అంకెల గారడీ..అబద్ధాల పుట్ట

– బాబు ఎన్నికల హామీకి తీసిపోని విధంగా బడ్టెట్‌
– బాబువన్నీ ఉత్తర కుమారుడి ప్రగల్భాలేనని స్పష్టం
– అబద్ధాల ప్రయాణంలో మరో మైలురాయి

ఏపీ బడ్జెట్ ను చూస్తే చంద్రబాబుకు యనమల అంటే ఎందుకు అంతిష్టమో తెలిసిపోతుంది. బాబు మనసెరిగి నడుచుకుంటున్నందుకేనేమో అంత ప్రాధాన్యం అని తెలిసిపోతుంది. ఆయనగారు ప్రవేశపెట్టిన బడ్టెట్‌ చంద్రబాబు ఎన్నికల హామీలకు ఏమాత్రం తీసిపోకుండా తీర్చిదిద్దారు. ఎన్నికలకు ముందు ఏదేదో చేస్తామన్నారు. ఎవరూ అడక్కపోయినా నిరుద్యోగ భృతి అన్నారు.. రుణమాఫీ అన్నారు.., డ్వాక్రా అక్కచెల్లమ్మలకు రుణాలన్నారు.,, గెలిచాక అంతా ఉత్తమాటలేనని తేల్చేశారు. ఇస్తామని చెబుతుంటాం.. నమ్మడం మీ తప్పుకానీ మాదెలా అవుతుంది అన్నట్టుగా ఇప్పటి పరిస్థితి. సరిగ్గా బడ్జెట్‌ కూడా అందుకు భిన్నంగా ఏమీ లేదు. హామీలు చూస్తేనేమో చాతాడంత ఉంటే నిధులు మాత్రం మోచేయంత కూడా లేవు. అయినా సరే అద్భుతం.. మహాద్భుతమని పచ్చదొరలు తొడలు చరుచుకుంటారు. 

రుణమాఫీకి 3600 కోట్లేనా.?
రుణమాఫీ కోసం ఈ బడ్జెట్‌ రూ.3,600 కోట్లు కేటాయించామని గొప్పగా చెప్పారు. ఇప్పటివరకూ మూడేళ్లలో రుణ మాఫీ పథకానికి రూ.10,600 కోట్లు ఇచ్చారు. సంవత్సరానికి సగటున రూ.3,500 కోట్లు ఇచ్చారని అనుకోవచ్చు. రైతుల వ్యవసాయ రుణాలు మొత్తం రూ.87,612 కోట్లు ఉంటే చంద్రబాబు ఏడాదికి ముష్టివేసినట్లు రూ.3,500 కోట్లు ఇచ్చి రుణమాఫీ చేసినట్లు చెబుతూ రైతుల చెవుల్లో క్యాలీఫ్లవర్‌ పెడుతున్నారు. రైతులు ప్రతి సంవత్సరం వడ్డీ కింద రూ.16,000 కోట్లు చెల్లిస్తున్నారు. వడ్డీలో పావలా వంతు భాగం కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదు. మరోవైపు రైతులకు పంట రుణాలు అందడం లేదు. 

డ్వాక్రా రుణాలు వడ్డీలకే సరిపోవడం లేదు
చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి డ్వాక్రా రుణాలు రూ.14,200 కోట్లు ఉండేవి. ఇవాళ బ్యాంకులు ఆ అప్పులపై 18 నుంచి 20 శాతం వడ్డీ వసూలు చేస్తున్నాయి. ఆ వడ్డీ సంవత్సరానికి రూ.2,600 కోట్లు. మూడేళ్లలో రూ.7,500 కోట్లు ఇప్పటికే దాటిపోయింది. నాలుగో సంవత్సరం వచ్చింది కాబట్టి డ్వాక్రా మహిళలపై వడ్డీ భారమే రూ.10 వేల కోట్లు. పైగా వారికి రూ.4,900 కోట్లు అప్పు ఇచ్చినట్టు చెప్పుకున్నాడు. మళ్లీ రూ.1,600 కోట్లు క్యాపిటల్‌ ఇన్‌ఫ్యూజన్‌(పెట్టుబడి నిధి) కింద ఇస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఆయన ఇచ్చింది వడ్డీలకు కూడా సరిపోవడం లేదు. 2015–16 సంవత్సరానికి రూ.575 కోట్లు వడ్డీలేని రుణాలకు ఇవ్వాల్సిన వడ్డీని చంద్రబాబు ఇవ్వలేదు. 2016–17కు సంబంధించి మరో రూ.996 కోట్లు ఇవ్వలేదు. కేవలం రూ.110 కోట్లు ఖర్చుపెట్టారు. 2015 సెప్టెంబర్‌ నుంచి ఇంతవరకూ వడ్డీలేని రుణాలకు సంబంధించిన డబ్బులు ఇవ్వలేదు.

పేరుకుపోతున్న ఫీజు బకాయిలు 
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు బడ్జెట్‌లో రూ.1,300 కోట్లు మాత్రమే కేటాయించారు. 2015–16లో 15,13,883 మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం దరఖాస్తు చేస్తే, ఇందులో భారీగా కోతలు విధించారు. వీరికి రూ.2,578 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో ప్రభుత్వం విడుదల చేసింది రూ.1,579 కోట్లు మాత్రమే. అంటే ఈ సంవత్సరంలో బకాయిలే రూ.999 కోట్లు ఉన్నాయి. 2016–17లో 15,80191 మంది దరఖాస్తు చేస్తే ఇందులో కోతలు కోసి 14.42 లక్షల మందికి తగ్గించారు. వారికి ఇవ్వాల్సింది రూ.2,481 కోట్లయితే ఇచ్చింది మాత్రం రూ.527 కోట్లే. అంటే ఇంకా రూ.1,954 కోట్లు ఇవ్వాలి.

5.3 లక్షల ఇళ్లకు పాత బకాయిలు రాలేదు
రెండేళ్లలో 10 లక్షల ఇళ్లు కడతామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈ ఏడాది 4 లక్షల ఇళ్ల కోసం నిధులు కేటాయిస్తున్నామన్నారు. ఒకసారి గమనిస్తే 2014–15లో రెండు లక్షల ఇళ్లు కడతామన్నారు. కొత్తగా ఒక్క ఇళ్ల్లయినా నిర్మించలేదు. గతంలో అర్ధాంతరంగా ఆగిపోయిన 5.3 లక్షల ఇళ్లకు బిల్లులు కూడా చెల్లించలేదు. 

రూ. 500 కోట్లతో నిరుద్యోగ భృతి ఎంతిస్తారు
జాబు రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని.. జాబు వచ్చేంత వరకూ ప్రతి ఇంటికి నెలకు రూ.2 వేల నిరుద్యోగ భతి ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు గొప్పగా చెప్పారు. ఈ అంశాన్ని టీడీపీ మెనిఫెస్టోలో కూడా పెట్టారు. రాష్ట్రంలో 1.75 లక్షల ఇళ్లు ఉన్నాయి. ఇలా ఇంటికి రూ.2 వేల చొప్పున నెలకు రూ.3,500 కోట్లు.. ఏడాదికి రూ.40 వేల కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ, చంద్రబాబు మాత్రం బడ్జెట్‌లో ముష్టి వేసినట్లుగా కేవలం రూ.500 కోట్లు విదిల్చారు. ఆ సొమ్మును కూడా టీడీపీ కార్యకర్తలు, జన్మభూమి కమిటీల సభ్యుల పిల్లలకే ఇస్తారు.

రూ.100 కోట్లతో 7.50 లక్షల మరుగుదొడ్లు సాధ్యమా..? 
రాష్ట్రంలో 7.50 లక్షల మరుగుదొడ్లు నిర్మించబోతున్నామని, ఏపీ బహిరంగ మలవిసర్జన రహిత రాష్ట్రమని చంద్రబాబు ప్రకటించుకున్నాడు. 7.50 లక్షల మరుగుదొడ్లు కడతానని చెప్పిన చంద్రబాబు దానికి బడ్జెట్‌లో కేటాయించిన నిధులు కేవలం రూ.100 కోట్లు. 7.50 లక్షల మరుగుదొడ్లు కట్టాలంటే ఒక్కొక్కటీ రూ.15 వేలు వేసుకున్నా రూ.1,050 కోట్లు కావాలి. ప్రభుత్వం ఇస్తానన్నది రూ.వంద కోట్లు. 

ఆరోగ్యశ్రీకి అరకొర నిధులే
ఆరోగ్యశ్రీకి రాష్ట్ర బడ్జెట్‌లో అరకొరగా రూ.1,000 కోట్లే కేటాయించారు. గతేడాది 910 కోట్లు అడిగితే బడ్జెట్‌లో రూ.500 కోట్లే కేటాయించారు. ప్రకాశం జిల్లాలో వైయస్‌ జగన్‌ ధర్నాలు చేస్తే మరో రూ.262 కోట్లు ఇచ్చారు. 2015–16 కింద రూ.280 కోట్ల బకాయిలు ఉన్నాయి. 2016–17 కింద ఇంకా రూ.488 కోట్లు చెల్లించాల్సి ఉంది. ‘108’ కోసం అధికారులు రూ.75 కోట్లకు ప్రతిపాదనలు పంపితే ప్రభుత్వం ఇచ్చింది రూ.60 కోట్లు. బకాయిలు రూ.15 కోట్లు ఉన్నాయి. ‘104’కు రూ.80 కోట్లు అడిగితే రూ.37.5 కోట్లు కేటాయించారు. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు 8 నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో.. ఆరోగ్యశ్రీ కింద రోగులకు వైద్యం అందించేందుకు నిరాకరిస్తున్నారు. కిడ్నీ వ్యాధి గ్రస్తులు, క్యాన్సర్‌ బాధితుల పరిస్థితి దారుణంగా మారింది.

అమరావతి అధోగతే..?
ప్రపంచ స్థాయి రాజధానికి బడ్జెట్‌లో నామమాత్రపు నిధులు కూడా విదల్చలేదు. రూ.వేల కోట్లతో ప్రతిపాదనలు తయారు చేయిస్తూ చివరికి అందులో పది శాతం కూడా కేటాయించకలేదు. అమరావతిలో వివిధ ప్రాజెక్టులకు రూ.1,061 కోట్లు మాత్రమే కేటాయించారు. 

ఈ గొప్పలన్నీ దేనికోమరి..?
హైదరాబాద్‌ రహదారికి రాజధానిని అనుసంధానం చేస్తూ కృష్ణానదిపై నిర్మించే ఐకానిక్‌ బ్రిడ్జికి రూ.800 కోట్లు అవసరమని అంచనా వేశారు. ఇవికాకుండా భవనాల డిజైన్లు, వాటి నిర్మాణానికి భారీగా నిధులు కావాలని సీఆర్‌డీఏ ప్రతిపాదనలు తయారు చేసింది. వీటితోపాటు మిగిలిన రాజధాని ప్రాజెక్టులు, అక్కడి పనుల కోసం మొత్తం రూ.41,235 కోట్లు కావాలని, అందులో ఈ ఒక్క సంవత్సరమే రూ.5,468 కోట్లు అవసరమని సీఆర్‌డీఏ ఒక నోట్‌ తయారు చేసింది. రూ.వేల కోట్లు అవసరమైన రాజధానికి బడ్జెట్‌లో ప్రభుత్వం మొండిచేయి చూపడంపై సీఆర్‌డీఏ వర్గాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.

40 వేల కోట్లు అవసరమన్నారు.. 5 వేల కోట్లిచ్చారు
సాగునీటి రంగానికి తాజా బడ్జెట్‌లో కేవలం రూ.12,770.26 కోట్లు మాత్రమే కేటాయించారు. ఇందులో నాబార్డు రుణ రూపంలో కేంద్రం విడుదల చేస్తుందని అంచనా వేస్తున్న నిధులే రూ.7,665.30 కోట్లు ఉన్నాయి. అంటే.. రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధుల్లో కేవలం రూ.5,104.96 కోట్లను మాత్రమే సాగునీటి ప్రాజెక్టులకు కేటాయించినట్లు స్పష్టమవుతోంది. ఇక మిగిలింది ఒక్క బడ్జెట్‌ (2018–19) మాత్రమే. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రూ.40 వేల కోట్లు అవసరం అవుతాయని.. వాటిని సత్వరమే పూర్తి చేసి కోటి ఎకరాలకు నీళ్లందిస్తామని 2014 ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక నాలుగు బడ్జెట్లు (2014–15, 2015–16, 2016–17, 2017–18) ప్రవేశపెట్టారు. గత మూడు బడ్జెట్లలో కలిపి రూ.19,468.76 కోట్లు కేటాయించారు.

రూ.2 కోట్లతో రూ.1,638 కోట్ల పనా?
ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించి సస్యశ్యామలం చేసేందుకు రూ.1,638 కోట్లతో పురుషోత్తపట్నం ఎత్తిపోతలను చేపట్టినట్లు సర్కార్‌ ప్రకటించింది. తొమ్మిది నెలల్లోగా ఈ ఎత్తిపోతలను పూర్తి చేసి పోలవరం ఎడమ కాలువ కింద 2.15 లక్షల ఎకరాలకు 2017 ఖరీఫ్‌లో నీళ్లందిస్తామని హామీ ఇచ్చింది. కానీ.. ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి కేవలం రూ.2 కోట్లు మాత్రమే కేటాయించింది. రూ.2 కోట్లతో రూ.1,638 కోట్ల పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకాన్ని ఎలా పూర్తి చేస్తారో ముఖ్యమంత్రికే తెలియాలి. హంద్రీ–నీవా, గాలేరు–నగరి తొలి దశ, గుండ్లకమ్మ, వంశధార రెండో దశ, పోలవరం ఎడమ కాలువను పూర్తి చేసి 2017 ఖరీఫ్‌లో 8.86 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తామని బడ్జెట్‌లో పేర్కొంది. కానీ ఆ మేరకు నిధులు కేటాయించలేదు. కమీషన్‌ల కోసం హంద్రీ–నీవా అంచనా వ్యయం రూ.6,850 కోట్ల నుంచి రూ.11,722 కోట్లకు పెంచేసిన నేపథ్యంలో.. ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే రూ.1,900 కోట్లకుపైగా అవసరం. కానీ.. బడ్జెట్‌లో కేవలం రూ.479.20 కోట్లను కేటాయించారు. గాలేరు–నగరి, శ్రీశైలం కుడిగట్టు కాలువ(ఎస్సార్బీసీ), వెలిగొండ, సోమశిల, తెలుగుగంగ తదితర ప్రాజెక్టులదీ ఇదే దుస్థితి.

Back to Top