క‌న్నీళ్ల క‌డ‌లిలో కౌలు రైతు

– ప్రతి 30 గంటలకు ఓ కౌలు రైతు ఆత్మహత్య
– రెండు నెలల వ్యవధిలో 43 మరణాలు 
– వాస్తవ సాగుదారులు కౌలుదారులే

రాష్ట్రంలో ప్రతి 30 గంటలకు ఓ కౌలు రైతు ఉరికొయ్యకు వేళ్లాడుతున్నాడు. రెండు నెలల వ్యవధిలో 43 మంది చనిపోయారంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్‌ 24 వరకు 23 మంది చనిపోతే ఆ తర్వాత రోజు నుంచి ఇప్పటికి అంటే అక్టోబర్‌ 31 నాటికి మరో 20 మంది చనిపోయారు. ఇవి కేవలం దినపత్రికల్లో వచ్చిన వివరాల మేరకే. ఇక నమోదు కానివి, మారుమూల ప్రాంతాల్లో ముగిసిపోయే జీవితాలు మరెన్నో...

సంక్షోభంలో వ్యవసాయ రంగం
వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉంది. ప్రభుత్వ సర్వేల ప్రకారమే రాష్ట్రంలోని 93 శాతం మంది రైతులు రుణగ్రహీతలుగా ఉన్నారు. సగం మంది రైతులకు కూడా సంస్థాగత రుణాలు అందడం లేదు. రాష్ట్రంలో గ్రామీణ జీవితం భూమితో ముడిపడి ఉంది. ఇప్పటికీ 63 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తి ప్రధానంగా సాంకేతికం, వ్యవస్థాగతం అనే రెండు అంశాలపై ఆధారపడి ఉంది. కౌల్దారీ వ్యవస్థ రెండో రకానికి చెందినది. వ్యవసాయ రంగంలో 1991 తర్వాత విధానపరమైన మార్పులు అనేకం చోటు చేసుకున్నాయి. భూములపై సరిపడా ఆదాయం రాకపోవడం, భూమి ఆర్థికంగా గిట్టుబాటు కాకపోవడంతో భూస్వాములు క్రమంగా తమ భూముల్ని కౌలుకు ఇచ్చి పట్టణాల బాట పట్టారు. కొన్ని ప్రాంతాల్లో సొంత భూమి ఉన్న రైతులకు పంటల్ని సాగు చేయడం కష్టతరమైంది. అప్పటివరకు భూస్వాముల పొలాల్లో పని చేసిన కూలీలు సైతం సొంత భూమి కోసం ఆరాటపడ్డారు. ఈ పరిస్థితిని గమనించిన భూ యజమానులు తమ పొలాన్ని కౌలుకు, పాలికి ఇవ్వడం ప్రారంభించారు. 

24 లక్షలకు పైగా కౌలు రైతులు 
దేశంలో ప్రస్తుతం ఉన్న 9 కోట్ల రైతు కమతాల్లో 10 శాతానికిపైగా కౌలు రైతుల చేతుల్లో ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. కానీ వాస్తవంగా 34 శాతం వరకు కౌలు రైతుల చేతుల్లో ఉన్నట్టు అనధికార వర్గాల సమాచారం. జాతీయ నమూనా సర్వే ప్రకారం రాష్ట్రంలోని ప్రస్తుత సాగుదార్లలో 70 శాతం మంది కౌలుదారులు. వీరిలోనూ అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన తరగతుల వారే. తాజా అధికారిక లెక్కల ప్రకారం రాష్ట్రంలో సుమారు 17 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. కానీ, 24 లక్షల మంది ఉన్నట్టు రైతు సంఘాల అంచనా. (వాస్తవానికి వీరి సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది. ఎకరం.. రెండెకరాల భూమి ఉన్న రైతులు మరో రెండు మూడు ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నారు. వీరిని కౌలు రైతులుగా గుర్తించడం లేదు) భూ అధీకృత చట్టం ప్రకారం రైతులకు కౌలు రైతులకు రుణ అర్హత గుర్తింపు కార్డులు ఇవ్వాలి. ఆ కార్డు ఉన్న వారికి బ్యాంకులు రుణాలు ఇవ్వాలి. ఇతర ప్రభుత్వ పథకాలు, రాయితీలు ఇవ్వాలి. కానీ అవేవీ ఇప్పటికీ అమలు కావడం లేదు. గత ఏడాది 11 లక్షల మంది కౌలు రైతులకు రుణ అర్హత పత్రాలు ఇస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అందులో సగం కూడా ఇవ్వలేదు. 2016–17లో రూ.80 వేల కోట్ల పంట రుణాలలో 80 వేల మంది కౌలు రైతులకు కేవలం రూ.202 కోట్ల రుణం మాత్రమే ఇచ్చారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 

సగం మందికి పైగా సన్న, చిన్నకారు రైతులే
సాగు కమతాల విస్తీర్ణంపై వ్యవసాయ ఉత్పత్తి ఆధారపడి ఉంటుంది. 2011 లెక్కల ప్రకారం రాష్ట్రంలో సగటున రైతుకున్న భూమి 1.06 హెక్టార్లు (సగటు సాగు విస్తీర్ణం 2.64 హెక్టార్లు). 70 శాతానికి పైగా గ్రామీణ ప్రజలు వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నారు. రాష్ట్రంలో మొత్తం 76.21 లక్షల మంది రైతులున్నారనుకుంటే వారిలో 49,83,611 మంది సన్నకారు రైతులు. 15,91,112 మంది చిన్నకారు, 7,96,198 మంది ఓ మోస్తరు మధ్యతరహా రైతులు. మధ్యతరహా 2,30,419 మంది కాగా, 19,878 మంది పెద్ద రైతులు ఉన్నారు. సాగు పరంగా చూస్తే సన్నకారు రైతుల చేతిలో 26.68 శాతం భూమి, చిన్నకారు రైతుల చేతుల్లో 27.80 శాతం, ఓ మోస్తరు మధ్య తరహా రైతుల చేతిలో 25.93 శాతం, మధ్యతరహా రైతుల చేతిలో 15.83 శాతం, పెద్ద రైతుల చేతిలో 3.75 శాతం భూమి ఉన్నట్టు అంచనా. ఈ లెక్కన రాష్ట్రంలో 66 శాతం భూమిని సన్నకారు రైతులే సాగు చేస్తున్నారు.

ఆగని ఆత్మహత్యల పరంపర
కౌలు రైతుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. సెప్టెంబర్‌ 25 నుంచి అక్టోబర్‌ 31 వరకు కన్నుమూసిన రైతుల వివరాలను చూస్తే కర్నూలు జిల్లా ముందుంది. ఈ జిల్లాలో 8 మంది చనిపోతే గుంటూరు జిల్లాలో ఆరుగురు ఉన్నారు. అనంతపురం జిల్లాలో ముగ్గురు, ప్రకాశం, వైయస్సార్, కృష్ణా జిల్లాలో ఒక్కొక్కరు మరణించారు. ఖరీఫ్‌ పంటలు చేతికి రాకముందే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనన్న భయాందోళనలను రైతు సంఘాలు వ్యక్తం చేస్తున్నాయి. 

కౌలు రైతుల డిమాండ్లు
– 2011 కౌల్దారి చట్టం ప్రకారం కౌలురైతులకు రుణ అర్హత పత్రాలు ఇవ్వాలి. 
– స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ ప్రకారం వడ్డీలేని పంట రుణం లక్ష రూపాయలు ఇవ్వాలి
– ప్రభుత్వం చేసిన వాగ్దానం మేరకు కౌలు రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయాలి
– పంటల బీమా పథకం కింద కౌలు రైతులు చెల్లించే బీమా ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించాలి
– ఈ–క్రాప్‌ బుకింగ్‌లో కౌలురైతుల పేర్లను నమోదు చేయాలి
– ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు నష్టపరిహారం ఇచ్చేందుకు ఉద్దేశించిన ప్రక్రియను సులభతరం చేయాలి
– స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసు ప్రకారం గిట్టుబాటు ధర కల్పించాలి. ధరల స్థిరీకరణకు నిధులు కేటాయించాలి

తాజా వీడియోలు

Back to Top