గురి తప్పిన బాణం వెనుక..!

జనతంత్రం

గురి తప్పిన బాణాల గురించి కాదు, గురి పెడుతున్న వేటగాడి గురించి మాట్లాడుకోవాలి. ఆ వేటగాడు అల్లుతున్న ఉచ్చుల గురించి ఆలోచించాలి. ఓట్ల కోసం నూకలు చల్లి ఆపై వల వేసి బంధించే అతడి మాయోపాయాలపై మేధోమథనం జరగాలి. హిరణ్యాక్షుడు పొందిన వరాల చందంగా వార్తా ప్రసార మాధ్యమాస్త్రాలను తన అమ్ములపొదిలో దాచిపెట్టుకున్న అతని వ్యూహ రహస్యాల గురించి మాట్లాడుకోవాలి. ఒక్కో బాణాన్ని మంత్రించి వదిలి పాఠకుల మస్తిష్కాలను స్వాధీనపరచుకోవా లని చూసే అతని తంత్రాంగం గురించి జనాన్ని అప్రమత్తం చేయాలి.

రామాయణంలో కనిపించే కిష్కింధ రాజైన వాలికి  ఒక విచిత్ర లక్షణం ఉన్నది. తన ఎదుటికి ఎంతటి బలవంతుడు వచ్చినా, అతని బలాన్ని తనలోకి లాగేసుకొనే శక్తి అతని సొంతం. వాలి మాదిరి బలశాలి కాదు మన అనుభవశాలి. కానీ అటువంటి లక్షణం ఒకటి ఈయనకూ ఉన్నది. తన రాజకీయ ప్రత్యర్థి ఏ విషయాల్లో బలవంతుడో గ్రహించి ఆ విషయాల్లోనే అతడు బలహీనుడని గోబెల్స్‌ ప్రచారం నిర్వహించడంలో మన కురువృద్ధుడు నిష్ణాతుడు. సత్య వాక్పాలన రాముడి బలం అను కుంటే, ఆ రాముడు అబద్ధాలాడతాడని ప్రచారం చేయడం, జనాన్ని నమ్మించడమే ఈయనకున్న నైపుణ్యం.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్‌ మోహన్‌రెడ్డి బలం ఆయన వ్యక్తిత్వం. మాట తప్పకపోవడం, మడమ తిప్పక పోవడం ఆ వ్యక్తిత్వ లక్షణాలు. రాజకీయ అడుగులు వేయడం మొదలు పెట్టిన తొలి రోజుల్లోనే ఇది నిరూపితమైంది. పది హేనేళ్ల కింద ఆయన తండ్రి∙చనిపోయినప్పుడు ఆ షాక్‌ తట్టుకోలేక గుండె పగిలి చనిపోయినవారూ, ఆత్మహత్యలు చేసుకున్నవారూ వందల సంఖ్యలో ఉన్నారు. ఈ పరిణామం వల్ల ఉద్వేగానికి గురైన జగన్‌ ఆ అమరులందరినీ తన ఆత్మబంధువులుగా ప్రకటించారు. వారందరి ఇళ్లకు వెళ్లి దుఃఖంలో ఉన్న వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తానన్న సంకల్పాన్ని ప్రకటించారు.

ఈ సంకల్పానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం అడ్డుతగిలిన సంగతి తెలుగు పాఠకులకు తెలిసిన విషయమే. తమ మాట వింటే భవిష్యత్తులో ముఖ్యమంత్రిని చేస్తామని, వినకపోతే కేసులు పెట్టి జైల్లో వేస్తామని రాయబారాలు నడిపినట్టు అనంతర కాలంలో కాంగ్రెస్‌ నేతలే బహిరంగంగా వెల్లడించారు. ఆ రోజుల్లో కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వంలో సోనియా గాంధీ మకుటం లేని మహారాణి. 

‘ఫోర్బ్స్‌’ మేగజైన్‌ 2010లో ప్రకటించిన ప్రపంచంలోని శక్తిమంతుల జాబితా టాప్‌ టెన్‌లో ఆమె పేరు ఉన్నది. 2008లో ‘టైమ్‌’ మేగజైన్‌ ప్రకటించిన ప్రపంచంలోని అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో కూడా ఆమె పేరున్నది. అటువంటి రోజుల్లో ఆమె మాటను ధిక్కరించే సాహసం ఎవరు చేస్తారు? కానీ జగన్‌ చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం!

ఈ బలమైన వ్యక్తిత్వాన్ని ఉమ్మడి రాష్ట్ర ప్రజలతో పాటు చంద్రబాబు, ఆయన పార్టీ, యెల్లో మీడియా యజమానులు కూడా గుర్తించారు. అందువల్లనే ఆయన వ్యక్తిత్వం మీద దాడిని కేంద్రీకరించారు. యెల్లో సిండికేట్‌కు కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన శత్రువు. జగన్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి బయటకు వచ్చి సొంత పార్టీని పెట్టుకున్నారు. 

అప్పుడు తన ఆగర్భశత్రువైన కాంగ్రెస్‌తో జతకట్టి జగన్‌ వ్యక్తిత్వ హననంలో, జైలు పాలు చేయడంలో బాబు కూటమి ప్రధాన బాధ్యత తీసుకున్నది. ఎందువలన? జగన్‌ బలమైన వ్యక్తిత్వమే భవిష్యత్తులో తమకు ప్రత్యర్థి కాగల దన్న అంచనాతోనే!

ఆ వ్యక్తిత్వం పలుమార్లు నిరూపణైంది. 2014 ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో చేరిన చంద్రబాబు అసాధ్యమైన హామీలను ఇచ్చారు. అప్పుడు రైతులకు రుణమాఫీ ఒక్కటి ప్రకటించాలని శ్రేయోభిలాషులు జగన్‌కు సలహా ఇచ్చారు. అమలు చేయలేని హామీని ఇవ్వడం కన్నా ప్రతిపక్షంలో కూర్చోవడానికే జగన్‌ సిద్ధ పడ్డారు. అధికారంలోకి రాగానే ఎన్నికల మేనిఫెస్టోని మడత పెట్టేయడం ఈ రోజుల్లో రివాజుగా మారింది. 

ఇటువంటి వాతా వరణంలో అధికారంలోకి వచ్చిన జగన్‌ ఈ ఆనవాయితీని మార్చారు. ఎన్నికల మేనిఫెస్టోకు పటం కట్టి ప్రభుత్వ కార్యాల యాల్లో పెట్టించారు. ఆ మేనిఫెస్టో అమలుపై ఎప్పటికప్పుడు ప్రజలకు ప్రోగ్రెస్‌ రిపోర్టును విడుదల చేస్తూ వచ్చారు.

అమలు చేసిన హామీల గురించి చెప్పడం కాదు, మళ్లీ గెలిస్తే అరచేతిలో వైకుంఠం పెడతాననే హామీలే ముఖ్యమని మళ్లీ సలహాలొచ్చాయి. జగన్‌ వాటికి చెవి ఒగ్గలేదు. కానీ చంద్రబాబు అటే మొగ్గారు. జనం ముందు బయోస్కోప్‌ పెట్టెను తెరిచి ‘కాశీ పట్నం చూడరబాబు చూడరబాబు’ అంటూ బొందితో కైలా సాన్ని హామీ ఇచ్చారు. దాంతోపాటు కూటమి సమీకృత కార ణాలు, ‘సాంకేతిక’ కారణాలు అనేకం పనిచేసి బాబు అధికారంలోకి వచ్చారు. 

ఇప్పుడు హామీలు అమలుచేయాలి. అది సాధ్య మయ్యే పని కాదు. ఒక పక్క జగన్‌ ప్రభుత్వం హామీలను అమలు చేసిన తీరు జనం మదిలో తాజా జ్ఞాపకంగానే ఉన్నది. ఈ జ్ఞాపకాన్ని మరిపించడం కూటమి పెద్దల తక్షణ కర్తవ్యం. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వారు నెలకో రకంగా ప్రయోగిస్తున్న డెవర్షన్‌ రాకెట్లు ఈ తక్షణ కర్తవ్యంలో భాగమే!

ఆస్తి కోసం తల్లీ, చెల్లి మీద జగన్‌ కోర్టుకు వెళ్లారనే ప్రచారాన్ని గత రెండు మూడు రోజులుగా బాబు క్యాంప్‌ విస్తృతంగా చేపట్టింది. ఔను ఆయన నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్సీఎల్టీ)కు వెళ్లారు. ఎందుకు వెళ్లారు? ఎవరి కారణంగా అలా వెళ్లక తప్పని అగత్యం ఏర్పడింది? ఈ అంశాల జోలికి మాత్రం యెల్లో మీడియా సహజంగానే వెళ్లదు. జగన్‌ వ్యక్తిత్వ హననం ఒక్కటే దాని ఎజెండా. 

ఆ ఎజెండా పరిమితు లకు లోబడే దాని ప్రాపగాండా కార్యక్రమం ఆధారపడి ఉంటుంది. జగన్, షర్మిలల చిన్నాన్న వైవీ సుబ్బారెడ్డి ఈ వివాదానికి సంబంధించిన అంశాలపై మీడియాతో మాట్లా డారు. ఆగస్ట్, సెప్టెంబర్‌ మాసాల్లో అన్నాచెల్లెళ్ల మధ్యన ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగాయి. జగన్‌ తన సొంత ఆస్తిలోంచి కొంత భాగాన్ని చెల్లెలికి ఇచ్చేలా ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదు ర్చుకున్నారు. ఇవన్నీ బయటకు వచ్చాయి. జగన్‌ ఎన్సీఎల్టీకి వెళ్లిన డాక్యుమెంట్‌ టీడీపీ అధికార ట్విట్టర్‌ హ్యాండిల్‌పై ప్రత్య క్షమైంది. షర్మిల రాసిన బహిరంగ లేఖ విడుదలైంది. ఆమె మీడియాతో కూడా మాట్లాడారు.

ఈ మొత్తం డాక్యుమెంట్లు, లేఖలు మీడియా సమావేశాల్లో లేవనెత్తిన అంశాలు విస్తృతంగా రెండు రాష్ట్రాల్లోనూ జనంలోకి వెళ్లాయి. ఈ అంశాలపై పెద్ద ఎత్తున చర్చోపచర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ పంచాయతీని పబ్లిక్‌లోకి తీసుకొచ్చిన సూత్రధారులు, పాత్రధారుల ఉద్దేశం వేరు. 

జగన్‌ వ్యక్తిగత ప్రతిష్ఠపై బురద జల్లడం, ఆయన న్యాయ పోరాటాన్ని బలహీన పరచడం, వీలైతే ఆయన బెయిల్‌ను రద్దు చేయించి మళ్లీ జైలుకు పంపించడం! ఈ పరిణామాన్ని నిశితంగా గమనించిన వారికి కుట్రదారుల ఉద్దేశం సులభంగానే అర్థమవుతుంది. జగన్‌ మోహన్‌రెడ్డి క్రియాశీలకంగా రాజకీయాల్లో లేకపోతే లాభం పొందేదెవరు? ఆ లాభంలో ఎంతోకొంత తమ పార్టీకి కూడా దక్కకపోతుందా అని ఒంటె పెదవులకు నక్క ఆశలు పెట్టు కున్నట్టు పొంచి ఉన్నది ఎవరు?

డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టకముందే, ఆ మాటకొస్తే ఆయన ప్రతిపక్ష నాయకుడి పాత్రను కూడా చేపట్టడానికి ముందే జగన్‌ మోహన్‌రెడ్డి విజయ వంతమైన వ్యాపారవేత్త. ఆయన సండూర్‌ పవర్‌ను 1998లోనే ప్రారంభించారు. విజయవంతమైన వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలను విస్తరించుకుంటూ వెళ్లడం సహజం. వారి ట్రాక్‌ రికార్డును బట్టి పెట్టుబడులు రావడం కూడా సహజమే. 

ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. డాక్టర్‌ వైఎస్సార్‌ ప్రతిపక్ష నేతగా ఉన్న కాలంలో గానీ, ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో గానీ జగన్‌ మోహన్‌రెడ్డి బెంగళూరు కేంద్రంగానే వ్యాపారాలు చేసు కున్నారు తప్ప హైదరాబాద్‌లో లేరు. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన రాజకీయాల్లో క్రియాశీల పాత్రను పోషించ వలసిన అనివార్యత ఏర్పడినప్పుడే ఆయన మకాం హైదరా బాద్‌కు మారింది. 

జగన్‌ మోహన్‌రెడ్డి స్థాపించిన భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్‌ సంస్థల్లో ఇతరులు పెట్టుబడులు పెట్టడం వెనుక క్విడ్‌ ప్రోకో దాగున్నదనే ఆరోపణలు తెచ్చి కాంగ్రెస్‌–టీడీపీ కుమ్మక్కయి ఆయనపై అక్రమ కేసులు పెట్టి పదహారు నెలలు జైలుకు పంపాయి. ఆ సంస్థలు గడిచిన పదహారు పదిహేడేళ్లుగా విజయవంతంగా నడుస్తూ మదుపరులకు లాభాలు తెచ్చి పెట్టడం క్విడ్‌ ప్రోకో ఆరోపణల్లోని బూటకత్వాన్ని ఎండగట్టింది. 

మార్కెట్‌ను విస్తృతంగా అధ్యయనం చేసి సొంత ప్రాజెక్టుతో, సొంత పెట్టుబడులతో పాటు ఇతర ఇన్వెస్టర్లకు తన ప్రాజెక్టుపై నమ్మకం కలిగించి వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జగన్‌ తన వ్యాపారాలను విస్తరించుకున్నారు. ఈ ప్రయాణంలో రాజకీ యంగా మాట కోసం నిలబడవలసివచ్చిన కారణంగా ఆయన దారుణమైన వ్యక్తిత్వ హననానికి గురి కావలసి వచ్చింది. ఊహించని నిందలు మోయవలసి వచ్చింది. వ్యక్తిత్వ హననం అనేది హత్యతో సమానమంటారు. ఆ రకంగా చూస్తే కొన్ని వందల సార్లు ఆయన హత్యకు గురి కావలసి వచ్చింది.

ఇప్పుడు తల్లీ, చెల్లిపై కోర్టుకెక్కారనే నిందను మోపారు. ఈ వివాదానికి సంబంధించిన వివరాలు బయటకు వచ్చిన తర్వాత జగన్‌ మోహన్‌రెడ్డి వ్యక్తిగత ఔన్నత్యం ప్రజలకు తేటతెల్లమైంది. కుట్రదారుల పని కుడితిలో పడ్డట్టయింది. వారసత్వంగా సంక్ర మించిన ఆస్తులతో పాటు తాను సంపాదించిన ఆస్తులను కూడా జగన్, షర్మిల మధ్య డాక్టర్‌ వైఎస్సార్‌ పంపకం చేశారు. 

భారతి సిమెంట్స్‌ గానీ, జగతి పబ్లికేషన్స్‌ గానీ జగన్‌ మోహన్‌రెడ్డి స్వార్జితం కనుక పంపకాల్లో అవి రాలేదు. పైగా ఈ రెండు కంపెనీల్లోనూ జగన్, ఆయన సతీమణి భారతిలకు తప్ప షర్మిలకు వాటా కూడా లేదు. సిమెంట్‌ పరిశ్రమకు తన భార్య పేరునూ, పబ్లికేషన్స్‌కు భార్యాభర్తలిద్దరి పేర్లూ కలిసేలా ‘జగతి’ అనే పేరును జగన్‌ పెట్టుకున్నారు. అప్పుడు డాక్టర్‌ వైఎస్సార్‌ జీవించే ఉన్నారు. 

ఒక సందర్భంలో ‘ఈనాడు’ రాసిన అవాకులు చెవాకులకు జవాబునిస్తూ తన భార్య మీద ప్రేమతో తన సిమెంట్‌ పరిశ్రమకు ఆమె పేరును పెట్టుకున్నానని కూడా జగన్‌ రాశారు. అప్పుడు వైఎస్సార్‌ జీవించే ఉన్నారు. ఈ కంపెనీలు వారి కుటుంబ వారసత్వ సంపద కాదనీ, జగన్‌ స్వార్జితాలే అని చెప్పడానికి ఇటువంటి ఉదాహరణలెన్నో ఉన్నాయి. 

తండ్రి చనిపోయిన తర్వాత చాలాకాలం పాటు అన్న తనను బాగానే చూసుకున్నారని షర్మిల కూడా తన బహిరంగ లేఖలో అంగీకరించారు. షర్మిల తనకు చెల్లెలు మాత్రమే కాదు, పెద్ద కూతురు వంటిదని జగన్‌ ఒక సందర్భంలో ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే తండ్రి మనసుతో ఆలోచించి తన స్వార్జితమైన ఆస్తుల్లో వాటాలు చెల్లెలికి ఇవ్వాలని సంకల్పించారు. 

అందుకోసం ఒక అవగాహనా పత్రాన్ని (ఎమ్‌ఓయు) కూడా రాసిచ్చారు. ఇదెప్పుడు జరిగింది... తండ్రి చనిపోయిన పది సంవత్సరాల తర్వాత, షర్మిలకు వివాహం జరిగిన 20 సంవత్సరాల తర్వాత! ఇంతకాలం తర్వాత సొంత ఆస్తిలో చెల్లెలికి భాగం కల్పించిన అన్నలెందరుంటారు? ఈ మధ్య కాలంలో 200 కోట్ల సొంత ఆదాయాన్ని కూడా సోదరికి జగన్‌ అందజేశారు. ఈ వివరాలన్నీ బయటకు వచ్చిన తర్వాత జనం దృష్టిలో జగన్‌ ఔన్నత్యం మరింత పెరిగింది.

క్విడ్‌ ప్రోకో కేసుల కారణంగా ఆస్తులు ఈడీ జప్తులో ఉన్నందువల్ల ఎమ్‌ఓయూ (అన్‌రిజిస్టర్డ్‌)ను రాసుకోవలసి వచ్చింది. లేకపోతే ఈ పంపకాల కార్యక్రమం ఇప్పటికే పూర్తయి ఉండేది. కేసుల వ్యవహారం పూర్తిగా పరిష్కారమయిన పిదప ఆస్తుల బదలాయింపు జరిగేలా ఎమ్‌ఓయూ రాసుకున్నారు. ఈ పత్రంలోని ప్రతి పేజీ మీద జగన్‌తో పాటు షర్మిల కూడా సంతకం చేశారు. పత్రం మొదటి పేజీలోని రెండో అంశంలోనే పంపకానికి ప్రతిపాదిస్తున్న ఆస్తుల సొంతదారు జగన్‌ మోహన్‌రెడ్డి (the subject properties / owned directly and indirectly through companies by YS Jagan) అనే మాట స్పష్టంగా ఉన్నది. ఈ వాక్యం కింద షర్మిల సంతకం కూడా ఉన్నది.

రెండో పేజీలో ఇంకో కీలక అంశమున్నది. తన చెల్లెలి మీద వైఎస్‌ జగన్‌కున్న ప్రేమాభిమానాల కారణంగా (In consideration of his love and affection for his sister, YSJ here by agrees....) ప్రతిపాదిత ఆస్తులను బదిలీ చేస్తున్నట్టున్నది. అంతేతప్ప హక్కుగా ఆమెకు బదిలీ చేస్తున్నట్టు లేదు. ఈ పేజీ మీద కూడా షర్మిల సంతకం ఉన్నది. ఈ ఒప్పందం రాసుకున్నది 2019లో. అప్పుడు ఈ ప్రతిపాదిత ఆస్తులు అన్న సొంత ఆస్తులని అంగీకరించి సంతకం కూడా చేశారు కదా!

భారతి సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్‌లో వాటాలతో పాటు సరస్వతి పవర్‌ పూర్తిగా షర్మిలకే బదిలీ అయ్యేటట్లుగా రాసుకుని తాత్కాలికంగా తల్లిగారి పేరు మీద గిఫ్ట్‌ డీడ్‌ చేసి కేసుల పరిష్కారం తర్వాత అది షర్మిలకు బదిలీ అయ్యేలా ఏర్పాటు చేశారు. కానీ ఆ గిఫ్ట్‌ డీడ్‌ను తల్లి పేరు మీద షేర్లుగా షర్మిల మార్పించారు. ఒరిజినల్‌ షేర్‌ సర్టిఫికెట్లు జగన్‌ దగ్గర ఉన్నాయని తెలిసీ అవి ఎక్కడో పోయాయని చెప్పి, బదిలీ పత్రాలపై జగన్‌ సంతకం చేయకుండానే షేర్లు మార్పించారు. 

ఈడీ జప్తులో ఉన్న ఆస్తుల బదిలీ వల్ల కేసుల్లో న్యాయపరమైన చిక్కులను జగన్‌ ఎదుర్కోవలసి వస్తుందని తెలిసీ షర్మిల ఈ చర్యకు పాల్పడ్డారు. దాంతో ఈ చట్టవిరుద్ధమైన వ్యవహారాన్ని ఆపాలని జగన్‌ ఆమెకు లేఖ రాశారు. ఆమె ససేమిరా అనడంతో న్యాయ నిపుణుల సలహా  మేరకు ఆయన ఎన్‌సీఎల్టీ తలుపు తట్టి ఈ బదిలీని ఆపేయాలని కోరవలసి వచ్చింది. ఇదే తల్లినీ, చెల్లినీ జగన్‌ కోర్టుకీడ్చారని ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారం లోని అసలు గుట్టు. 

ఈ రకమైన ప్రచారంతో తన పాలనా వైఫల్యాలను కప్పి పుచ్చుకోవాలనీ, జగన్‌ ప్రతిష్ఠను దెబ్బ తీయాలనీ యెల్లో సిండికేట్‌ తాపత్రయపడుతున్నది. ఈ దుష్ట పన్నాగానికి షర్మిల పూర్తి స్థాయిలో సహకరిస్తున్నదని శనివారం నాటి ఆమె మీడియా సమావేశం బట్టబయలు చేసింది. జగన్‌ మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దవుతుంది కాబట్టి అమ్మను కోర్టు కీడుస్తారా అని ప్రశ్నించడం ఆశ్చర్యపరిచింది. 

జగన్‌ ముందు గానే ఎన్‌సీఎల్టీకి లేఖ రాయడంతో బెయిల్‌ రద్దయ్యే అవకాశం పోయిందని ఆమె ఆశాభంగం చెందారా అనే అనుమానం వైసీపీ శ్రేణుల్లో వ్యక్తమవుతున్నది. చంద్రబాబుతో ఆమె పూర్తిస్థాయిలో కుమ్మక్కు అయ్యారనేందుకు ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావా లని వారు ప్రశ్నిస్తున్నారు. 


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Back to Top