మాంద్యం సంక్షోభంగా మారనున్నదా?

మరో అయిదు మాసాల తర్వాత కేలండర్‌లోకి రానున్న కొత్త చుట్టం -2013- ప్రపంచ ప్రజానీకానికి మరపురాని పీడకలగా మారనున్నదా? అవుననే అంటున్నారు విశ్వవిఖ్యాత అర్థశాస్త్రవేత్త నోరియల్ రూబిని. ‘డాక్టర్ డూమ్’గా ప్రసిద్ధుడయిన రూబిని మాటలను అంత తేలిగ్గా కొట్టిపారేయడానికి వీల్లేదు. 2008లో పాశ్చాత్య ప్రపంచాన్ని ఓ ఊపు ఊపిన ఆర్థిక మహామాంద్యం గురించి ముందే ఊహించి హెచ్చరించిన చరిత్ర రూబినిది. మహామాంద్యం విషయంలో ఆయనతో ఎందరో ప్రముఖులు విభేదించినా, చివరికి రౌదినీ చెప్పినట్లే జరిగిందని అంగీకరించక తప్పలేదు. పైగా, ఇప్పుడు పాల్ క్రుగ్మన్, నయాల్ ఫెర్గూసన్ తదితర అంతర్జాతీయ అర్థశాస్త్ర నిపుణులు రూబినితో ఏకీభవిస్తూండడం గమనార్హం.
రౌదినీయాదులు ఏమంటున్నారు?
2013లో, అంటే మరో అయిదు నెలల తర్వాత, గొప్ప ఆర్థిక సంక్షోభం ప్రపంచాన్ని కుదిపేస్తుందని రూబిని, క్రుగ్మన్, నయాల్ ఊహిస్తున్నారు. 1931 నాటి పరిస్థితులు పునరావృత్తం అవుతాయనికూడా వాళ్ల అంచనా. ధునిక ప్రపంచ చరిత్రలో ‘ఆకలి దశాబ్దం’గా నమోదయిన మహాసంక్షోభం 1931లోనే మొదలయింది. పాశ్చాత్య దేశాల్లో, ముఖ్యంగా యూరప్ ఖండంలో -కొద్దిపాటి మినహాయింపులను పక్కనపెట్టి చూస్తే- నిరుద్యోగం తారస్థాయికి చేరుకుంది. ప్రధానంగా యువకుల్లో నిరుద్యోగం ప్రమాద సూచికలను ఏనాడో మించిపోయింది. ఆర్థిక అవ్యవస్థ, దాని పర్యవసానంగా ప్రజల్లో పెచ్చుమీరే నిరాశా నిస్పృహలూ విస్తృతమయ్యాయి. అతివాదుల్లోనూ, మితవాదుల్లోనూ కూడా తీవ్రవాదులకు రాజకీయవాదులనుంచి మద్దతు పెరుగుతూ పోతోంది. ఇవన్నీ అపశకునాలే అంటున్నారు పాశ్చాత్య ఆర్థికవేత్తలు.
అసలు, ’31లో ఏం జరిగింది?
1931 మే నెలలో ఆస్ట్రియన్ బ్యాంక్ క్రెడిటన్‌స్టాల్ట్ దివాలా తీసింది. అది వరస బ్యాంకు దివాలాలకు తెరతీసింది. యూరప్‌లోనూ దక్షిణ అమెరికాలోనూ ఒకదానితర్వాత మరొకటిగా బ్యాంకులు దివాలా తీస్తూ పోయాయి. పౌండ్ విలువ పతనమయింది. అక్టోబర్ నాటికి న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ రెండు డిస్కౌంట్ పాయింట్లు దిగిరాకతప్పలేదు. నిజానికి ఆస్ట్రియన్ బ్యాంక్ క్రెడిటన్‌స్టాల్ట్ దివాలామేనేజ్ చెయ్యలేనంత పెద్ద వైఫల్యం కాకూడదంటాడు పాల్ క్రుగ్మన్. కానీ, ఈ పరిణామం గందరగోళాన్ని సృష్టించి వరసగా పశ్చిమ దేశాల్లోని బ్యాంకుల పతనానికి దారితీసిన మాట వాస్తవమంటాడాయన.
1930 దశకం నాటి ఈ అనుభవం నుంచి గుణపాఠం నేర్చుకోవడంలో జెర్మనీ విఫలమవుతోందంటారు రూబిని, నయాల్. కిందటి నెల్లోనే గ్రీస్ డిపాజిటర్లు 70 కోట్ల యూరోల మేరకు డిపాజిట్లు ఉపసంహరించుకున్న వాస్తవాన్ని ఈ ఆర్థికవేత్తలు ఎత్తిచూపిస్తున్నారు. ఇది ఒక మానసిక స్థితికి నిదర్శనమని వారి వాదన. ఈ క్రమం ఇలాగే కొనసాగితే, ఎనభయ్యేళ్ల కిందటి పరిస్థితి పునరావృతం కాకతప్పదని వారి హెచ్చరిక.
అయ్యా ఆర్థిక విధాన నిర్ణేతలూ! నిపుణుల మాట చెవికెక్కించుకుంటున్నారా?

Back to Top