ఉద్యోగాలు ఉత్తిమాటే..!

  • ఎన్నిక‌ల ముందు బాబొస్తే జాబొస్తుందని ప్ర‌చారం
  • టీడీపీ అధికారంలోకి వ‌చ్చి మూడేళ్లు అవుతున్నా ఉద్యోగాల ఊసే లేదు 
  • ఉన్న ఉద్యోగాల‌కు ఎస‌రు
  • కొత్త నోటిఫికేష‌న్ల జాడే లేదు
  • నిరుద్యోగుల జీవితాల‌తో టీడీపీ స‌ర్కార్ చెల‌గాటం
విజ‌య‌వాడ‌:  2014 ఎన్నికల సందర్భంగా ’బాబొస్తే జాబొస్తుంది‘ అంటూ తెలుగుదేశం పార్టీ చేసిన ప్రచారం అంతా ఇంతా కాదు. "జాబు కావాలంటే.. బాబు రావాలి" అనే స్లోగన్ తెలుగుదేశం పార్టీ విజయానికి ఎంతో దోహదం చేసింది. ఎందరో నిరుద్యోగ యువత, విద్యార్ధులు తెలుగుదేశం పార్టీ గెలుపున‌కు కృషి చేశారు.  తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో లో కూడా సంవత్సరానికి లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని వాగ్దానం కూడా చేసింది. ఇంటికో జాబు ఇస్తామ‌ని, ఉద్యోగం వ‌చ్చే వ‌ర‌కు నెల‌కు రూ.2 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామ‌ని చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న కుమారుడు లోకేష్‌ను మాత్రం అడ్డ‌దారిలో ఎమ్మెల్సీగా ఎన్నిక చేసి, ఆ త‌రువాత మంత్రిగా కూర్చోబెట్టారు త‌ప్పా, ఏ ఒక్క‌రికి కూడా ఉద్యోగం ఇవ్వ‌లేదు. ఇప్పటికే అనేక ప్రభుత్వ శాఖల్లో వేలాదిగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. నిరుద్యోగ యువత ఉద్యోగ భర్తీ ప్రకటనల కోసం నిరుద్యోగులు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం అనేక విభాగాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.  నిరుద్యోగులు, ఆశావాహుల సంఖ్యా రోజు రోజుకు పెరిగి పోతూనే ఉంది.  

న‌మ్మి ఓట్లు వేస్తే..
రాష్ట్ర విభ‌జ‌న‌తో ఆర్ధిక లోటుతో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు  ముఖ్య మంత్రి అయితేనే మంచి జరుగుతుందని, ఆయన అయితేనే అధ్బుతాలు చేయగలడని, ఆయన గొప్ప పాలనా దక్షుడని ప్రచారంలో తెలుగుదేశం శ్రేణులు, చంద్రబాబు నాయుడు పదే, పదే ప్ర‌చారం చేశారు. అలా చెప్పిన మాటలు ప్రజలు కూడా నమ్మి ఓట్లు వేశారు. అధికారంలోకి వ‌చ్చాక ఆ మాట‌లేవి చంద్ర‌బాబుకు గుర్తు లేవు.  ప్రజలకు ఎన్నికల వాగ్దానాలలో ఆశలు కల్పించి, యేరు దాటాక తెప్ప తగలేసే కార్యక్రమాలు చేపట్టారు. రుణ‌మాఫీకి నిబంధ‌న‌లు పెట్టి అన్న‌దాత‌ల‌కు అన్యాయం చేశారు. డ్వాక్రా మ‌హిళ‌ల రుణాలు ర‌ద్దు చేస్తాన‌ని హామీ ఇచ్చి ద‌గా చేశారు. ఇంటికో ఉద్యోగం అన్న హామీని గాలికొదిలారు. నెల‌కు రూ.2 వేల నిరుద్యోగ భృతి హామీకి మంగ‌ళం పాడారు. ఇలాంటి ఎన్నో హామీల‌ను విస్మ‌రించి చంద్ర‌బాబు అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను వంచించారు.  రూ. 2 వేల చొప్పున ఒక్కో కుటుంబానికి రూ. దాదాపు 70 వేలు చెల్లించాల్సివుంది. రాష్ట్రంలో ఉన్న 1 కోటీ 75 లక్షల కుటుంబాలకు ఒక లక్షా 25 వేల కోట్ల రూపాయలు బకాయి పడ్డారు.

తండ్రిని మించిన త‌న‌యుడు లోకేష్‌
ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు క‌ళ్లు ఆర్ప‌కుండా అబ‌ద్ధాలు చెబుతారనే ప్ర‌చారం ఉంది. సీఎం కుమారుడు, రాష్ట్ర ఐటీ, పంచాయ‌తీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ సెల్ఫ్‌ ప్రమోషన్‌లో తండ్రి చంద్రబాబు కంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివినట్టుగా ఉన్నారు. మంత్రి  అయిన వారానికే  రాష్ట్ర అభివృద్ధిలోభాగంగా తాను నిద్రలేని రాత్రులు గడుపుతున్నానని చెప్పారు. ఐటీ కంపెనీల‌తో ఒప్పందం కుదిరింద‌ని గొప్ప‌లు చెప్పారు. తాను వంద రోజుల కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తున్నానని, ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఐటీ రంగానికి పెద్దదిక్కుగా ఉన్న విశాఖ ప్రస్తుతం భవిష్యత్తు ప్రయాణం ఎటో తేల్చుకోలేకపోతోంది. నగరాన్ని ఐటీ రాజధానిగా తీర్చుదిద్దుతామని చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో స్పష్టత ఇవ్వకపోవడంతో కంపెనీలు గందరగోళానికి గురవు తున్నాయి. ఒకపక్క సమస్యలతో మనుగడ కష్టంగా మారగా, మరోపక్క పభుత్వం మొక్కుబడి వ్యవహారంతో అయోమయానికి గురవుతున్నాయి. కంపెనీల విస్తరణ, ఉద్యోగ నియామకాల విషయంలో ముందడుగు వేయడానికి సంశయిస్తున్నాయి. ఉన్న సంక్షోభ పరిస్థితులు చక్కదిద్దకుండా హడావుడి చేస్తుండడంతో మొదట్లో కాస్తోకూస్తో ఆశగా ఉన్న యాజమాన్యాలు క్రమక్రమంగా నిరుత్సాహానికి లోనవుతున్నాయి. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఉద్యోగాల ఎక్క‌డి నుంచి వ‌స్తాయ‌ని నిరుద్యోగులు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

తెలంగాణ‌లో ఎలా సాధ్య‌మ‌వుతోంది..
ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం దూసుకెళ్తోంది.  2015-16 వార్షిక నివేదిక ప్ర‌కారం ఐటీ,  ఐటీఈఎస్ ఎగుమతుల్లో తెలంగాణ సుమారు 13.26 శాతం వృద్ధి రేటు సాధించింది. అదే జాతీయ స్థాయిలో చూస్తే ఇది కేవలం 12.3 శాతం. గతేడాది హైదరాబాద్‌లో దాదాపు 35,611 సాఫ్ట్ వేర్ నిపుణులకు ఉద్యోగావకాశాల్ని కల్పించింది. దీంతో, తెలంగాణ ఐటీ రంగంలో సుమారు రూ.4,07,385 మంది పని చేస్తున్నట్లు సమాచారం. ఐటీ శాఖ గతేడాది మూడు భారీ ఈవెంట్లను నిర్వహించింది. ఏప్రిల్లో హెచ్ఐసీసీలో జరిగిన కార్యక్రమంలో ఐటీ పాలసీని ఆవిష్కరించారు. జూన్ 2 తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ నాలెడ్జి (టాస్క్)ని ఏర్పాటు చేసింది. మరో ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, దేశీయ పారిశ్రామిక దిగ్గజమైన రతన్ టాటాలు కలిసి టీ-హబ్ ను ఆరంభించారు. థాంప్సన్ ఎలక్ట్రానిక్స్, సెల్ కాన్, మైక్రోమ్యాక్స్ వంటివి తెలంగాణలో ప్రప్రథమంగా తమ ఉత్పత్తి కేంద్రాలను ఆరంభించాయి. ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆ శాఖ అభివృద్ధికి విశేష కృషి చేస్తుండ‌గా, ఏపీలో ఐటీ మంత్రిగా ఉన్న నారా లోకేష్ పూర్తిగా వెనుక‌బ‌డ్డారు. 

ఇంకెన్నాళ్లు
టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన నాటి నుంచి మూడేళ్ల పాటు అదిగో ఉద్యోగాలు..ఇదిగో నిరుద్యోగ భృతి అంటూ కాల‌యాప‌న చేస్తూ వ‌చ్చారు. ఇక ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర స‌మ‌యం ఉంది. ఈ లోగా ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తారు, ఎన్ని కుటుంబాల‌కు నిరుద్యోగ భృతి చెల్లిస్తార‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. చంద్ర‌బాబు ఎక్క‌డికి వెళ్లినా, రాష్ట్రంలో ఎవ‌రు ఏ ఘ‌న‌త సాధించిన అదంతా త‌న ఘ‌న‌తే అని చంద్ర‌బాబు చెప్పుకుంటుంటారు. ఏకంగా ఏపీలో ఒలింపిక్స్ నిర్వ‌హిస్తామ‌ని, క్రీడాకారుల‌కు నోబెల్ బ‌హుమ‌తులు ఇప్పిస్తామ‌ని గొప్ప‌లు చెప్పుకోవ‌డం బాగా అల‌వాటైంది. నోబెల్ బ‌హుమ‌తులు సాధిస్తే రూ.100 కోట్లు ఇస్తామ‌ని బ‌డాయి చెప్ప‌డం త‌ప్పా, ఏ ఒక్క‌రికి ఉద్యోగం ఇవ్వ‌డం లేదు. ఇక ఆయ‌న పుత్ర‌ర‌త్నం నారా లోకేష్‌కు జ‌యంతికి, వ‌ర్ధంతికి తేడా తెలియ‌డం లేదు. ఈయ‌న ఐటీలో ఉపాధి క‌ల్పిస్తామ‌ని ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతూ కాలం వెల్ల‌దీస్తున్నారు. ఇంకెన్నాళ్లు ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తారు. మీకు గుణ‌పాఠం చెప్పే రోజులు ద‌గ్గ‌ర్లోనే ఉన్నాయ‌న్న ప‌చ్చి నిజం. 
Back to Top