<p style="text-align:justify">ముఖ్యమంత్రి చంద్రబాబుకి కొన్ని పనుల విషయంలో చాలా క్లారిటీ ఉంటుంది. అందులో ప్రభుత్వ ఉద్యోగాల నియామకం. గతంలో తొమ్మిదేళ్లు పరిపాలించినప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్ని భర్తీ చేయకుండా తన మార్కు పరిపాలన సాగించారు.<p style="text-align:justify">ఈ సారి ఎన్నికల్లో మాత్రం నిస్సిగ్గుగా నిరుద్యోగుల్ని లక్ష్యంగా ఎంచుకొన్నారు. ఇంటికో ఉద్యోగం కల్పిస్తానని పదే పదే హామీలు ఇచ్చారు. బాబు వస్తేనే.. జాబు వస్తుందని ఊదర గొట్టారు. దీంతో వీటిని నమ్మిన నిరుద్యోగులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఓట్లేశారు. తర్వాత కాలంలో చంద్రబాబు తన అసలు రూపాన్ని ప్రదర్శించారు.</p><p style="text-align:justify">ప్రతీ ఇంటికీ ఉద్యోగం అని చెప్పిన చంద్రబాబు ఒక్కటంటే ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదు. టీచర్ ఉద్యోగాలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒత్తిడి రావటంతో మాత్రం నోటిఫికేషన్ వేసింది. దీంతో నిరుద్యోగులంతా ఎన్నో ఆశలు పెట్టుకొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలు వస్తే తమ కష్టాలు తీరతాయని భావించారు. కానీ అలా జరగ లేదు. గత ఏడాది నవంబర్ లో నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ ఏడాది మే లో పరీక్షలు పెట్టి, జూన్ లో ఫలితాలు విడుదల చేశారు. విద్యా సంవత్సరం మొదలయ్యే నాటికి రిక్రూట్ మెంట్లు చేసేస్తామని చెప్పారు. కానీ, అక్కడితో బ్రేకులు పడ్డాయి. రోజులు, నెలలు గడుస్తున్నాయి కానీ రిక్రూట్ మెంట్ జరగలేదు. ఉద్యోగం వస్తుందో రాదో తెలీదు, వేరే ఉపాధి వెతుక్కోవాలో వద్దో తెలియదు. ఇలా లక్షల మంది నిరుద్యోగులు త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతున్నారు. </p><p style="text-align:justify">అటు విద్యార్థులకు కూడా ఉపాధ్యాయులు లేకపోవటంతో అనేక సబ్జెక్టులకు పాఠాలు చెప్పే టీచర్లు ఉండటం లేదు. దీంతో నాణ్యత లేని బోధనతో చదువుల్ని వెల్లబుచ్చుతున్నారు. దీనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. </p></p>