()ప్రతిపక్ష నేతను మరిచిన ఏపీ సర్కార్
()పుష్కరాలు మొదలయ్యాక వైయస్ జగన్‌కు ఆహ్వానం
()దళిత మంత్రిని పంపించి బాబు రాజకీయం
()సినీ ప్రముఖులకు వారం రోజుల ముందుగా పిలుపు
ఆహ్వానం అంటే..ఒక కార్యక్రమం ప్రారంభోత్సవానికి ముందు జరుగుతుంది. అంతేకాని, ఒక కార్యక్రమం ప్రారంభం అయిపోయిన తరువాత ఎవరైనా ఎవరినైనా ఆహ్వానిస్తారా? అలా పిలిస్తే దాన్ని ఆహ్వానం అంటారా? కానీ, ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ మాత్రం ఇదే చేసింది. కృష్ణా పుష్కరాలు ప్రారంభమయ్యాక ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రభుత్వం ఆహ్వాన పత్రిక అందజేసింది. అందులో కూడా రాజకీయం చేయాలని చంద్రబాబు కుట్ర పన్నారు.
హైదరాబాద్: ప్రజాస్వామ్య దేశంలో పాలకపక్షం, ప్రతిపక్షం కలిసి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతోంది. పాలక పక్షం చేస్తున్న తప్పులను ఎత్తి చూపడం ప్రతిపక్షం బాధ్యత. అలా అని తమ తప్పులను ఎత్తిచూపుతున్నారని ఏకంగా ప్రభుత్వం పాలక పక్షాన్ని ఏ అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామ్యం కల్పించకపోవడం సరైంది కాదు. అయితే ఆంధ్ర ప్రదేశ్‌లో ఇదే జరుగుతోంది. రెండేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అవినీతి, అక్రమాలపై ప్రతిపక్ష వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చట్టసభల్లో, బయట పోరాటం చేస్తోంది. ఈ క్రమంలో చేసిన తప్పులు సరిదిద్దుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ప్రతిపక్షంపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. ఏ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు తలపెట్టినా ప్రతిపక్షానికి సమాచారం ఇవ్వడం లేదు.
నీచ రాజకీయాలు
పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలపై కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. కృష్ణా పుష్కరాలకు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఇందులో పాల్గొనాలని ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వారం రోజుల ముందుగానే రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లను కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు. ఏపీ కేబినెట్ మంత్రులు కూడా వివిధ రాష్ట్రాలకు అహ్వాన పత్రికలు అందజేశారు. ఆహ్వాన పత్రికలు పట్టుకొని అధికార పార్టీ నేతలు హైదరాబాద్‌లో వారం రోజులుగా చక్కర్లు కొడుతున్నారు. తెలుగు సినీ ప్రముఖులను పుష్కరాలకు పిలిచారు. అయితే ప్రధాన ప్రతిపక్షాన్ని విస్మరించారు.
ఇదేనా బాబు సంస్కారం
రాష్ట్రంలో రెండే రెండు పార్టీలు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. టీడీపీ, బీజేపీలు అధికార పక్షంలో ఉండగా, వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. ఇంత గొప్ప కార్యక్రమం రాష్ట్రంలో నిర్వహిస్తున్నప్పుడు ప్రతిపక్షాన్ని పిలవాలన్న సంస్కారం అధికార పార్టీ నేతలకు లేకుండా పోయింది. ఈ నెల 12న రాష్ట్రంలో కృష్ణా పుష్కరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు అట్టహాసంగా ప్రారంభించారు. పుష్కరాలు ప్రారంభమైన 12 గంటల తరువాత, ప్రతిపక్ష నేత అందుబాటులో లేని సమయంలో పత్రికలు ఇచ్చి వైయస్ జగన్ ఇంటికి దళిత మంత్రి రావెల కిశోర్‌బాబు, విప్ కూన రవికుమార్‌లను పంపించడం విడ్డూరం.
ప్రోటోకాల్ ఉల్లంఘన
కృష్ణా పుష్కరాలకు అతిథులను ఆహ్వానించే విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రోటోకాల్‌ను ఉల్లంఘించింది. పుష్కరాలు ప్రారంభమైన మరుసటి రోజు ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డికి పుష్కర ఆహ్వాన పత్రిక అందజేసి నీచ సంస్కృతికి చంద్రబాబు సర్కార్ తెర లేపింది. పుష్కరాలకు పది రోజుల ముందే సినీ ప్రముఖులను, రాజకీయ నాయకులను, న్యాయమూర్తులను ఆహ్వానించిన టీడీపీ సర్కార్ ప్రోటోకాల్ ప్రకారం ప్రతిపక్ష నేతను ఆహ్వానించలేదు. పుష్కరాలు మొదలయ్యాక వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇంటికి మంత్రి రావెల కిషోర్‌బాబు, కూన రవికుమార్‌లను శుక్రవారం రాత్రి చంద్రబాబు పంపించారు. మూడు రోజులు ఢిల్లీ పర్యటనలో ఉన్న వైయస్ జగన్ శుక్రవారం అమలాపురం వెళ్లి గోవధ అపోహ బాధితులను పరామర్శించారు. ఆయన ఇంట్లో లేని సమయంలో టీడీపీ నేతలు లోటస్‌పాండ్‌కు వచ్చి ఎల్లో మీడియా ఎదుట మంత్రి, ప్రభుత్వ విప్ డ్రామాలు ఆడారు. పుష్కరాలు ప్రారంభమయ్యాక ప్రతిపక్ష నేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆహ్వానం పంపడం బాబు రాజకీయ కుట్రలో భాగమే. శనివారం ఉదయం వైయస్ జగన్‌ను కలవాలని వైయస్‌ఆర్‌సీపీ సీనియర్ నేతలు సూచించినా కూడా దాన్ని రాద్ధాంతం చేసి డ్రామాను రక్తికట్టించారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని తన ఇంటి కార్యక్రమాల్లా చేస్తూ చంద్రబాబు ప్రోటోకాల్‌ను ఉల్లంఘిస్తున్నారు. ప్రభుత్వ తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.