టీడీపీ భూదందాపై విచారణ జరిపించాలి

పేద రైతులు, దళితుల పొట్టగొట్టి...
బినామీల పేర  పచ్చనేతలు వేల ఎకరాల దోపిడీ
టీడీపీ కుంభకోణాలపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలి
టీడీపీ భూదోపిడీపై  ప్రజలు ఆలోచన చేయాలిః బొత్స

హైదరాబాద్ః  రాజధాని ముసుగులో టీడీపీ భూ కుంభకోణాలకు పాల్పడుతుందని తాము చెప్పిందే నిజమైందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు, ఆ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు భూ దోపిడీ చేస్తున్నారని ఎన్నో సందర్భాల్లో చెప్పామన్నారు. ఆధారాలతో సహా చూపించినా రాజధానికి వ్యతిరేకమంటూ టీడీపీ తమపై ముద్ర వేసి ఎదురుదాడికి దిగిందన్నారు.  ఓ  ప్రముఖ పత్రికలో  భూదందాకు పాల్పడిన వారి పేర్లతో పాటు ఎవరెవరు ఎన్ని ఎకరాల్ని అగ్రిమెంట్లు చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకొన్నారో వచ్చిందన్నారు. టీడీపీ నేతలు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.  

నారా లోకేశ్, మంత్రులు నారాయణ, పత్తిపాటి పుల్లారావు, రావెల కిశోర్, దేవినేని ఉమమహేశ్వరరావు, సుజనా చౌదరి, మురళీ మోహన్ వేల ఎకరాలను తన బినామీలకు దోచిపెట్టారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు . ఇప్పటివరకు కొన్ని పేర్లే బయటకు వచ్చాయని, ఇంకా ఈ భూ దందాలో చాలామంది ఉన్నారని బొత్స పేర్కొన్నారు. పేద రైతులు, దళితులకు సంబంధించిన అసైన్డ్ భూమూలకు తక్కువ ధర చెల్లించి వారిని మోసం చేశారని దుయ్యబట్టారు. రాజధాని ప్రకటనకు ముందే అన్నివేల ఎకరాలు ఎందుకు కొన్నారో చెప్పాలని ప్రశ్నించారు.  బినామీల భూముల కోసమే రాజధాని ప్రకటన చేసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. టీడీపీ సర్కార్ భూ దోపిడీపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల చేత విచారణ జరిపించాలని బొత్స డిమాండ్ చేశారు

రాష్ట్రంలో 13 జిల్లాలు ఉంటే...విజయవాడలోనే భూములు ఎందుకు కొన్నారని బొత్స బాబు అండ్ కోను ప్రశ్నించారు. తమ వారికి మేలు చేయాలనే ఉద్దేశంతోనే బాబు శివరామకృష్ణ కమిటీ నివేదికను పక్కన పెట్టారన్నారు. హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మాణ సమయంలోను చంద్రబాబు ఇలాగే చేసి బినామీలకు మేలు చేశారని బొత్స ఫైరయ్యారు. రాజధాని భూముల విషయంలో తప్పు చేయకంటే చంద్రబాబు నిజాయితీని నిరూపించుకోవాలన్నారు. మీ స్వార్థపూరిత దోపిడీ కోసం రాష్ట్ర ప్రజానీకాన్ని బలిచేయొద్దని బాబుకు హితవు పలికారు. 

టీడీపీ ప్రభుత్వం భూ దందాపై జ్యుడిషియల్ విచారణ జరిపించాలని బొత్స డిమాండ్ చేశారు. పట్టిసీమ ఒక అవినీతి ప్రాజెక్ట్ అని...పోలవరంలో అంతర్భాగం కాదని  మొదట్నుంచీ చెబుతూనే ఉన్నామన్నారు. మేం చెప్పిన విషయాన్నే బీజేపీ నేతలు కూడా చెబుతున్నారని బొత్స చెప్పారు. ఎన్నికల్లో మూటలు మోసిన వారికోసమే చంద్రబాబు  పట్టిసీమను తీసుకొచ్చారని తూర్పారబట్టారు. బాబు అధికార, ధనదాహం కోసం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పణంగా పెడుతున్నారని బొత్స ధ్వజమెత్తారు. ప్రాజెక్టుల్లో దోపిడీపై విచారణ జరిపించాలని బీజేపీ నేతలను కోరారు. 

విచ్చలవిడిగా దందాలు చేస్తూ నీను నీతివంతుడ్ని రోల్ మోడల్ అని చంద్రబాబు మాట్లాడడం సిగ్గుచేటని బొత్స ఫైరయ్యారు. దోచుకోవడమేనా బాబు మీ రోల్ మోడల్ అని ఎద్దేవా చేశారు. టీడీపీలోని ఓ ఎమ్మెల్యే వియ్యంకుడుకు జగ్గయ్యపేటలో భూమి ఉందని... గ్రీన్ ఫీల్డ్ నుంచి తీసేసి కమర్షియల్ జోన్ లోకి మార్చేశారని మండిపడ్డారు. చంద్రబాబు రాజధానిలోని అక్రమ కట్టడంలో నివాసముంటూ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సర్కార్ భూకుంభకోణాలు, అవినీతి పాలన గురించి రాష్ట్ర ప్రజానీకం ఆలోచన చేయాలని బొత్స సూచించారు. తాము రాజధానికి వ్యతిరేకం కాదని, రాజధాని పేరుతో సాగుతున్న కుంభకోణాలకు వ్యతిరేకమని బొత్స మరోసారి స్పష్టం చేశారు. 

 


Back to Top