శిలాఫలకాలే బాబు ఘనత!

బాబు హయాంలో సీమకు తీరని అన్యాయం
నిత్యం కరువు కాటకాలతో తల్లడిల్లే ప్రాంతం అనంతపురం. దేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే జిల్లాల్లో రెండోదిగా అనంతపురం జిల్లా రికార్డులకెక్కింది. అతి తక్కువ వర్షం కురుస్తుండడంతో అనంతపురం జిల్లాలో వ్యవసాయం ఓ జూదంలా మారింది. హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తయితే అనంతపురంతో పాటు రాయలీసీమజిల్లాలు సస్యశ్యామలమవుతాయి. ఈ ప్రాజెక్టుకు దివంగత ఎన్టీఆర్ రూపకల్పన చేస్తే ఆ తర్వాత రెండుసార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు శిలాఫలకాలు వేశారు. రాయలసీమ ప్రాంత అభివృద్ధికి తాను గతంలో ఎంతో చేశానని, ఇపుడు పట్టి సీమ ప్రాజెక్టు కూడా సీమ పురోభివృద్ధికోసమేనని చంద్రబాబు చెబుతున్నారు. వాస్తవానికి గత తొమ్మిదేళ్ల పాలనలో శిలాఫలకాలు వేయడం తప్ప చంద్రబాబు చేసిందేమీ లేదు. తొమ్మిదేళ్ల హయాంలో సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకున్న పాపాన పోలేదు. తాజాగా ఏడాది కాలంలో ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లలో సీమ ప్రాజెక్టులకు చంద్రబాబు విదిల్చింది అరకొరనిధులు మాత్రమే. అవి ఆయా ప్రాజెక్టుల పనులు చూస్తున్న ఉద్యోగుల జీతభత్యాలకు మాత్రమే సరిపోతాయి.

బాబు నయవంచనకు నిదర్శనం హంద్రీనీవా
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నయవంచనకు, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విశ్వసనీయతకు ‘‘అనంతవెంకట్రామిరెడ్డి హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు’’ నిదర్శనంగా నిలుస్తుంది. నిత్యం దుర్భిక్షంతో తల్లడిల్లే రాయలసీమకు సాగునీరు అందించాలన్న డిమాండ్ దశాబ్దాలుగా ఉంది. దీనిని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలన్న చంద్రబాబు ఆ దిశగానే అడుగులు వేశారు. 1996 లోక్‌సభ మధ్యంతర ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి హోదాలో హంద్రీనీవా ప్రాజెక్టుకు ఉరవకొండ వద్ద చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. ఎన్నికలు ముగిసిన తర్వాత హంద్రీనీవాను గాలికొదిలేశారు. 1999 సాధారణ ఎన్నికల వేళ చంద్రబాబుకు హంద్రీనీవా ప్రాజెక్టు మరోమారు గుర్తుకు వచ్చింది. అనంతపురం జిల్లా ఆత్మకూరు వద్ద మరో శిలాఫలకం వేసి హంద్రీనీవా ప్రాజెక్టును పూర్తి చేస్తానంటూ మరోమారు వాగ్దానం చేశారు. కానీ అధికారంలోకి వచ్చాక దాని గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. ఐదేళ్లూ అలానే పొద్దుపుచ్చారు. 40 టీఎంసీల సామర్థ్యమున్న హంద్రీనీవా సాగునీటి ప్రాజెక్టును 5 టీఎంసీల తాగునీటి ప్రాజెక్టుగా మార్చిన ఘనత చంద్రబాబుదే. బాబు హయాంలో కరువు కాటకాలు, తీవ్ర దుర్భిక్ష పరిస్థితులతో సీమజిల్లాలు అల్లాడి పోయాయి. అన్నదాతల ఆత్మహత్యలు ఏటేటా పెరుగుతూ వచ్చాయి. హంద్రీనీవా ప్రాజెక్టుపై చంద్రబాబు నిర్లక్ష్యవైఖరిని నిరసిస్తూ సీమ రైతులు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు.

వైఎస్ హయాంలో శరవేగంగా హంద్రీనీవా పనులు
2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. తీవ్ర దుర్బిక్షంతో అల్లాడుతున్న రాయలసీమకు మేలు చేయాలన్న ఏకైక లక్ష్యంతో దివంగత వైఎస్‌ఆర్ హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. జులై 24 , 2004లో వైఎస్‌ఆర్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. శ్రీశైలం నుంచి 40 టీఎంసీల నీటిని ఎత్తిపోసి రాయలసీమను సస్యశ్యామలం చేయాలని వైఎస్ కలలు కన్నారు. అనంతపురం, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లోని 6 లక్షల ఎకరాలకు సాగునీరు, దాదాపు 30 లక్షల మందికి తాగునీరు ఇవ్వాలని భావించారు. 7 వేల కోట్ల రూపాయలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. వైఎస్ సీఎంగా ఉన్నపుడు హంద్రీనీవా ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగాయి. వైఎస్ మరణించే నాటికి ఈ ప్రాజెక్టుపై ఐదువేల కోట్లు ఖర్చు చేశారు. హంద్రీనీవా మొదటి దశ పనులు 90శాతం పూర్తయ్యాయి. వైఎస్ తర్వాత  ముఖ్యమంత్రులైన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు కేవలం ఐదుశాతం పనులు పూర్తి చేశాయి. ఇప్పటి వరకు జరిగిన పనులతో కృష్ణాజలాలు అనంతపురంకు వస్తున్నాయి. అయితే వచ్చిన నీటిని వ్యవసాయానికి ఉపయోగించుకోవాలంటే ఉపకాల్వలు, వంతెనలు, ఆయకట్టు నిర్మాణం జరగాల్సి  ఉంది. కేవలం రెండు వేల కోట్లు వెచ్చిస్తే హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తవుతుంది. ప్రభుత్వ వైఖరి కారణంగా హంద్రీనీవా పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. పట్టి సీమపై నానా హడావిడి చేస్తున్న చంద్రబాబుకు హంద్రీనీవా ప్రాజెక్టు ఎందుకు కనిపించడం లేదు? ఒకవేళ పట్టి సీమ పూర్వి చేసినా రాయలసీమకు ఎలా నీళ్లిస్తారని అనంతవాసులు ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు చెప్పేవన్నీ కల్లబొల్లి కబుర్లే. తొమ్మిదేళ్ల పాలనలో హంద్రీనీవాకు ఆయన ఖర్చుపెట్టింది కేవలం 12 కోట్లు మాత్రమే. అవీ పరిపాలనాపరమైన ఖర్చులకు, జీతభత్యాలకే సరిపోయాయి. ఇపుడు వెయ్యి కోట్లిస్తామని చెప్పి 230 కోట్లు కేటాయించారు. అందులో 160 కోట్లు కరెంటు బకాయిలకే కట్టాలి. మరి ప్రాజెక్టు పనులు జరిగేదెలా?

మిగిలిన ప్రాజెక్టులదీ అదే పరిస్థితి
ఎన్టీఆర్ శంకుస్థాపన చేసిన హంద్రీనీవాతో పాటు తెలుగుగంగ, గాలేరు నగరి వంటి ముఖ్యమైన సీమ ప్రాజెక్టులకు కేటాయింపులలో చంద్రబాబు తన ఏలుబడిలో తీవ్ర నిర్లక్ష్యం చూపారు. వైఎస్ హయాంలోనే ఈ ప్రాజెక్టులు పురోగమించాయి. ఇద్దరి పాలనలో వాస్తవంగా జరిగిన కేటాయింపులు, ఖర్చులే ఇందుకు సాక్ష్యాలు. గాలేరు-నగరి ప్రాజెక్టుకు తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో కేవలం రు.17 కోట్లు కేటాయించారు. వైఎస్ హయాంలో రు. 4,600 కోట్లు కేటాయించి ఖర్చు చేశారు. మరో రు.2,600 కోట్లు వెచ్చిస్తే గాలేరు-నగరి ప్రాజెక్టు పూర్తవుతుంది. కానీ ఈ ఏడాది చంద్రబాబు ప్రభుత్వం కేవలం రు.169 కోట్లు కేటాయించి రాయలసీమపై తనకు ఎంత ప్రేమ, ప్రాధాన్యం ఉన్నాయో తెలియజేసుకుంది. అదేవిధంగా హంద్రీనీవా ప్రాజెక్టుకు చంద్రబాబు పాలనలో రు.13 కోట్లు కేటాయిస్తే వైఎస్ రు.5,000 కోట్లు ఖర్చు చేశారు. మరో రు.1,100 కోట్లు ఖర్చు చేస్తే హంద్రీనీవా పూర్తవుతుంది. కానీ బాబు ఈ ఏడాది ఈ ప్రాజెక్టుకు కేటాయించింది కేవలం రు.212 కోట్లు. వెలిగొండకు వైఎస్ హయాంలో రు.3,000 కోట్లు ఖర్చు చేశారు. మరో రు.1,500 కోట్లు ఖర్చు చేస్తే ఆ ప్రాజెక్టు పూర్తవుతుంది. కానీ చంద్రబాబు ఈ ఏడాది కేటాయించింది రు.50 కోట్లు. 

కృష్ణా నది నుంచి సీమకు సాగునీరు అందాలంటే పోతిరెడ్డి పాడు దిగువనున్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తికావాల్సి ఉంది. అలాంటి ప్రాజెక్టులన్నిటినీ పక్కనపెట్టి పట్టిసీమతో రాయలసీమ నీటి అవసరాలు తీరుస్తామనడం రైతులను విస్మయానికి గురిచేస్తోంది.


Back to Top