ప్రతిపక్షంపై బాబు కుట్రలు

– టీడీపీ నాయకుల తప్పులకు ఆధారులున్నా విచారణ ఉండదు
– బాబు చేతగానితనానికి ప్రతిపక్షంపై ఏడుపు 

మూడేళ్ల చంద్రబాబు పాలన చూస్తే ఆయన తీసుకున్న నిర్ణయాలపై సామాన్యులకు కూడా ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మైకు కనపడినప్పుడు తన కీర్తిని పెంచుకునేలా కోతలు కోయడం.. ప్రతిపక్షం మీద ప్రతీకారం తీర్చుకోవడం తప్ప మరో ధ్యాస ఉన్నట్టు కనిపించడం లేదు. నీతి నిజాయతీలకు తానే కేరాఫ్‌ అడ్రస్‌గా మైకు దొరికిన ప్రతిసారీ గొప్పలు చెప్పుకోవడంలోనే మునిగి పోయిన బాబు.. ఎంతమంది ఆయన గొప్పదనాన్ని సమర్థిస్తున్నారనేది ఆయనకీ తెలుసు. 

మూడేళ్లలో వందేళ్లకు సరిపడా ఆరోపణలు
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ మూడేళ్లలో వచ్చినన్ని ఆరోపణలు ఏ నాయకుడూ జీవిత కాలంపాటు సీఎంగా చేసినా ఎదుర్కొని ఉండరేమో. బాబు ఏ పనిచేసినా అందులో మనకు వచ్చేదెంత.. సొంత ప్రచారానికి దాన్నెలా వాడుకోవాలనే యావ తప్పితే నలుగురికైనా ఉపయోగపడే అవకాశముందా అనేది ఏనాడు పట్టించుకున్నపాపాన పోలేదు. ఓటుకు నోటు కేసులో దొరికిన నాటి నుంచి చంద్రబాబు పతనం మొదలైందని చెప్పుకోకతప్పదు. ఒక్క తప్పును కప్పి పుచ్చుకునేందుకు ఇప్పటికీ తప్పులు చేస్తూనే ఉన్నాడు.. దొరికిపోతూనే ఉన్నాడు. తాను చేయడమే కాదు..సొంత పార్టీ నేతలకు కూడా బాబు పలచనైపోయాడు. వారూ దొరికినకాడికి దోచుకునే పనిలో మునిగిపోయారు. 

విచారణకు నోచుకోని ఎన్నో కుంభకోణాలు
2014లో ముఖ్యమంత్రి అయ్యాక ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్సీ కొనుగోలుతో మొదలైన బాబు అవినీతి బాగోతం ఇప్పటికీ అప్రతిహతంగా కొనసాగుతూనే ఉంది. అమరావతికి భూమి పూజకు రూ. 400 కోట్లు ఖర్చు చేశారని ఆరోపణలు వచ్చాయి. అంతర్జాతీయ రాజధానిగా ప్రచారం చేసుకోవడానికి ఆ మాత్రం తప్పదని సెలవిచ్చారు. ఆ తర్వాత జనం అమ్మో అంత ఖర్చా అని కళ్లు తేలేయడంతో అబ్బే కేవలం రూ. 11 కోట్లు ఖర్చు చేశామని వివరణ ఇచ్చుకున్నారు. భూములు ఇవ్వడం లేదని రైతుల పొలాలు తగలబెట్టించారు. కాల్‌మనీ సెక్స్‌ రాకెట్‌ కుంభకోణంలో విజయవాడకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు దొరికితే విచారణకు ఆదేశించలేదు. ఎంతోమంది మహిళలు ధనమాన ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న పచ్చ కామాంధుల తోలు తీస్తామన్న సీపీని సెలవు మీద పంపేసి కేసును సైడ్‌ ట్రాక్‌ చేసేశారు. పుష్కరాల్లో బాబు పబ్లిసిటీ పచ్చి కారణంగా దాదాపు 30 మంది చనిపోతే దానిపై ఇంతవరకు విచారణ కొలిక్కి రాలేదు. దాని మాదరిగానే ఏర్పేడు ఘటన, దివాకర్‌ ట్రావెల్స్‌ ఘటనలో చనిపోయిన కుటుంబాలు ఆర్తనాదాలు చేస్తూనే ఉన్నాయి. ఆయా కేసుల్లో చంద్రబాబు నిందితుల తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడాడు తప్ప బాధితులకు ఒరగబెట్టిందేమీ లేదు. మహిళలకు పెద్దన్నగా ఉంటానని ఎన్నికల్లో హామీలిచ్చి.. టీవీల్లో డప్పు కొట్టించి.., తీరా గెలిచాక యేరు దాటాక బోడి మల్లన్న చందంగా మార్చేశాడు. మహిళల మీద టీడీపీ నాయకులే దాడులకు తెగబడుతున్నా పట్టించుకన్న పాపాన పోలేదు. వివస్త్రను చేసి కొట్టినా.. ఎమ్మెల్యే బరితెగించి తహసీల్దార్‌ను జుట్టు పట్టి ఈడ్చినా అన్నీ చూసీచూడనట్టు వదిలేశాడు. అంతటి దయా హృదయుడు. దాదాపు పాతిక లక్షల మంది పిల్లల పెళ్లిళ్ల కోసం, ఇళ్లు కట్టుకోవడం కోసం డబ్బు దాచుకుంటే అగ్రిగోల్ఢ్‌ బోర్డు తిప్పేసినా పట్టించుకున్న పాపాన పోలేదు సరికదా.. వారికే చెందిన లింగమనేని గెస్ట్‌ హౌస్‌నే బాబు విజయవాడ విడిది గృహంగా మార్చుకున్నాడటంటే అర్థంకావడం లేదా నిందితుల తరఫున బాబు పనిచేస్తాడని. పదో తరగతి పరీక్షా ప్రశ్నాపత్రం నారాయణ కాలేజీల్లోనే లీకవుతున్నా విచారణ చేయించలేదు. ఇప్పుడు విశాఖలో భారీగా భూ కుంభకోణాలు వెలుగుచూస్తున్నా ఇంతవరకు విచారణకు ఆదేశించలేదు.
 
ప్రతిపక్షానికి సంబంధించినదైతే..
ఎన్నో భారీ కుంభకోణాలను చూసీ చూడనట్టు వదిలేసిన చంద్రబాబు ఎక్కడైనా చిన్న సందర్భంలోనైనా వైయస్‌ఆర్‌సీపీ ప్రమేయం ఉందని అనిపిస్తే చాలు అప్పట్నుంచి వారి టార్గెట్‌ జగన్, వైయస్‌ఆర్‌సీపీనే. కాపుల రిజర్వేషన్‌ ఉద్యమానికి మద్ధతు తెలిపారని తుని ఘటనలోవైయస్‌ఆరీసీపీ నాయకులు టార్గెట్‌ అయ్యారు. ఏమాత్రం సంబంధం లేని భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలను విచారణ పేరుతో వేధించారు. రైలు తగలబెట్టడం వెనుకున్నది వైయస్‌ఆర్‌సీపీ నాయకులే అన్నంతగా ఆ ఇష్యూని హైలెట్‌ చేయడానికి నానా తంటాలు పడ్డారు. తుని సభను చూపించడానికి ఆసక్తి ప్రదర్శించని యెల్లో మీడియా ఆ తర్వాత జరిగిన సంఘటనలు మాత్రం కవర్‌ చేయడంలో అత్యుత్సాహం ప్రదర్శించింది. ఆధారాలు లేకుండానే రైలు తగలబెట్టించింది వైయస్‌ జగనే అన్నంతగా ప్రచారం చేసేశారు. నిన్న జరిగిన సచివాలయంలో వర్షం కురిసిన ఘటనలోనూ అదే జరిగింది. రూ. 900 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన భవనం చిన్నపాటి వర్షానికే గోడలు కూలిపోవడం, ప్రతిపక్ష నాయకుడి ఛాంబర్‌లో కుంభవృష్టి కురవడంతో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అనుకూల మీడియా తొక్కేద్దామని ప్రయత్నించినా సోషల్‌ మీడియా మాత్రం బాబును ఆడేసుకుంది. దాన్ని ఎలా కంట్రోల్‌ చేసుకోవాలో అర్థంకాక జగనే ఇలా చేశాడన్నంతగా కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టింది. పచ్చమీడియాలో ప్రచారం ఊరగొట్టేసింది. స్పీకర్‌ కోడెల స్వయంగా రంగంలోకి దిగి సీఐడీ విచారణ ఆదేశిస్తామని చెప్పడం నవ్వులు పాలైంది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో ప్రతిపక్షానికి సంబంధం ఉన్న అంశాల్లో సీఐడీ విచారణకు ఆదేశించిన టీడీపీ ప్రభుత్వం అన్ని ఆధారాలున్నా టీడీపీ నాయకులకు ప్రమేయం ఉందన్న ఒక్క విషయంలోనూ విచారణకు ఇవ్వకపోవడం ప్రతిపక్షాన్ని అణగదొక్కాలని చూడటమే. 
Back to Top