చిన మాయను పెద మాయ.. పెద మాయను పెను మాయ ... అటు నేనే.. ఇటు నేనే... అంటూ కూని రాగం తీస్తున్నాడు అహోబలరావు. ఇంట్లో ఉండగా ఎప్పడూ నోరెత్తే ధైర్యం చేయని రావు గొంతు విని ఆశ్చర్యపోయాడు పక్కింటి పరమేష్. ఏంటి సంగతి ఇంట్లో ఎవరూ లేరా ఏంటి అని ప్రశ్నించాడు. ఏమిటయ్యా ఫ్యాను కూడా వేసుకోకుండా కూర్చున్నావ్.. అంటూ అలవాటు ప్రకారం స్విచ్ బోర్డు మీద వేలేశాడు. గూబగుయ్యిమనేలా లాగిపెట్టి షాక్ కొట్టింది. ఆ ధాటికి కింద కూలబడిన పరమేష్‌కు నక్షత్రాలు కనిపించాయి. రావు పరుగెత్తుకుని వెళ్ళి తెచ్చిన మంచినీటి తాగి కాస్త తెరిపిన పడ్డాడు. ఏమైంది నాకు అంటూ జీరబోయిన గొంతుతో అడిగాడు. ఇదిగో ఇప్పుడే చెబతున్నా.. అలవాటే కదా అని మా ఇంట్లో ఎక్కడా చేతులెయ్యకు.. హెచ్చరించాడు రావు. సర్లే అనుకుంటూ మెల్లిగా ఇంటి దారి పట్టాడు పరమేష్. మన వాటాలో ఉన్న కరెంటు వాడి వాటాలో ఎందుకు లేదో అర్థం కాక జుట్టు పీక్కున్నాడు. సోఫాలో కూలబడి టీవీ ఆన్ చేశాడు. మన ప్రియతమ ముఖ్యమంత్రిగారు తెరపై ప్రత్యక్షమయ్యారు. వచ్చీరాని తెలుగులో ఈయనేం చంపుకు తింటాడో అనుకుంటున్న ఆయనకు కరెంట్ అనే పదం వినపడింది. పరవాలేదు.. నాకూ అర్థమవుతోందే అనుకుంటూ విననారంభించాడు. ముఖ్యమంత్రిగారి ప్రసంగం ఇలా సాగుతోంది.. స్విచ్చులాపేయండి... అదేనండి మీ ఇంట్లో దీపాలు అనవసరం లేకుంటే వాటిని ఆపేయండి. టీవీలు చూసినంక రిమోట్‌తో కాకుంట దగ్గరకి పోయి టీవీ స్విచ్చులాపేయండి. ఇట్టజేస్తే ఒక్క హైదరబాద్ సిటీకిట్ట వందకి 20 శాతం కరెంటు వాడకం తగ్గిపోతది. అట్ట తగ్గే కరెంటుతో గింకో ప్రాంతానికి కరెంటీయొచ్చు..ఇలా సాగుతున్న సీయం ప్రసంగంతో దిమ్మదిరిగిపోయింది పరమేష్‌కి. ఏంటీ పెద్ద మనిషి ఇలా అంటాడనుకుంటూ మళ్ళీ తనకి తగిలిన కరెంట్ షాక్ గురించి ఆలోచించసాగాడు. స్విచ్చులు కట్టేసున్న అహోబలరావు ఇంట్లో కరెంటే లేదు కదా.. షాక్ ఎలా తగిలిందో ఎంత బుర్ర చించుకున్నా తట్టలేదు. అదేదో అక్కడే తేల్చుకుందామనుకుని అటు అడుగేశాడు. తెరచున్న తలుపు కూడా తగలకుండా జాగ్రత్తగా లోపలికి అడుగేశాడు. అక్కడి దృశ్యం అతడిని నిరుత్తరుణ్ణి చేసింది. గోడకున్న స్విచ్ బోర్డుకు స్విచ్‌ల స్థానంలో కన్నాలు కనిపించాయి. స్విచ్చుల్ని ఎడం చేతిలో పట్టుకుని కుడిచేతిలో ఉన్న విసనకర్రతో విసురుకుంటూ జోగుతున్నాడు రావు. ఏమయ్యా ఇదేం పని అని నిలదీశాడు. మా యింట్లో పిల్లలు ఇంటంలే... అందుకే సీఎం చెప్పినట్టు ఆపడం కాకుండా స్విచ్చులే పీకేశానంటూ చల్లగా సెలవిచ్చాడు రావు.