడు వీడ్కోలు కూడా పలికాను.

     వైయస్ రాజశేఖరరెడ్డిగారితో పాటు ఆయన తనయుడు శ్రీ వైయస్ జగన్మోహనరెడ్డిపై ఆయనకున్న విశ్వాసం అచంచలమైనది. పేదలను ఆదుకోవాలనే ఆయన దృఢసంకల్పం మొక్కవోనిది. అలాంటి స్నేహస్వభావిని కోల్పోవడం తీర్చలేని లోటు.

పి.ఆర్.కిరణ్ ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని కోరుకుంటూ...
గురువారెడ్డి, అట్లాంటా.

Back to Top