దీదీకీ దాదాగిరి!

గత మూడు దశాబ్దాలుగా దీదీ ఏ తరహా పాలన పద్ధతిని వ్యతిరేకించిందో, తాను అదే మార్గాన్ని అనుసరిస్తు ఇప్పుడామె చరిత్రకెక్కుతోందిఏ నీటిలో పెరిగిన చేప ఆ వాసనే వేస్తుందంటారు. ఇది పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బనర్జీ (దీదీ)కి అతికినట్లు సరిపోయే సామెత! ఆమెకి ఊహ తెలిసిన నాటికే బంగాల్‌లో సీపీఎం కర్రపెత్తనం మొదలయిపోయింది. ఆ పెత్తనాన్ని ఆమె ప్రశ్నించడంతో ఆగక, దాన్ని పడగొట్టి సెబాసనిపించుకుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిభావంతులయిన వందమంది వ్యక్తుల్లో దీదీని కూడా ఒకరిగా గుర్తించింది టైమ్ మ్యాగజీన్.. 34 సంవత్సరాల పాటు బంగాల్‌లో సాగిన వామపక్ష కూటమి పాలనను -కిందటేడాది- నేలకూల్చి దీదీ చరిత్రకెక్కిన విషయం అందరికీ తెలిసిందే.1998 డిసెంబర్ 11న దీదీ పార్లమెంట్ చరిత్రలో కొత్త అధ్యాయం రచించారు. మహిళా బిల్లుకు సైంధవుడిలా అడ్డు తగుల్తున్న సమాజ్‌వాదీ ఎంపీ -దారోగా ప్రసాద్ సరోజ్- కాలర్ పట్టి బయటికీడ్చి రాయల్ బంగాల్ టైగ్రెస్ అనిపించుకున్నారు మమత. సింగూరు నుంచి టాటాకార్ల పరిశ్రమను తరిమికొట్టినందుకూ, నందిగ్రామ్ సైజ్‌కు వ్యతిరేకంగా ఉద్యమించినందుకూ, రైల్వే టికెట్ చార్జ్‌లు పెంచినందుకు తన పార్టీకే చెందిన మంత్రి దినేశ్ ద్వివేదీని పదభ్రష్టుడిని చేసినందుకూ దీదీ చరితార్థ అనిపించుకుంది. ఇప్పుడు మరొకందుకు ఆమె ‘చరితార్థ’ (?) అనిపించుకుంటున్నారు! ఈ సారి ఏదో ఘన విజయం సాధించినందుకో, కొత్త రికార్డు స్థాపించినందుకో కాదు- గత మూడు దశాబ్దాలుగా దీదీ ఏ తరహా పాలన పద్ధతిని తీవ్రంగా వ్యతిరేకించిందో, తాను అదే మార్గాన్ని అనుసరించడం ద్వారా ఇప్పుడామె చరిత్రకెక్కుతోంది. అయినా, ఏదోరకంగా జనస్మృతిలో నిలిచిపోవడం ముఖ్యం కానీ, మంచి పనులు చేసి మాత్రమే చరిత్రలో నిలబడిపోవాలని షరతు విధిస్తే కష్టం!ఇంతకీ ఇప్పుడు తాజాగా దీదీ మళ్లీ అందరి దృష్టినీ ఆకర్షించడానికి కారణమేమిటి?
తానియా భరద్వాజ్ అనే విద్యార్థిని -ప్రెసిడెన్సీ యూనివర్సిటీలో చదువుకునే యువతి- దీదీని ఇబ్బందికరమయిన ప్రశ్న వేసింది. ఆమె మంత్రివర్గంలోని కొందరు వ్యక్తుల ‘చరిత్ర’ గురించి తానియా బహిరంగంగానే ప్రశ్నించింది. అది కూడా ఓ జాతీయ మీడియా చానెల్ కార్యక్రమంలో పాల్గొంటూ! అంతే- ఆమెకి దీదీ ఓ యోగ్యతా పత్రం దానం చేసేశారు. ‘నువ్వో మావోయిస్టువి- నీ మైకు తీసి నిర్వాహకులకిచ్చేసి బయటికి పో!’ అని గర్జించింది మన దీదీ. బంగాల్ షేర్నీ అనిపించుకున్న నేత్రిని పదిమందిలో నిలదీయడమా? ఇదే పని ఇంతే బహిరంగంగా చేశారు శీలాదిత్య చౌదరీ అనే రైతు. పశ్చిమ బంగాల్‌లోని బేల్ పహాడీ అనే చోట దీదీ ఓ బహిరంగ సభలో ప్రసంగించారు. ఆమె ఉపన్యాస ధారకు శీలాదిత్యుడు అడ్డుపడి, రైతు సమస్యలు ఇప్పటికీ అపరిష్కృతంగానే పడిఉన్నాయని వ్యాఖ్యానించాడు. మన దీదీ ఊరుకుంటుందా? అతగాడికి కూడా -బహు ఉదారంగా- మవోయిస్టు బిరుదం ప్రసాదించేసింది. వీళ్లిద్దరి కన్నా ముందే, జాదవ్‌పూర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అంబికేశ్ మహాపాత్ర అనే అత ను దీదీ కార్టూన్లు పదిమందితో షేర్ చేసిన పాపానికి అతన్ని సైతం మావోయిస్టును చేసేశారు మమతా బనర్జీ. సీపీఎం ఏకచ్ఛత్రాధిపత్యాన్ని అలవోకగా కూల్చేసిన దీదీకి రాజకీయాలు పెద్దగా తెలియవని అనడానికి సాహసం చాలడం లేదు. కానీ, రాజకీయాలు తెలిసిన వాళ్లెవరూ మావోయిస్టులను ‘సీపీఎం క్యాడర్’గా పొరబాటు పడలేరు. కానీ, పైన చెప్పిన ముగ్గురి విషయంలోనూ దీదీ అదేపని చేశారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి?ఎలా అర్థం చేసుకోవాలంటే-తానియాగానీ, శీలాదిత్య చౌదరీగానీ, ప్రొ. మహాపాత్ర గానీ అటు మావోయిస్టులూ కారు- ఇటు సీపీఎం క్యాడరూ కారు! వాళ్ల నేరం ఒక్కటే- మమతా దీదీ వంక వేలెత్తి చూపించడమే! అలాంటి నేరస్తులను దీదీ ఏ తిట్టయినా తిడుతుంది- ఏ చర్యయినా తీసుకుంటుంది. నిజానికి ఇంతవరకూ ఆమె కఠిన చర్యలేమీ తలపెట్టలేదు- సంతోషించాలి. దీదీ పుట్టిన కాలంలో -1950, 54 సంవత్సరాల మధ్యన- అమెరికాలో మెకార్థీయిజం అనే హిస్టీరియా రాజ్యమేలింది. ప్రస్తుతం దీదీ పాలనలో అదే జాడ్యం పాకిపోతోందని ప్రొఫెసర్ బదరీ రైనా అనే మేధావి వ్యాఖ్యానించారు. మెకార్థీయిజం ప్రబలిన రోజుల్లో చార్లీ చాప్లిన్, బెర్తోల్ బ్రెష్ట్, ఆర్థర్ మిల్లర్, పాల్ రాబ్సన్ తదితర మేధావులూ కళాకారులూ ఎలాంటి వేధింపులకు గురయ్యారో ప్రొఫెసర్‌గారు చెప్పుకొచ్చారు.
ఆయన చెప్పని విషయం మరొకటుంది. చరిత్ర మెకార్థీయిజాన్ని అసహ్యించుకుంది. ప్రజాస్వామ్య వ్యవస్థకు ఇలాంటి జాడ్యాలు తగని శత్రువులని తలకాయ ఉన్నవారంతా ఏదో ఓ సందర్భంలో చెప్తూనే వచ్చారు. అలాంటి మంచిమాటలు దీదీ చెవినపడకపోవడం మన ప్రజాస్వామ్యం దురదృష్టం.
నిజానికి బంగాల్ తక్కువ నోములు నోచుకున్నట్లుంది. సీపీఎం గుత్తపెత్తనంలో బంగాలీలు కనీస పౌరహక్కులకు కూడా నోచుకోకుండా అలమటించారు. వాడవాడనా కార్యకర్తల పేరిట పార్టీ ప్రమథగణాలు పుట్టుకొచ్చి చట్టాన్నీ న్యాయాన్నీ నిలువులోతున పూడ్చేశారు. కొన్ని ఎన్జీవోల లెక్క ప్రకారం జ్యోతి బసు హయాంలో ఒక్క ఎన్నికలో కూడా ప్రజాభిప్రాయం ప్రతిఫలించలేదు. అలాంటి సీపీఎం మీద తిరగబడిన దీదీ ఏదో ఒరగదోస్తుందనుకుంటే, పెనం మీంచి పొయ్యిలో పడిన అనుభవం జనానికి దయచేయించింది మమతా దీ. ఈ ధోరణి మార్చుకోకపోతే, చరిత్ర దీదీని క్షమించదు!

 
Back to Top