నిర్లక్ష్యానికి నిండు ప్రాణాలు బలి

విజయవాడ ఇబ్రహీంపట్నం లో ఫెర్రీ ఘాట్ లో జరిగిన ఘోర పడవ ప్రమాదానికి పూర్తి భాద్యత ప్భుత్వానిదే.  పాలకులు, వారి అండతో అధికారులు చేస్తున్న నిర్లక్ష్యాలకు నిండు ప్రాణాలు బలి అయిపోతున్నాయి. నదులకు హారతలు, ప్రాజెక్టులకు పూజలు, పథకాల పేరుతో ప్రకటనల ఆర్భాటాలు తప్ప నిజంగా క్షేత్ర స్థాయిలో జరుగుతున్నదేమిటో చంద్రబాబుకు ఎప్పుడూ అక్కర్లేదు. 
భవానీ ద్వీపం నుంచి పవిత్ర సంగమం వైపుకు వెళుతున్న బోటులో సుమారు 30మందికి పైగా యాత్రికులున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి వచ్చిన వాకర్స్ గ్రూప్ సభ్యులు ఈ పడవలో ప్రయాణిస్తూ మృత్యువాత పడ్డారు. ఎక్కే ముందే లైవ్ జాకెట్స్ ఏవని అడిగితే, ప్రమాదం ఏమీ ఉండదని నిర్వాహకులు చెప్పినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అసలు ఆ బోటుకు అనుమతే లేదని, దాన్ని నడిపిన డ్రైవర్ కు అనుభవం కూడా లేదని చివరకు విచారణలో తేలింది. ప్రమాదం జరిగి భయభ్రాంతులకు గురై 100కి ఫోన్ చేస్తే 45 నిమిషాలకు గానీ సహాయక చర్యలు ప్రారంభం కాకపోవటంతో ఎక్కువమంది మృత్యువాత పడ్డారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే వైయస్సార్ సిపి నాయకులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భద్రతాచర్యల్లో లోపం కొన్ని కుటుంబాలకు విషాదాన్ని మిగిల్చింది. 

ప్రైవేటు బోటింగ్ వ్యవహారంలో ఇద్దరు ముఖ్యనేతలు

కృష్ణా నదిలో తిరిగే ప్రైవేటు బోటుల వ్యవహారంలో టిడిపి కి చెందిన ఇద్దరు ప్రముఖ మంత్రుల హస్తం ఉన్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి. పర్యాటక శాఖ అనుమతులు లేకపోయినా, వారిద్దరి అండతోనే నదిలో యధేచ్ఛగా ప్రైవేటు బోట్లు తిరుగుతున్నాయని తెలుస్తోంది. పర్యాటక అభివృద్ధి సంస్థలో పని చేస్తున్న ఓ ఉద్యోగి మంత్రికి అనుచరుడిగా విజయవాడలో ఉంటూ, ఈ బోట్ల వ్యవహారాన్ని నడిపిస్తున్నట్టు సమాచారం. వచ్చే ఆదాయంలో మంత్రులకు సగం వాటా వెళుతుందని కొందరు బోటు ఆపరేటర్లు చెబుతున్నారు. ఇక ప్రమాదానికి కారణమైన రివర్ బోటింగ్ క్లబ్ లోని బోట్లను కొందరు పర్యాటక శాఖ ఉద్యోగులే నిర్వహిస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. ప్రమాదానికి కారణమైన బోటుకు అనుమతి లేదని పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి మీనా చెబుతుంటే, ఉందో లేదో విచారణ చేయమని ఈమధ్యే ఈ శాఖకు మంత్రిగా వచ్చిన భూమా అఖిలప్రియ ఆదేశాలివ్వడం విశేషం. అనుమతులు లేని బోట్లు నదిలో తిరుగుతుంటే జలవనరుల విభాగం, పర్యాటక శాఖ కళ్లు మూసుకున్నాయనే అనుకోవాలి. 

మంత్రులు చేయించిన అర్థరాత్రి పోస్టు మార్టం

ప్రభుత్వ వైఫల్యం బైటపడటంతో మృత దేహాలకు హడావిడిగా అర్థరాత్రి పోస్టు మార్టం నిర్వహించారు. నిబంధనల ప్రకారం సాయింత్రం  దాటిన తర్వాత పోస్టు మార్టం నిర్వహించకూడదు. మంత్రులు నారాయణ, చినరాజప్ప దగ్గరుండి మరీ పోస్టుమార్టం ప్రక్రియను పర్యవేక్షించారు. వెంటనే ప్రత్యేక వాహనాల్లో మృతదేహాలను జిల్లాను దాటించేసారు. బంధువులు వచ్చి, పంచనామా జరక్కుండానే అర్థంతరంగా మంత్రులు దగ్గరుండి ఈ పని చేసింది ప్రజలు ఆందోళన చేస్తారనే భయంతోనే. 
ప్రైవేటు బోటు ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా కృష్ణా నదిలో బోట్లు నడుపుకుంటున్నారు. ఇప్పుడు ప్రమాదం జరిగిన బోటుకు సైతం పవిత్ర సంగమం వద్దకు వెళ్లేందుకు అనుమతి లేదని అధికారులు చెబుతున్నారు. లైసెన్స్ ఇచ్చేమందు జలవనరులు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖల అనుమతులు తీసుకోవడం లేదు. తగిన భద్రతా ప్రమాణాలు పాటించడం లేదు. అయినా ప్రభుత్వం, అధికారులు నిర్లక్ష్యంగా ఉండటమే కానీ, వీరిపై చర్యలు తీసుకున్నదాఖలాలు లేవు. పర్యాటక శాఖను అభివృద్ధి చేస్తానంటూ డప్పాలు కొట్టే చంద్రబాబు, ప్రమాణాల విషయాన్ని మాత్రం గాలికొదిలేసారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న బోట్లపై విజిలెన్స్ అధికారులు దాడులు చేసి సీజ్ చేసినా, ప్రభుత్వ పెద్దలే ఆ నివేదికలను పట్టించుకోకుండా, సీజ్ చేసిన బోట్లను వదిలేసారు. ఆ తర్వాత సరైన ప్రమాణాలను పరిశీలించకుండానే చాలా బోట్లకు అనుమతులిచ్చేసారు. పర్యాటక శాఖ కంటే ప్రైవేటు ఆపరేటర్లకే లబ్ది చేకూరేలా నేతలు కొందరు చక్రం తిప్పారు. ఇవన్నీ కలిసి నేడు ఇంతమంది ప్రాణాలను బలితీసుకునేందుకు కారణమయ్యాయి. పడవ ప్రమాదం జరిగినందున కృష్ణా నదికి సోమ, మంగళ వారాల్లో హారతిని రద్దు చేసారు. నిజానికి రద్దు చేయాల్సింది అధికారుల అలసత్వాన్ని, దాన్ని పెంచి పోషిస్తున్న పాలకుల నిర్లక్ష్యాన్నీ. 
Back to Top