చంద్రబాబు చెత్త శుద్ధి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలు వింటే కంచం అమ్మి మెట్టెలు చేయించిన చందంగా ఉంది. రాష్ట్రాన్ని ఓ పక్కన దోచుకుని తింటూ మరోపక్క ఏమేమో చేస్తున్నట్టు కలరింగ్ ఇవ్వడం బాబుకే సాధ్యం. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో చంద్రబాబు తన చెత్త శుద్ధి ప్రదర్శించారు. సంక్షేమ కార్యక్రమాలెన్నో చేస్తున్నామంటూ చెప్పుకొచ్చారు. 

చెత్తమాటలు

తడిచెత్త పొడి చెత్త వేరుగా తీసుకుని నిర్వహిస్తున్నామని డంబాలు పలికారు బాబు. ఆయనగారి మునుపు పాలనలో చెత్త విషయంపై ఎలాంటి చర్యలూ లేవు. 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత బాబు చేసిన పని దోమలపై దండయాత్ర అంటూ ఓ పర్యటన చేయడం. ఇదంతా ప్రచారంతో, ప్రకటనలతో సరిపోయింది. నేటికీ డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు రాష్ట్రాంలో స్వైర విహారం చేస్తూనే ఉన్నాయి. చెత్తను కంపోస్టుగా మార్చి గ్రామాల్లో రైతులకు అందించే కార్యక్రమాన్ని పంచాయితీలు చేపట్టమనైతే చెప్పారు గానీ అది ఎక్కడా సవ్యంగా అమలు కావడం లేదు. నిధుల కొరత, స్థలాభావమే అందుకు కారణం. 

పేడ మరకలు

బాబు ఈమధ్య రైతుల గురించి, వారు వాడే పశువుల గురించి, ఆ పశువులు వేసే పేడ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ మధ్య పశువుల దాణా, గడ్డి పేరుతో పెద్ద స్కామ్ కు తెరతీసారు చంద్రబాబు. ప్రతిపక్షాలు, ప్రజల వ్యతిరేకతతో అది కార్యరూపం దాల్చలేదు. ఇక పశువుల పేడ బట్టలకు అంటకుండా, మరకలు పడకుండా ఏర్పాట్లు చేస్తున్నాం అంటూ ప్రసంగించారు చంద్రబాబు. ఇంకానయం రైతుల కాళ్లకు మట్టి అంటకుండా ఏర్పాట్లు చేస్తామనలేదు అని ఊపిరి పీల్చుకుంటున్నారు అది విన్నవాళ్లు. 

ఫైబర్ గ్రిడ్ తో వంట చేయండి

మహిళలు పనుల్లోకి వెళ్లినప్పుడు ఇంట్లో తమ్ముళ్లు ఇంటర్నెట్ లో చూసి వంట చేయమని పిలుపునిచ్చారు చంద్రబాబు. ఆరోగ్యం, వంటలు, విద్య, వినోదం అన్నీ అందిస్తున్నామని చెప్పారు. దీపం పథకంతో చాలాచోట్ల అవకతవకలు జరగడంతో విజిలెన్స్ అధికారులు బహిరంగ విచారణలు చేపట్టారు. ఎస్సీ ఎస్టీలకు, వితంతువులకు గ్యాస్ పంపిణీ చేయాలని ఆదేశాలున్నా అన్నిచోట్లా అవి సవ్యంగా అమలు కాలేదు. కనెక్షన్లు ఉన్నావారికే మళ్లీ కనెక్షన్లు ఇవ్వడం, జన్మభూమి కమిటీ ప్రతిపాదనల్లో ప్రతిపక్ష పార్టీకు చెందిన వారికి కనెక్షన్లు అందకుండా చేయడం, ఎంపికైన వారికి కూడా నెలల తరబడి కనెక్షన్లు అందకపోవడం వంటి పాపాలతో దీపం పథకం కొండెక్కింది. 

చంద్రన్నబీమా వేస్ట్

చంద్రన్న బీమా పథకం ద్వారా అసంఘటిత కార్మికులకు 5 లక్షలు ఇస్తున్నామని డప్పు కొట్టుకున్నారు చంద్రబాబు. కానీ ఈ పథకం శుద్ధ వేస్ట్ అని ఆ పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి ఎప్పుడో ప్రకటించారు. రెండు కోట్ల మందికి పైగా అసంఘటితరంగ కార్మికులున్నారు. ఇప్పటికీ కనీసం 10లక్షల మంది కార్మికుల పేర్లు కూడా నమోదు కాలేదు. ఇక ప్రమాదం సహజ మరణాలకు ఇస్తున్నామని చెబుతున్న మొత్తం కూడా అధికార పార్టీ అండ ఉండి, పరపతి ఉపయోగించిన వారికే తప్ప సహజంగా అందరికీ దక్కడం లేదన్నది ప్రజల మాట. ప్రమాదంలో శాశ్వత వికలాంగులైన వారికి కూడా సాయం అందిస్తున్నామని చెప్పుకున్న బాబు ఏళ్ల తరబడి వైకల్యంతో బాధపడుతూ, అర్జీలు పెట్టుకున్నవారికి వికలాంగ ఫింఛన్లు ఇవ్వకుండా హింసిస్తున్న సంగతి ప్రతిపక్షనేత పాదయాత్ర సాక్షిగా బట్టబయలౌతోంది. 

రాజధానిలో మహాప్రస్థానం

మరణించిన వారికి గౌరవప్రదమైన అంత్యక్రియలు జరుపుతున్నట్టు చెబుతున్న చంద్రబాబు రాజధాని చుట్టుపక్కల, విజయవాడ ప్రాంతంలోనూ స్మశానవాటికలు చాలక ప్రజలు ఇబ్బందులు పడే విషయం విస్మరించినట్టున్నారు. 

రోడ్లు లేక అవస్థలు

సిమెంటు రోడ్లు వేసానని ప్రగల్బాలు పలికే బాబు గిరిజన గ్రామాల దుస్థితిపై మాత్రం నోరు మెదపడం లేదు. వందల కిలోమీటర్లు రోడ్లు సాంక్షన్ అయినా అక్కడ పది కిలోమీటర్ల రోడ్డు కూడా పడలేదు. ఇప్పటికీ గిరిపుత్రులు ముళ్లపొదల దారుల్లోనే ప్రయాణం చేస్తున్నారు. అత్యవసర వైద్యం అవసరమైతే రోగులను కావడిలా కట్టి మోసుకు వస్తున్న ఘటనలు కోకొల్లలు. 

మరుగుదొడ్ల నిర్మాణంలోనూ కక్కుర్తిపడ్డ తెలుగు తమ్ముళ్లు

రాష్ట్రం మొత్తంమీద సాంక్షన్ అయిన మరుగుదొడ్డలలో ఇంత వరకూ సగం కూడా పూర్తి చేయని చెత్త శుద్ధి చంద్రబాబు ప్రభుత్వానిది. ఇక చంద్రబాబుగారి సొంత జిల్లా అయిన చిత్తూరులో తెలుగు తమ్ముళ్ల మరుగుదొడ్ల అవినీతి కంపు రాష్ట్రం అంతా పాకింది. గోడలు కట్టి, పాత రేకులు వేసి, తలుపులు పెట్టి, సున్నాలు పూసి నిధులు కాజేసిన విషయం బైటకుపొక్కింది. ఒక్కో మండలంలో వందల మరుగుదొడ్ల పరిస్థితి ఇదే అని తెలుస్తోంది. అంతేకాదు ఒకే మరుగుదొడ్డిని ఫోటోలు తీసి రెండోదానిగా క్లైమ్ చేసి నిధులు జేబులో వేసుకున్న ఘటనలూ అనేకం. మధ్యవర్తులు అధికారులూ కుమ్మక్కై లక్షల రూపాయిల మరుదొడ్డి నిధులు బొక్కేసిన ఛండాలం గురించి బాబు మాటైనా మాట్లాడలేదు. చెంబుతో బైటకు వెళ్లడాన్ని శవయాత్ర అనాలన్నారు చంద్రబాబు. దానితో పాటే చంద్రబాబు పాలనకు అంతిమయాత్ర కూడా జరగబోతోందని బాబు అర్థం చేసుకుంటే మంచిది. అవినీతి కంపుతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన బాబు పరిపాలనకు ఇవి చివరి రోజులని, ఇదే ఆయన పాలనలో చివరి జన్మభూమి అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.  
Back to Top