- ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి జగన్ ఆస్తుల అటాచ్‌మెంట్ వరకు అంతా ఫిక్సింగే
- పిఆర్‌పి విలీనమయ్యే దాకా అవిశ్వాసం జోలికి పోని బాబు
- మాటిమాటికీ ఢిల్లీ వెళ్లి చీకట్లో చిదంబరంతో భేటీలు
కాంగ్రెస్- తెలుగుదేశం పార్టీల కుమ్మక్కు రాజకీయాలు రోజురోజుకూ బలపడుతూ వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో మొదలైన ఈ వ్యవహారం ఇటీవల ఢిల్లీలో టీడీపీ ఎంపీలు ఆర్థిక మంత్రి చిదంబరంను కలిసి జగన్మోహన్‌రెడ్డి ఆస్తులను అటాచ్ చేయించే వరకూ అంతకంతకూ మరింతగా గట్టిపడుతూ సాగుతూనే ఉంది. అపవిత్రంగా కొనసాగుతున్న కాంగ్రెస్ -తెలుగుదేశం పార్టీల కుమ్మక్కు రాజకీయాల కుట్రలను ప్రజలకు వివరించేందుకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తమైంది. షర్మిల పాదయాత్రలో ఈ వైనాన్ని ప్రజలకు సవివరంగా వివరించబోతున్నట్లు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
కాంగ్రెస్, టిడిపిల కుమ్మక్కు కుట్ర రోజురోజుకూ బలపడిందిలా..
ఎమ్మెల్సీ ఎన్నికలతో మొదలైన బరితెగింపు:
శాసనమండలి ఎన్నికల సందర్భంగా వైయస్‌ఆర్ జిల్లాలో జగన్మోహన్‌రెడ్డి మద్దతుతో బరిలో నిలిచిన అభ్యర్థిని దెబ్బతీసేందుకు చంద్రబాబునాయుడు బహిరంగంగానే బరితెగించారు. తెలుగుదేశం పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెట్టకుండా కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ ప్రభంజనంతో కాంగ్రెస్-టీడీపీలకు దిమ్మతిరిగిపోయింది. జగన్మోహన్‌రెడ్డిని ఎలాగైనా దెబ్బకొట్టాలనే ఆలోచనతో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డిపై బురద చల్లేందుకు రెండు పార్టీలు కొత్త కుట్రకు తెరతీశాయి. ప్రత్యేక ఆర్థిక మండళ్ల(సెజ్)కు భూకేటాయింపు విషయంలో వైయస్ ప్రభుత్వం చేసిన కేటాయింపులపైనే ఉమ్మడి సభాసంఘం (జేఎల్‌సీ) వేయాలని చంద్రబాబు అసెంబ్లీలో డిమాండ్ చేయడం, వాటికి ప్రభుత్వం తలూపి తందాన అనడం చకచకా జరిగిపోయాయి.
టిడిపి ఉత్తుత్తి అవిశ్వాస తీర్మానం:
మహానేత వైయస్ మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పూ ఎదురుకాకుండా చంద్రబాబు శతవిధాలుగా ప్రయత్నిస్తూనే వస్తున్నారు. ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని ఎన్ని రకాలుగా డిమాండ్లు వచ్చినా ఆయన ఉలుకూపలుకూ లేకుండా మిన్నకున్నారు. ప్రజారాజ్యం పార్టీ విలీనమయ్యే వరకూ వేచి చూసి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ఆయన ప్రతిపాదించారు. ఓటింగ్ సందర్భంగా మూజువాణి ఓటింగ్ విధానాన్ని కాదని కాంగ్రెస్- టీడీపీ కుమ్మక్కై చేతులెత్తే పద్ధతిని సూచించాయి. వైయస్‌ఆర్ అభిమాన ఎమ్మెల్యేలను ఇరుకున పెట్టేందుకు ఆ రెండు పార్టీలు ఈ కుయుక్తి చేశాయి.
ఉప ఎన్నికల్లో చేయిచేయి కలిపి:
రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన పలు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీలు రెండూ వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలువరించేందుకు శతవిధాలుగా ప్రయత్నించాయి. కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఆ పార్టీలు రెండూ మమేకమై పనిచేశాయి. ఆ తరువాత 18 అసెంబ్లీ, 1 లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ, కాంగ్రెస్ వేర్వేరుగా పోటీచేసినట్లు కనిపించినా తెరవెనుక మతలబులు ఎన్నో సాగాయి. కాంగ్రెస్‌కు బలం ఉన్న చోట్ల డమ్మీ అభ్యర్థులను నిలబెట్టేలా టీడీపీ, టీడీపీకి పట్టున్నచోట్ల బలహీనుల్ని నిలబెట్టేలా కాంగ్రెస్ సీట్లు ఇచ్చిపుచ్చుకున్నాయి. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరకు విజయం వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీనే వరించింది. రామచంద్రపురం, నర్సాపురంలలో టీడీపీ ఓటుబ్యాంకు మొత్తం కాంగ్రెస్‌కు బదలాయించారు. ఇక తెలంగాణలో జరిగిన ఎన్నికల్లోనూ రెండు పార్టీలు చేతులు కలిపి నడిచాయి. బాన్సువాడ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని నిలబెట్టకుండా ఆ ఓట్లను కాంగ్రెస్‌కు మళ్లించింది.
బాబు రహస్య భేటీల వెనుక కథేమిటి?:
జగన్మోహన్‌రెడ్డిని దెబ్బతీసేందుకు అక్రమ కేసులు వేయించిన చంద్రబాబు వాటిని మరింత రక్తి కట్టించడానికి తరచూ ఢిల్లీకి చీకటి యాత్రలు చేశారు. జగన్ కేసు కోర్టులో విచారణకు వచ్చిన ప్రతీసారి పెద్దలను ఏదో ఒక విధంగా ప్రసన్నం చేసుకోవడం రివాజుగా మారింది. రైతు సమస్యల పేరు చెప్పి చీకట్లో చిదంబరంను కలిశారు. బీసీ సమస్యల పేరు చెప్పుకొని ప్రధానితో రహస్యంగా భేటీ అయ్యారు. ఈడీ నోటీసులను స్వయంగా టీడీపీ ఎంపీలు తమ అనుకూల మీడియాకు అందజేయడం ‘కుమ్మక్కు’కు పరాకాష్టగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.