మాఫీ వెనుక మాయలెన్నో

– రుణమాఫీ బాండ్ల కోసం రైతుల ఎదురుచూపులు

– కార్యాలయాల చుట్టూ తిరగడానికే సరిపోతున్న ఖర్చులు 

– తప్పుల తడకగా రుణమాఫీ పత్రాలు 

పరిశుద్ధమైన మనస్సు లేకుండా చేసిన పని..శుభ్రత లేని పాత్రలో చేసిన వంటకం నిష్ఫలం.. చంద్రబాబు వ్యవహారం అచ్చం అలాగే ఉంది. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడు కాబట్టి.. ప్రతిపక్ష నాయకుడు ప్రజల పక్షాన పోరాడుతున్నాడు కాబట్టి ఏదో మొక్కుబడి రుణమాఫీకి చంద్రబాబు పూనుకున్నాడు. బేషరతుగా రుణాలన్నీ మాఫీ చేస్తానన్న బాబు చివరికి లక్షన్నరకు సరిపెట్టాడు. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అని రైతులు సర్దుకుపోయారు. అయితే ఆ లక్షన్నర మాత్రమైనా సక్రమంగా అమలు చేస్తున్నాడా అంటే అదీ లేదు. రుణమాఫీ మీద ఆశలు పెట్టుకున్న రైతుల పరిస్థితి శంకరగరి మాణ్యాలు పట్టి పోవడమే అన్నట్టు తయారైంది. ఏ క్షణాన రుణమాఫీ హామీ ఇచ్చాడో కానీ కష్టాలు తీరతాయనుకుంటే అదనపు కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్రంలో రుణమాఫీ ప్రక్రియంతా పూర్తయ్యే వరకూ రైతులకు తిప్పలు తప్పేలా లేవు.  రుణ ఉపశమన పత్రాలు అందక, అందినా అందులో తప్పులతో వాటిని మార్పించుకునేందుకు అన్నదాతలు కృష్ణా జిల్లాలోని గన్నవరం బాట పడుతున్నారు. పదిహేను ఇరవై వేలు రుణమాఫీ జరిగితే బాండ్ల కోసం.. అందులో తప్పులు దొర్లితే సరిదిద్దుకోడానికి రైతు సాధికార సంస్థ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిరగడానికి అయ్యే  ఖర్చులు వచ్చిన రుణమాఫీకి సరిపోతున్నాయి. అయితే అధికారులు మాత్రం మరో నాలుగు నెలలు సమయం పడుతుందని తాపీగా సమాధానమిస్తున్నారు. 

మొదటి విడత బాండ్లు ఇప్పటికీ అందలేదు

రాష్ట్రంలో రూ.50,000 పైబడి పంట రుణాలున్న అన్నదాతలందరికీ రుణ ఉపశమన పత్రాలు జారీచేశామని అధికారులంటున్నారు. మరోపక్క ఇప్పటికీ మొదటివిడత రుణమాఫీ అమలై మిగిలిన విడతల మాఫీకి సంబంధించిన బాండ్లు అందనివారు వేలల్లో ఉన్నారు. ఒక్క విజయనగరం జిల్లాలోనే 1,485 బాండ్లు, కర్నూలు జిల్లాలో ఏకంగా 7,156 మందికి అందలేదు. చాలామందికి పత్రాలందినా ఎవరెవరి కుటుంబసభ్యుల పేర్లో నమోదైపోయాయి. కొన్ని బాండ్లు తారుమారైపోయి ఇతర జిల్లాలకు వెళ్లిపోయాయి. వివరాల నమోదులో రేషన్‌కార్డును ఆధారంగా చేసుకోవడంతో కార్డుల్లో తప్పులూ రుణమాఫీకి చిక్కులు తెచ్చిపెట్టాయి. వీటితో పాటు బ్యాంకర్లు వివరాల నమోదులో చేసిన పొరబాట్లూ ఇబ్బందులకు కారణమని రాష్ట్ర ఉన్నతాధికారులు ధ్రువీకరిస్తున్నారు.

పత్రం ఉంటేనే మాఫీ అంటున్న బ్యాంకర్లు 
రుణ ఉపశమన పత్ర సంఖ్యని వెబ్‌సైట్‌లో నమోదు చేయకుండా మాఫీ అయ్యే అవకాశమే లేదు. అందుకే బాండ్లు తేకుండా రుణమాఫీ జరగదని బ్యాంకర్లు తెగేసి చెబుతున్నారు. గతంలో రైతు సాధికార సంస్థ పోర్టల్‌లో రైతులు తమ ఆధార్‌ సంఖ్య నమోదు చేస్తే మాఫీ పరిస్థితి ఏ దశలో ఉందో తెలిసేది. ఇటీవలే పోర్టల్‌ సైతం తీసేశారు. దీంతో పత్రాలు రాని, వివిధ సమస్యలున్న రైతులంతా జిల్లాల్లో పనవ్వక చివరిగా గన్నవరంలోని రైతు సాధికార సంస్థకు వరుస కడుతున్నారు. 

రుణమాఫీకి సంబంధించి కొన్ని ప్రధాన సమస్యలు

చిత్తూరు జిల్లాకు చెందిన ఒక రైతుకు తొలివిడతగా రూ.16,205 మాఫీ చేశారు. రెండో విడతకు సంబంధించి ఇప్పటివరకూ బాండు రాలేదు. బ్యాంకుకు వెళ్తే పత్రం ఉండాల్సిందే అంటున్నారు. గన్నవరం రైతు సాధికార సంస్థకు వెళ్లి అధికారుల్ని కలిస్తే నాలుగు నెలల్లో పంపిస్తామన్నారు.

– మరో రైతు మూడున్నర ఎకరాల పొలానికి రూ.73,000 అప్పు తీసుకున్నాడు. అయితే ఎకరం భూమికే లెక్కేసి రూ.17,100 మాఫీ చేసి వదిలేశారు. 

– ఇంకో రైతుకు ఏడెకరాల పొలం ఉంది. అయితే 1.25 ఎకరాలకే లెక్కగట్టి పద్దెనిమిది వేలు రుణమాఫీ చేశారు. రెండోవిడత బాండు ఇప్పటికీ రాలేదు. జిల్లా కార్యాలయంలో అడిగితే తమ దగ్గర లేదంటున్నారు. 

– ఇంకో రైతు పరిస్థితి మరీ విచిత్రంగా ఉంది. కుటుంబానికి లక్షన్నర మాఫీ జరిగినట్లుగా ఉపశమన పత్రం వచ్చింది. కానీ రూ.19,000 మాత్రమే మాఫీ చేశారు. మిగతా సొమ్ము కోసం బ్యాంకుకు బాండు తీసుకెళ్తే ఆన్‌లైన్‌లో రాలేదంటున్నారు.

తాజా వీడియోలు

Back to Top