మచిలీపట్నాన్ని ముంచెత్తిన జనసునామీ!

బందరును జన సునామీ ముంచెత్తింది.. మచిలీపట్నం వీధులన్నీ జగన్నినాదాలతో మార్మోగాయి.. రాజన్న తనయను చూసి తమ ఆడపడుచు తరలి వచ్చిందన్న ఆనందంతో సాగర తీర పట్టణం ఉప్పొంగిపోయింది.. శ్రీమతి షర్మిల పాదయాత్ర పొడవునా హారతులు పట్టి, పసుపు, కుంకుమలు ఇచ్చి సౌహార్ద్ర స్వాగతం పలికారు. హలధారిగా వస్తున్న శ్రీమతి షర్మిలను చూసి రైతు జనబాంధవుడు వైయస్ కళ్ల ముందు కదలా‌డుతున్న అనుభూతికి గురయ్యారు. రాజన్న రాజ్యం రావడం తథ్యం, తమ కష్టాలు తీరడం ఖాయమన్న ధైర్యం అందరి కళ్లలో తొణికిసలాడింది. అడుగడుగునా అభిమానులు నీరా‘జనం’ పలుకుతుండగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు శ్రీమతి షర్మిల. వృద్ధులకు భరోసానిస్తూ.. పేదలను ఆప్యాయంగా పలుకరిస్తూ... విద్యార్థులకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ.. చిన్నారులను ముద్దాడుతూ పాదయాత్ర సాగించారు.

మచిలీపట్నం (కృష్ణా జిల్లా) : బందరు జనసునామీని తలపించింది. వైయస్ తనయ, జగనన్న సంధించిన బాణం శ్రీమతి షర్మిల రాకతో అభిమానులు, వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజల్లో ఉత్సాహం ఉప్పొంగింది.‌ కృష్ణా జిల్లాలో మంగళవారం శ్రీమతి షర్మిల పాదయాత్ర పెడన నియోజకవర్గం గూడూరు మండలంలోని పర్ణశాల నుంచి మొదలైంది. యాత్ర దారిపొడవునా ఆమెకు పూలతో ప్రజలు స్వాగతం పలికారు. శ్రీమతి షర్మిల కూడా ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ.. కరచాలనం చేస్తూ వడివడిగా అడుగులు వేశారు. గూడూరులో గడ్డం రామారావు అనే రైతు బహూకరించిన నాగలిని భుజాన వేసుకుని శ్రీమతి షర్మిల కొద్ది దూరం నడిచారు. గూడూరులో ఆమెకు అభిమానులు పూలబాట వేశారు.

రామరాజుపాలెం కాలువ వంతెనపై అభిమానులు విశేష సంఖ్యలో హాజరై శ్రీమతి షర్మిలకు ఘనస్వాగతం పలికారు. ఆమె వెంట కదిలివచ్చిన జనతరంగంతో రోడ్డు కిటకిటలాడిపోయింది. పొలాల్లోని కూలీలు శ్రీమతి షర్మిలను చూసేందుకు పరుగుతో రోడ్డుపైకి వచ్చారు. చల్లరస్తా సెంటర్‌లో ఓ గృహిణి.. శ్రీమతి షర్మిలకు హారతి ఇచ్చి, చీర, పసుపు, కుంకుమ, గాజులు అందించి తన అభిమానం చాటుకున్నారు. కోనేరు సెంటర్‌లో పెద్ద ఎత్తున వచ్చిన జనానికి మీ అభిమానం మరువలేనంటూ శ్రీమతి షర్మిల అభివాదం చేసి కృతజ్ఞతలు తెలిపారు. దారి పొడవునా మహిళలు, వృద్ధులు, పిల్లలు సైతం శ్రీమతి షర్మిలను చూసేందుకు, కరచాలనం చేసేందుకు, పలకరించేందుకు పోటీపడ్డారు.

జాతరలా సాగిన పాదయాత్ర :
పెడన నియోజకవర్గంలో ఉప్పాల రాంప్రసాద్,‌ డాక్టర్ వాకా వాసుదేవరావు, బందరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య‌ (నాని) ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన కర్రసాము, కోలాటం, తీన్‌మార్, విచిత్ర వేషధారణలు, డప్పుల వాయిద్యం, కోయ నృత్యాలతో‌ శ్రీమతి షర్మిల పాదయాత్ర జన జాతరలా సాగింది. బందరు లక్ష్మీ టాకీస్ సెంట‌ర్‌లో జరిగిన బహిరంగ సభ జన సునామీని తలపించింది. సభ అనంతరం ఆమె తెలుగు చర్చి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బసకు చేరుకున్నారు.

పేర్ని నానికి శ్రీమతి షర్మిల అభినందన :
వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి.. ప్రజల కోసం పదవీ త్యాగానికి సిద్ధపడిన బందరు ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య (నాని) అభినందనీయుడని శ్రీమతి షర్మిల అన్నారు. బందరు సభలో ఆమె మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాటంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌కు బాసటగా నిలిచిన నానితో పాటు మరో 14 మంది టిడిపి, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల త్యాగాలు మరువలేనివని పేర్కొన్నారు. మచిలీపట్నం వాసుల చిరకాల కోరిక బందరు పోర్టును నిర్మిస్తామని, పులిచింతల, పోలవరం నిర్మాణం పూర్తి చేస్తామని ఆమె హామీ ఇవ్వడంతో సభలో ప్రజల హర్షధ్వానాలు మిన్నంటాయి.
Back to Top