ద‌ర్యాప్తు జ‌రుగ‌దు..నిజా నిర్ధార‌ణ తేల‌దు


- నాలుగున్న‌రేళ్ల పాల‌న‌లో లెక్క‌లేన‌ని త‌ప్పులు
- చేసేది టీడీపీ నేత‌లు..నింద‌లు ప్ర‌తిప‌క్షంపై
- ఒక్క ఘ‌ట‌న‌పై కూడా ఇంత‌వ‌ర‌కు పూర్తి కాని ద‌ర్యాప్తు
- వైయ‌స్ జ‌గ‌న్‌పై జ‌రిగిన హ‌త్యాయ‌త్నం కేసును నీరు గార్చేందుకు కుట్ర‌
- అంతా రాజ‌కీయ వ్యాపారాల దందా
అమ‌రావ‌తి:  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో రోజురోజుకు నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. అధికార పార్టీ నేత‌ల ఆగ‌డాల‌కు అడ్డు అదుపు లేకుండా పోయింది. ప్ర‌తిప‌క్ష పార్టీపై క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతూ ఎదురు వ‌చ్చిన వారిని అంత‌మొందించ‌డ‌మే ల‌క్ష్యంగా హ‌త్యా రాజ‌కీయాల‌కు చంద్ర‌బాబు తెర లేపారు. టీడీపీ నాలుగున్న‌రేళ్ల పాల‌న‌లో లెక్క‌లేన‌ని త‌ప్పులు జ‌రిగాయి. ఎంతో మంది అమాయ‌కుల ప్రాణాల‌ను బ‌లిగొన్నారు. ఎంత పెద్ద నేరం జ‌రిగినా ఎలాంటి విచార‌ణ జ‌రుగ‌కుండానే ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉన్న వ్య‌క్తి ప్ర‌తిప‌క్షంపై ఆరోప‌ణ‌లు చేయ‌డం, ఆ త‌రువాత ఒక్క కేసుపై కూడా విచార‌ణ చేయించి నిందితుల‌ను ప‌ట్టుకున్న దాఖ‌లాలు ఇంత‌వ‌ర‌కు క‌నిపించ‌లేదు. టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన మొద‌టి ఏడాడే రిషితేశ్వ‌రి అనే విద్యార్థిని ర్యాగింగ్ భూతానికి గురైతే ఇంత‌వ‌ర‌కు నిందితుల‌కు ఎలాంటి శిక్ష ప‌డ‌లేదు. ఇసుక మాఫియాను అడ్డుకుంద‌న్న నెపంతో మ‌హిళా త‌హశీల్దార్ వ‌న‌జాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింత‌మ‌నేని ప్ర‌భాక‌ర్ జుట్టుప‌ట్టుకుని ఈడ్చికెళ్లాడు. ఇదే ఎమ్మెల్యే ఎంతో మంది ప్ర‌భుత్వ అధికారుల‌ను, చివ‌ర‌కు పోలీసుల‌పై కూడా దాడి చేసినా, దౌర్జ‌న్యానికి దిగినా ఎలాంటి కేసులు ఉండ‌వు. బ‌ల‌వంతంగా భూములు లాక్కున్న ప‌చ్చ నేత‌ల‌పై కేసులు అస‌లే ఉండ‌వు. కాల్‌మ‌నీ సెక్స్ రాకెట్ కేసులో టీడీపీ నేత‌ల ప్ర‌మేయం ఉంద‌ని తేలినా కూడా ఎలాంటి చ‌ర్య‌లు లేవు. ఏకంగా చంద్ర‌బాబు త‌న ప‌బ్లిసిటి పిచ్చి కోసం గోదావ‌రి పుష్క‌రాల్లో షూటింగ్ కోసం పుష్క‌ర‌ఘాట్‌లో స్నానానికి వ‌చ్చిన భ‌క్తుల‌ను నిలిపివేయ‌డంతో అక్క‌డ జ‌రిగిన తొక్కిస‌లాట‌లో 29 మంది అమాయ‌కులు ప్రాణాలు కోల్పొతే ఆ త‌ప్పంతా భ‌క్తులు, మీడియాదేన‌ట‌. ఇసుక మాఫియా కోసం అడ్డంగా కృష్ణాన‌దిలో త‌వ్వ‌కాలు చేప‌ట్టిన కార‌ణంగా కృష్ణా పుర‌ష్క‌రాల్లో స్నానానికి వెళ్లిన ఐదుగురు యువ‌కులు గుంత‌లో ప‌డి మృత్యువాత ప‌డితే ఎలాంటి కేసులు ఉండ‌వ్‌. టీడీపీ ఎంపీ జేసీ దివాక‌ర్‌రెడ్డికి చెందిన ట్రావెల్ బ‌స్సు గుంటూరు జిల్లాలో బోల్తా ప‌డి 11 మంది చ‌నిపోతే ఎలాంటి కేసులు లేవు. రాజ‌ధాని కోసం భూములు ఇవ్వ‌లేద‌ని రైతుల చెరుకు, అర‌టి తోట‌లు టీడీపీ నేత‌లు అంటిస్తే ఆ నెపం ప్ర‌తిప‌క్ష పార్టీపై నెట్టి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేశారు. ఈ కేసుపై విచార‌ణ చేప‌ట్టి ఇంత‌వ‌ర‌కు నిందితుల‌ను గుర్తించ‌లేక‌పోయారు.

భూ క‌బ్జాలు..మ‌హిళ‌ల‌పై వేధింపులు
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో టీడీపీ ఎమ్మెల్సీ దీప‌క్‌రెడ్డి విలువైన భూములు క‌బ్జా చేశారు. ఆసిఫ్‌నగర్‌తోపాటు పలు ప్రాంతాల్లో ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించి వందల కోట్ల విలువైన భూములను స్వాహా చేశారన్న ఆరోపణలతో ఆయన జైలుకు వెళ్లి వచ్చారు. జూబ్లీహిల్స్‌కు చెందిన ఒంటరి మహిళను వేధింపులకు గురి చేసిన మాజీ ఎంపీ, టీడీపీ నేత నామా నాగేశ్వర్‌రావుపై కేసు నమోదవడం సంచలనం రేపింది. మహిళను అసభ్యకరంగా ఫోన్‌లో దూషించడంతోపాటు ఇంటికి వెళ్లి దాడి చేసినట్టు ఆయనపై ఆరోపణలు వచ్చాయి.
 
ఓటుకు కోట్ల కేసులో...
ఓటుకు కోట్లు కేసులో ఏకంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆడియో, వీడియో టేపుల‌తో స‌హా దొరికిపోయినా ఇంత‌వ‌ర‌కు ఎలాంటి కేసు న‌మోదు చేయ‌లేదు. విచార‌ణ అస‌లే జ‌ర‌గ‌డం లేదు.  తెలంగాణ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు మాట్లాడిన ఆడియో వ్యవహారంపై ఏసీబీ విచారణ జరపకపోవడం విమర్శలకు తావిస్తోంది. చంద్రబాబునాయుడు మీద మూడు క్రిమినిల్ కేసులున్నాయ‌ని అసోసియేషన్ ఫర్ డెమక్రటిక్ రిఫార్మ్స్(ఏడిఆర్), ఎలక్షన్ వాచ్  అనే సంస్ధలు వెల్ల‌డించాయి. ఎన్నో అవినీతి ఆరోపణలున్న చంద్రబాబును ఎందుకు విచారించడం లేదు.  ఒక్క అవినీతి కేసుపైనైనా విచారణ జరిగితే చంద్రబాబు ఈపాటికి ఎప్పుడో జైలులో ఉండేవారు.  గ‌తంలో 9 ఏళ్లు సిఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తన హెరిటేజ్‌ సంస్థకు అక్రమంగా ఎంతో లబ్ధి చేకూర్చుకున్నా దర్యాప్తు చేయ‌లేదు.  హైదరాబాద్‌లోని టిడిపి కార్యాలయానికి భూమి కేటాయింపులో కూడా చంద్రబాబు ఎంతో అవినీతికి పాల్పడ్డారు. అప్ప‌ట్లో చీకట్లో చిదంబరాన్ని కలిసి కేసులు లేకుండా చేసుకున్నారని ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ప్ర‌తిప‌క్ష నేత‌పై దాడి..ఆపై మాట‌ల‌తో ఎదురుదాడి
చంద్ర‌బాబు ఏది చేసినా ఓ ప‌థ‌కం ప్ర‌కారం చేయ‌డం అల‌వాటు..నాడు తుని ఘ‌ట‌న‌లో రైలు త‌గుల‌బెడితే ఎలాంటి విచార‌ణ చేయ‌కుండానే అది పులివెందుల రౌడీల ప‌నే అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. రాజ‌ధాని ప్రాంతంలో పంట పొలాలు త‌గుల‌బ‌డితే క‌డ‌ప నేత‌ల ప‌ని అన్నారు. తాజాగా వైయ‌స్ జ‌గ‌న్‌పై విశాఖ ఎయిర్ పోర్టులో హ‌త్యాయ‌త్నం జ‌రిగితే వైయ‌స్ జ‌గ‌న్ అభిమాని అని, సానుభూతి కోసం ఈ దాడి చేయించుకున్నార‌ని చంద్ర‌బాబు ఆరోపించ‌డం, డీజీపీతో ఇదే విష‌యాలు చెప్పించ‌డం మ‌నం చూశాం. ప్ర‌తిప‌క్ష నేత‌పై దాడి చేయ‌డం, ఆ పై టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల‌తో ఎదురుదాడి చేయించ‌డం చూశాం.  చంద్ర‌బాబు, టీడీపీ నేత‌ల ఎదురుదాడి చూస్తుంటే అస‌లు హ‌త్యా య‌త్నం జ‌రిగింది జ‌గ‌న్ పైనా లేక చంద్ర‌బాబుపైనా అని జ‌నం చ‌ర్చించుకునే ప‌రిస్థితి వ‌చ్చింది… దొంగే, దొంగ దొంగ అని అరిస్తే అయిపోతుంది క‌దా… ఇక ఎవ‌రిని ప‌ట్టుకోవాల్సిన అవ‌స‌రం లేదు. జ‌గ‌న్ మీద హ‌త్యా య‌త్నం జ‌రిగాక చంద్ర‌బాబు మాట్లాడిన తీరు చూస్తే ఏపీ జ‌నానికి రోత పుడుతోంది… అదంతా డ్రామా అన్న‌ట్టు మాట్లాడ‌డం, కేంద్రం చేయించింది అన‌డం, హేళ‌న చేయ‌డం, వెకిలిగా న‌వ్వుతూ మాట్లాడ‌డం…. నిండు చంద్రుడిలో ఇన్నివికృత కోణాలు చూసిన ఏపీ జ‌నం అవాక్క‌యిపోతున్నారు…. మ‌రోవైపు త‌న‌పై దాడి జ‌రిగినా జ‌గ‌న్ ఎంతో హుందాగా ప్ర‌వ‌ర్తించారు… ఆయ‌న ఒక్క మాట కూడా మాట్లాడ‌లేదు, జ‌నాన్ని రెచ్చ‌గొట్ట‌లేదు, సానుభూతితో ఓట్లు రాల్చుకునే ప్ర‌య‌త్నం చేయ‌లేదు… ప‌దేళ్ల రాజ‌కీయ అనుభ‌వం ఉన్న యువ‌నేత ముందు 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ ఓడిపోయి త‌ల‌దించుకోవ‌డం ఇవాళ తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు ప్ర‌త్య‌క్షంగా చూశారు… జ‌గ‌న్‌పై హ‌త్యా య‌త్నం, ఆ త‌ర్వాత ఎదురుదాడి రూపంలో టీడీపీ బెదురుదాడి ఇదంతా చూస్తుంటే క‌చ్చితంగా చాలా పెద్ద కుట్ర, పెద్ద త‌ల‌కాయ‌లు దీనివెన‌క ఉన్నాయ‌ని స్ప‌ష్టం అవుతోంది 

Back to Top