ఇందాపూర్‌ డెయిరీపై చర్చంటే భయమెందుకు? 

ఆ డెయిరీతో హెరిటేజ్‌ బంధం నిజమా? కాదా?

చంద్రబాబుకు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి సూటి ప్రశ్న

వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి

కల్తీ నెయ్యి ముసుగులో ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు చంద్రబాబు కుట్ర

కేజీ నెయ్యి ధర రూ.658కి పెంచి ఇందాపూర్‌ డెయిరీకి టెండర్‌  కట్టబెట్టాడు

వ్యాపార సంబంధం బయట పడ్డంతో చర్చకు భయపడి వెనకడుగు 

మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి వెల్లడి

ఇందాపూర్‌ డెయిరీ ముసుగులో హెరిటేజ్‌కు దోచిపెట్టే కుట్ర

అడ్డంగా దొరకడంతో సున్నిత అంశమంటూ సన్నాయి నొక్కులు

హెరిటేజ్‌ ఇందాపూర్‌ డెయిరీల లింక్‌.. రాష్ట్ర అప్పులు..

నిషేధిత భూముల 22–ఏ జాబితా..

దేనిపై అయినా మేం చర్చకు సిద్ధం. మీరు రెడీనా?

ప్రభుత్వానికి మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి సవాల్‌

తాడేపల్లి: ఇందాపూర్‌ డెయిరీ ముసుగులో టీటీడీ నిధులు హెరిటేజ్‌కి మళ్లించి భారీ అవినీతికి పాల్పడింది నిజం కాబట్టే దానిపై మండలిలో చర్చకు వైయస్సార్సీపీ పట్టుబడితే ప్రభుత్వం భయంతో పారిపోయిందని నెల్లూరు జిల్లా వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్దన్‌ రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడాదిన్నరగా కల్తీ నెయ్యి ముసుగులో ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలకు చంద్రబాబు కుట్ర చేశాడని.. అవన్నీ బహిర్గతమై నిండా మునిగిపోయిన చంద్రబాబు లడ్డూ సున్నితమైన అంశమని తానిక దాని గురించి మాట్లాడనని సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడంటూ కాకాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.300లకు నాణ్యమైన నెయ్యి ఎలా వస్తుందంటూ చంద్రబాబు చేసిన ప్రచారం వెనుక కారణం ఇందాపూర్‌ డెయిరీకి నెయ్యి సప్లై కాంట్రాక్టు కేజీ రూ.658లకు కట్టబెట్టడానికేనని స్పష్టం చేశారు. కూటమి నాయకులకు దమ్ముంటే కల్తీ నెయ్యి, రాష్ట్ర అప్పులు, 22 ఏ భూములు.. దేనిపైనయినా చర్చకు సిద్ధమని కాకాణి గోవర్ధన్‌ రెడ్డి సవాల్‌ విసిరారు. 
ప్రెస్‌మీట్‌లో కాకాణి గోవర్థన్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..:

కలియుగదైవంతో చంద్రబాబు చెలగాటం:
    ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులు అతి పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డం పెట్టుకుని చంద్రబాబు ఆర్థికంగా, రాజకీయంగా లబ్ధి పొందాలని తీవ్రమైన కుట్ర చేశాడు. దేవుడిని రాజకీయాల్లోకి చేయరాని పాపం మూటకట్టుకున్నాడు. లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో పంది కొవ్వు, గొడ్డు మాంసం, చేపల నూనె కలిసిందంటూ ఆధారాలు లేకుండా తీవ్రమైన ఆరోపణలు చేసి కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆడుకున్నాడు. సీబీఐ సిట్‌ ఛార్జిషీట్‌ సాక్షిగా చంద్రబాబు చెప్పినదంత అబద్ధమని తేల్చినా ఆగకుండా బాత్రూమ్‌ క్లీన్‌ చేసే కెమికల్స్‌ కలిపారంటూ ఇంకా దిగజారి ప్రచారం చేశాడు. కానీ కలియుగదైవంతో చెలగాటం ఆడిన చంద్రబాబు.. అటు సిట్‌ చార్జిషీట్, ఇటు ఇందాపూర్‌ డెయిరీ వ్యవహారంతో అడ్డంగా దొరికిపోయాడు. తాను తీసుకున్న గోతిలో ఆయనే కూరుకుపోయాడు.

చర్చకు భయపడి వాయిదా తీర్మానంపైనా కుట్రలే:
    ఇందాపూర్‌ డెయిరీ ముసుగులో తన కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్‌ డెయిరీకి టీటీడీ నిధులు మళ్లించాలని చంద్రబాబు స్కెచ్‌ వేశాడు. ఆ కుట్రలో భాగంగానే కల్తీ నెయ్యి డ్రామాకు తెరదీసి రాజకీయంగా వైయస్సార్సీపీని ఇరికించే ప్రయత్నం చేశాడు. నెయ్యి ధరలు పెంచేసి సప్లై టెండర్లు ఇందాపూర్‌ డెయిరీకి కేజీ రూ.658లకు కట్టబెట్టేశాడు. ఇందాపూర్‌ డెయిరీ ముసుగులో టీటీడీ సొమ్ముని హెరిటేజ్‌ డెయిరీకి మళ్లించే ప్రణాళికలో భాగంగా చంద్రబాబు నడిపిన కల్తీ నెయ్యి డ్రామాపై మండలిలో చర్చించాలని వైయస్సార్సీపీ పట్టుబడితే చైర్మన్‌ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు. ఇక్కడ కూడా ప్రభుత్వం కుట్ర చేసింది.
    వైయస్సార్సీపీ నుంచి ఎన్నికై, టీడీపీలో చేరిన బల్లి కళ్యాణ చక్రవర్తి, మర్రి రాజశేఖర్‌ ద్వారా టీడీపీ మరో వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టించింది. ఇందాపూర్‌ డెయిరీపై చర్చ జరిగితే తిరుమల లడ్డూ పేరుతో చంద్రబాబు చేసిన కుట్రలన్నీ బయటకొస్తాయని ప్రభుత్వం వణికిపోతోంది. ఇందాపూర్‌ డెయిరీ పేరుతో హెరిటేజ్‌ సంస్థ టీటీడీకి నెయ్యి సరఫరా అంశంపై వైయస్సార్సీపీ సభ్యులు ఆర్‌.రమేష్‌ యాదవ్, కేఆర్‌జె భరత్, డాక్టర్‌ సిపాయి సుబ్రహ్మణ్యం వాయిదా తీర్మానం కోరగా.. తిరుమల లడ్డూ ప్రసాదం గురించి టీడీపీకి అమ్ముడుబోయిన బల్లి కళ్యాణచక్రవర్తి, మర్రి రాజశేఖర్‌ మరో వాయిదా తీర్మానం కోరారు. వైయస్సార్సీపీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీలను టీడీపీలో చేర్చుకుని వారితోనే ప్రభుత్వం కుట్రపూరితంగా వాయిదా తీర్మానం పెట్టించింది. ఇన్ని కుట్రలు చేసి మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ పట్టు కోల్పోయారంటూ నారా లోకేష్‌ మాట్లాడిన మాటలు ఆయన దివాళాకోరుతనానికి నిదర్శనం. 

ఇందాపూర్‌ డెయిరీ ముసుగులో  టీటీడీ నిధుల దోపిడీ
    ఇందాపూర్‌ డెయిరీ ముసుగులో 2014–19 మధ్య వందల కోట్లు టీటీడీ నిధులను హెరిటేజ్‌ డెయిరీకి మళ్లించిన చంద్రబాబు.. 2024 లో అధికారంలోకి వచ్చిన తర్వాత నెయ్యి ధరలు పెంచి దోచుకునే కుట్రకు తెరదీశాడు. అందులో భాగంగానే రూ.300లకు నాణ్యమైన నెయ్యి వస్తుందా అనే ప్రచారం మొదలుపెట్టి, ఇందాపూర్‌ డెయిరీకి డిసెంబర్‌ 2025లో కేజీ రూ.658కి నెయ్యి సప్లై టెండర్లు కట్టబెట్టాడు. తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యి కల్తీ ముసుగులో చంద్రబాబు చేసిన కుట్రలను ఆధారాలతో సహా వైయస్సార్సీపీ భగ్నం చేసింది. హెరిటేజ్‌ వెబ్‌సైట్‌ సాక్షిగా చంద్రబాబు దొరికిపోయాడు. దేవుడి ప్రతిష్టను పణంగా పెట్టి దోపిడీకి పాల్పడ్డ చంద్రబాబు చర్యలను దేశవ్యాప్తంగా ప్రజలు చీకొడుతున్నారు. ఏడాదిన్నరగా చంద్రబాబు రక్తి కట్టించిన కల్తీ కుట్రకు వైయస్సార్సీపీ తెరదించడంతో ప్రభుత్వం దిక్కుతోచని స్థితిలోకి పడిపోయింది. అందుకే మండలిలో చర్చకు వైయస్సార్సీపీ పట్టుబడితే ప్రభుత్వం భయంతో పారిపోయింది. ఇన్నాళ్లూ తిరుమల ప్రతిష్టను పట్టించుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడిన చంద్రబాబు, అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఇది సున్నితమైన అంశం.. ఇకపై మాట్లాడను అంటూ నాలుక మడతేశాడు. 

మా ప్రభుత్వ అప్పులపై దుష్ప్రచారం చేసి..:
    వైయస్సార్సీపీ హయాంలో రూ.14 లక్షల కోట్ల అప్పులంటూ చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్, నారా లోకేష్‌ సహా కూటమి నాయకులు చేసిందంతా దుష్ప్రచారమేనని మండలి సాక్షిగా వారే అంగీకరించక తప్పని పరిస్థితి ఎదురైంది. 
    వారిచ్చిన లెక్కల ప్రకారమే మొత్తం ఏపీ అప్పులు 2024 వరకు రూ.4,91,734 కోట్లు. 2024 వరకు కార్పొరేషన్ల అప్పు రూ.1,40,479 కోట్లని చెప్పారు. వైయస్సార్సీపీ హయాంలో బడ్జెట్‌ అప్పులు రూ.2,34,225 కోట్లు మాత్రమేనని, కార్పొరేషన్ల అప్పులు పదేళ్లలో రూ.1,40,479 కోట్లుగా వారే అంగీకరించినట్టయింది. ఈ 20 నెలల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం అక్షరాలా రూ.3,28,225 కోట్లు అప్పులు చేసి దాని గురించి ప్రశ్నిస్తే మాత్రం నోరు మెదపడం లేదు. ఐదేళ్లలో వైయస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అప్పును టీడీపీ కూటమి ప్రభుత్వం 20 నెలల్లోనే చేసేసింది. వైయస్‌ జగన్‌ గారు వివిధ పథకాల రూపంలో డీబీటీ ద్వారా ఏకంగా రూ.2.75 లక్షల కోట్లు లబ్ధి చేకూరిస్తే, చంద్రబాబు మాత్రం సూపర్‌ సిక్స్‌లో ఏ ఒక్క పథకం అమలు చేయకుండానే భారీగా అప్పులు చేస్తున్నాడు. అప్పుల్లో  రికార్డులు సృష్టిస్తున్నాడు. సంపద పృష్టిస్తానని చెప్పి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశాడు. 

22–ఏ భూముల సమస్య చంద్రబాబు సృష్టే:
    రాష్ట్రంలో 22–ఏ భూముల సమస్య ఎక్కువగా ఉందని, జీవో అమలుపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని స్పీకర్‌ గారు మంత్రి  అనగాని సత్యప్రసాద్‌కు సూచన చేస్తే.. 22–ఏ నుంచి ప్రైవేట్‌ భూములను బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని మంత్రి అనగాని సమాధానమిచ్చారు.
    కానీ వాస్తవం చూస్తే 22–ఏ భూముల సృష్టికర్తే చంద్రబాబు. 22–ఏ గురించి 2016–17లో ప్రత్యేకంగా జీవోలు ఇచ్చి, ప్రాహిబిటివ్‌ లిస్ట్‌ కింద పెట్టి, రైతులను, పేదలను, భూ యజమానులను ఇబ్బందులు పెట్టిన ఘనత చంద్రబాబుదే. 2019లో వైయస్సార్సీపీ  ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులను, పేదలను దృష్టిలో ఉంచుకొని వాళ్లకు శాశ్వత హక్కులు కల్పించడం జరిగింది. జగన్‌ గారి విప్లవాత్మక నిర్ణయాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 20.24 లక్షల మంది పేదలు, రైతులకు ఏకంగా 35.44 లక్షల ఎకరాలపై హక్కులు లభించాయి.
    అసైన్డ్‌ ల్యాండ్‌ పొంది 20 ఏళ్లు దాటితే, వారి భూముల మీద వారికి పూర్తి హక్కులు కల్పించిన చరిత్ర మా వైయస్‌ జగన్‌కి దక్కుతుంది. ఒరిజినల్‌ అసైనీలకు లేదా వారి వారసులకు మాత్రమే వర్తింపజేస్తూ ఆనాడు మేము తీసుకొచ్చిన చట్టం ద్వారా ఏకంగా 15,21,160 మంది అసైన్డ్‌ నిరుపేదలకు, 27,41,698 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు లభించాయి. చుక్కల భూములకు సంబంధించి మరో 97 వేలకు పైగా కుటుంబాలకు చెందిన 2,06,171 ఎకరాలపై హక్కు లభించింది. షరతు కలిగిన భూములకు సంబంధించి 22 వేల మంది రైతులకు మరో 35 వేలకు పైగా ఎకరాల భూమి మీద వాళ్లకు హక్కులు వచ్చాయి. విలేజ్‌ సర్వీస్‌ ఇనాం భూముల కింద 1.58 లక్షల ఎకరాలకు సంబంధించి మరో 1.61 లక్షల మందికి మేలు జరిగిస్తూ హక్కులు కల్పించాం.
    కానీ వాస్తవాలను దాచిపెట్టి ఆ నెపాన్ని వైయస్సార్సీపీ మీదకు నెట్టే కుట్రలు చేయడం దుర్మార్గం. రైతులను ఇబ్బంది పెట్టిన ఘనత చంద్రబాబుది. 

చర్చించే దమ్ముందా?:
    ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఏ అంశం మీదైనా చర్చించడానికి వైయస్సార్సీపీ సిద్ధంగా ఉంది. దేవుడంటే భయం భక్తి ఉంటే, కల్తీ నెయ్యి ముసుగులో అవినీతికి పాల్పడిన మాట వాస్తవం కాకపోతే మండలిలో ఇందాపూర్‌ డెయిరీపై చర్చించడానికి ఎందుకు భయపడుతున్నారు? నాడు రాష్ట్ర అప్పులపై మీ దుష్ప్రచారం, నిషేధిత భూముల జాబితా 22–ఏ పైనా మేము చర్చకు సిద్ధం. మరి ప్రభుత్వానికి వీటన్నింటిపై చర్చించే దమ్ముందా అని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి సవాల్‌ చేశారు.

Back to Top