హైదరాబాద్) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకొనే గొప్పల గురించి ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చురకలు అంటించారు. టెక్నాలజీ విషయంలో ఏ విధమైన అతిశయోక్తులు పలుకుతారో వైఎస్ జగన్ బట్టబయలు చేసేసరికి సభలో నవ్వులు విరిశాయి. కోర్ డాష్ బోర్డు అనేది తన హయంలోనే మొదలు పెట్టినట్లు చంద్రబాబు నాయుడు గొప్పలు చెబుతున్నారని, ఇంతకుముందు ప్రభుత్వాల పాలనలో లేనే లేదన్నట్లు మాట్లాడటం సరి కాదని చెప్పారు. గత ప్రభుత్వాల హయంలో కూడా ఇటువంటి ఏర్పాటు ఉండేదని, కానీ దీనికి చంద్రబాబు కోర్ డాష్ బోర్డు అనే పేరు మాత్రం పెట్టుకొన్నారని, దానికే టెక్నాలజీ మొత్తం తానే తెచ్చినట్లు చెప్పుకోవటం సరికాదని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా చంద్రబాబు వైఖరిని వైఎస్ జగన్ ఉదాహరణ పూర్వకంగా వివరించారు. ఒక సెల్ ఫోన్ తీసుకొని చంద్రబాబు నాయుడు అందులోని యాప్ లను వేలితో ఇలా ఇలా నొక్కాలని చెబుతూ ఉంటారని చెప్పారు. అటువంటప్పుడు మొబైల్ కనిపెట్టిన వ్యక్తులు లేక మొబైల్ లో యాప్ లు ఏర్పాటు చేసిన వాళ్లు గొప్పవారు అవుతారు కానీ, మొబైల్ లో యాప్ లను ఇలా ఇలా వేలితో నొక్కండి అని చెప్పిన వారు ఎలా గొప్పవారు అవుతారు అని వైఎస్ జగన్ ప్రశ్నించేసరికి సభలో నవ్వులు వెల్లివిరిశాయి.