పద్ధతి మార్చుకో చంద్రబాబు..!

హైదరాబాద్ః  హైదరాబాద్: తెలుగుదేశం ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థల స్ఫూర్తికి వ్యతిరేకంగా పనిచేస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ విమర్శించింది. పార్టీ ఎమ్మెల్యే ఎస్‌వి మోహన్‌రెడ్డి శనివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ రాష్ర్టప్రభుత్వం పంచాయతీ రాజ్ సంస్థలను నిర్వీర్యం చేసే చర్యలను చేపడుతోందని అన్నారు. ఎన్నికైన ప్రజా ప్రతినిధులను పక్కనపెట్టి నిర్ణయాధికారాన్ని అధికారపార్టీకి చెందిన కమిటీలకు కట్టబెడుతోందని ఆయన విమర్శించారు. గ్రామపంచాయతీ నిధులను లాక్కోవడానికి తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మోహనరెడ్డి అన్నారు. ‘‘కేంద్రప్రభుత్వం నుంచి వచ్చిన 1,774 కోట్ల రూపాయలు గ్రామపంచాయతీలు తమ విచక్షణకింద ఖర్చుపెట్టుకోవలసినవి. వాటిలో దాదాపు 500 కోట్ల రూపాయలను విద్యుత్ బకాయిల కింద రాష్ర్ట ప్రభుత్వం లాక్కుంది.’’ అని వివరించారు. ‘‘పంచాయతీ నిధుల విషయంలో సర్పంచ్‌లను, ఇతర ఎన్నికైన ప్రజా ప్రతినిధులను పక్కనబెట్టి అధికార పార్టీ పచ్చచొక్కాలతో నియమించిన జన్మభూమి కమిటీలు అధికారాన్ని చలాయిస్తున్నాయి. ప్రభుత్వ పథకాలను అమలు చేసే ప్రక్రియలో ఈ కమిటీలు అనేక అనైతిక పద్ధతులను అవలంభిస్తున్నాయి. ’’ అని ఆయన పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వ తిరోగమన విధానాలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, ఇప్పటికైనా స్థానిక సంస్థల నిధులను వాటికి బదలాయించి పంచాయితీ రాజ్ సంస్థలు సక్రమంగా నడవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజలలో వ్యతిరేకత పెరుగుతుండడాన్ని గమనించినందునే అధికార పార్టీ సాగునీటి వినియోగ సంఘాలకు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నదని ఆయన ఎద్దేవా చేశారు. 

Back to Top